india red
-
‘డ్రా’ దిశగా...
బెంగళూరు: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా గ్రీన్, ఇండియా రెడ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ‘డ్రా’ దిశగా సాగుతోంది. మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ‘రెడ్’ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 404 పరుగులు చేసింది. మహీపాల్ లోమ్రోర్ (126; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించగా... కరుణ్ నాయర్ (90; 16 ఫోర్లు) శతకం కోల్పోయాడు. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ (38), అవేశ్ (34 బ్యాటింగ్), ఉనాద్కట్ (30) ఫర్వాలేదని పించారు. ధర్మేంద్ర సింగ్ జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మూడు రోజుల తర్వాత కూడా రెండు ఇన్నింగ్స్‌లు పూర్తి కాకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమైంది. ఆదివారం మ్యాచ్‌కు చివరి రోజు. ‘గ్రీన్’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 440 పరుగులకు ‘రెడ్’ మరో 36 పరుగుల దూరంలో ఉంది. అయితే చేతిలో ఒకే వికెట్ ఉండటంతో గ్రీన్ ఆధిక్యం సాధించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే గ్రీన్ జట్టుకు 3, రెడ్ జట్టుకు 1 పాయింట్ దక్కుతాయి. అప్పుడు చెరో 4 పాయింట్లతో ఈ రెండు జట్లు బ్లూ (2)ను వెనక్కి నెట్టి ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. -
ఇండియా ‘బ్లూ’ 260/5
దిండిగల్: ఇండియా ‘రెడ్’తో మంగళవారం మొదలైన దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ‘బ్లూ’ తొలి రోజు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి ఇండియా ‘బ్లూ’ ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అన్మోల్ప్రీత్ సింగ్ (147 బంతుల్లో 96; 14 ఫోర్లు, 1 సిక్స్), ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ (136 బంతుల్లో 53 బ్యాటింగ్, 5 ఫోర్లు) ఐదో వికెట్‌కు 144 పరుగులు జోడించి ‘బ్లూ’ జట్టును ఆదుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ‘బ్లూ’ జట్టుకు ఓపెనర్లు ఫైజ్ ఫజల్ (32), స్మిత్ పటేల్ (22) అర్ధ శతక భాగస్వామ్యం అందించారు. అయితే వీరిద్దరితో పాటు ధ్రువ్ షోరే (18), దీపక్ హుడా (26) వెంటవెంటనే ఔటవ్వడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో అన్మోల్ప్రీత్, రికీ భుయ్ బాధ్యతాయుత ఆటతో జట్టును ఆదుకున్నారు. శతకానికి కొద్ది దూరంలో అన్మోల్ను ప్రసిధ్ కృష్ణ (2/49) ఔట్ చేశాడు. మరో బౌలర్ పర్వేజ్ రసూల్ (2/65) రెండు వికెట్లు పడగొట్టాడు. -
‘దులీప్’ మ్యాచ్ మూడో రోజు వర్షార్పణం
కాన్పూర్: ఇండియా ‘రెడ్, ఇండియా ‘బ్లూ’ జట్ల మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ డే అండ్ నైట్ మ్యాచ్‌కు వాన అడ్డంకిగా నిలిచింది. భారీ వర్షం కారణంగా మూడో రోజు శుక్రవారం కేవలం 4.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మైదానం ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో మిగతా ఆటను రద్దు చేశారు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 232 పరుగులు చేసిన బ్లూ మరో 151 పరుగులు వెనుకబడి ఉంది. శనివారం మ్యాచ్‌కు చివరి రోజు. -
రాణించిన విహారి
∙ ఇండియా ‘బ్లూ’ 216/3 ∙ దులీప్ ట్రోఫీ మ్యాచ్ కాన్పూర్: ఇండియా ‘రెడ్’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా ‘బ్లూ’ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆంధ్ర ఆటగాడు గాదె హనుమ విహారి (163 బంతుల్లో 86 బ్యాటింగ్; 14 ఫోర్లు) సెంచరీ దిశగా సాగుతుండగా... కెప్టెన్ సురేశ్ రైనా (82 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం విహారితో పాటు దీపక్ హుడా (23 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు రెడ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 291/9తో ఆట కొనసాగించిన ఆ జట్టు రెండో రోజు 24.3 ఓవర్లలో మరో 92 పరుగులు జత చేసింది. బాబా ఇంద్రజిత్ (280 బంతుల్లో 200; 20 ఫోర్లు, 6 సిక్సర్లు) తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో తొలి డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇంద్రజిత్, విజయ్ గోహిల్ చివరి వికెట్‌కు ఏకంగా 178 పరుగులు జోడించారు. బ్లూ బౌలర్లలో రాజ్‌పుత్‌కు 3 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం బ్లూ తొలి ఇన్నింగ్స్‌లో మరో 167 పరుగులు వెనుకబడి ఉంది. -
ప్రియాంక్ సెంచరీ: ఇండియా ‘రెడ్’ 232/5
లక్నో: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇండియా ‘గ్రీన్’ జట్టుతో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల లీగ్ మ్యాచ్‌లో తొలి రోజు ఇండియా ‘రెడ్’ జట్టు ఆచితూచి ఆడింది. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పింక్ బంతితో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ‘రెడ్’ 86 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ (105; 12 ఫోర్లు) సెంచరీ చేయగా... సుదీప్ చటర్జీ (52; 5 ఫోర్లు) రాణించాడు. దినేశ్ కార్తీక్ (15 బ్యాటింగ్), గౌతమ్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇండియా ‘గ్రీన్’ జట్టులో పార్ట్‌టైమ్ బౌలర్లు కరుణ్ నాయర్, మురళీ విజయ్‌లకు రెండేసి వికెట్లు దక్కడం విశేషం. -
ఆ రెండింటికీ వ్యత్యాసం ఏమీ లేదు: గంభీర్
కోల్‌కతా:దేశవాళీ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో భాగంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి పింక్ బాల్‌తో నిర్వహిస్తున్న టెస్టు మ్యాచ్‌లో తాను ఎటువంటి ఇబ్బందులేమీ కనబడలేదని టీమిండియా ఆటగాడు గౌతం గంభీర్ స్పష్టం చేశాడు.ఇప్పటికే పింక్ బాల్ కు సంబంధించి పలు రకాల అభిప్రాయలు వెలువడిన నేపథ్యంలో గంభీర్ స్పందించాడు. ' పింక్ బాల్ మ్యాచ్‌కు ఎటువంటి అడ్డూలేదు. కేవలం బంతి కలర్ మాత్రమే ఇక్కడ మారింది. మిగతా అంతా సంప్రదాయ ఎర్రబంతి తరహాలోనే ఉంది. కోకోబుర్రా పింక్ బాల్ బంతి ఎరుపు, తెలుపు బంతులు మాదిరిగానే ఉంది. పింక్ బాల్ ఎక్కువ స్వింగ్ అవుతుందని, ఏదో అద్భుతం జరిగిపోతుందనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. నేనైతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొలేదు'అని గంభీర్ తెలిపాడు. శనివారం నుంచి జరుగునున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో గంభీర్ నేతృత్వంలోని ఇండియా బ్లూతో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా రెడ్ తలపడనుంది. -
ఇండియా బ్లూ 200/5
గ్రేటర్ నోయిడా: ఇండియా రెడ్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో రెండో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇండియా బ్లూ తమ తొలి ఇన్నింగ్సలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (92) సెంచరీ చేజార్చుకోగా, గౌతం గంభీర్ (77) రాణించాడు. రెడ్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 49 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. -
ఆదిలోనే అవాంతరం!
రెండుసార్లు ఆగిన ఫ్లడ్‌లైట్లు * దులీప్ ట్రోఫీ ‘పింక్‌బాల్’ మ్యాచ్ * తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం గ్రేటర్ నోయిడా: బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా పింక్ బంతితో తొలిసారి నిర్వహించిన డే అండ్ నైట్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కు మొదటి రోజే అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇండియా రెడ్, ఇండియా గ్రీన్ జట్ల మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో మంగళవారం రెండు సార్లు ఫ్లడ్ లైట్లు ఆరిపోయాయి. దాంతో గంటకు పైగా ఆటకు అంతరాయం కలిగింది. ఇండియా గ్రీన్ ఇన్నింగ్స్ సందర్భంగా మూడు ఓవర్ల తర్వాత డిన్నర్బ్రేక్ సమయంలో లైట్లు ఆగడంతో 17 నిమిషాలు ఆట ఆలస్యమైంది. ఆ తర్వాత 9.3 ఓవర్ల తర్వాత మళ్లీ చీకటి కమ్మేసింది. దాంతో లైట్లను పునరుద్ధరించేందుకు దాదాపు గంట సమయం పట్టింది. పింక్‌బాల్‌తో తొలి మ్యాచ్‌ను పేరున్న స్టేడియంలో కాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించడంతో బోర్డుకు భంగపాటు ఎదురైంది. ఈ గ్రౌండ్లో ఇదే తొలి డే అండ్ నైట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో పింక్ బంతి పేస్ బౌలర్లకు బాగా సహకరించింది. ఒక్క రోజులోనే మొత్తం 17 వికెట్లు పడ్డాయి. గ్రీన్ ఆటగాడు సందీప్ శర్మ (4/62) చెలరేగడంతో ఇండియా రెడ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 48.2 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. ముకుంద్ (77) రాణించగా, యువరాజ్ (4) సహా అంతా విఫలమయ్యారు. అనంతరం గ్రీన్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేయగలిగింది. రైనా (35)దే అత్యధిక స్కోరు. ప్రస్తుతం గ్రీన్ మరో 45 పరుగులు వెనుకబడి ఉంది. నాథూ సింగ్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. -
చెలరేగిన యువరాజ్: ఫైనల్లో ఇండియా-బ్లూ
ఇండోర్: భారత సీనియర్ జట్టులో పునరాగమనానికి యువరాజ్ సింగ్ తన వైపునుంచి ఎలాంటి అవకాశాన్ని వృథా చేయడానికి ఇష్ట పడటం లేదు. ఇటీవలే వెస్టిండీస్ ‘ఎ’పై మూడు వన్డేల్లో చెలరేగిన యువీ, ఇప్పుడు చాలెంజర్ టోర్నీలోనూ సత్తా చాటాడు. వెన్ను నొప్పితో ఈ టోర్నీ తొలి మ్యాచ్‌కు దూరమైన అతను శుక్రవారం ఇండియా ‘రెడ్’తో జరిగిన వన్డేలో చెలరేగాడు. యువరాజ్ సింగ్ (53 బంతుల్లో 84; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), అభిషేక్ నాయర్ (39 బంతుల్లో 75 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుతో ఇండియా ‘బ్లూ’ 11 పరుగుల తేడాతో రెడ్‌పై విజయం సాధించింది. టోర్నీలో వరుసగా రెండు వన్డేలు నెగ్గిన ‘బ్లూ’ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగే ఢిల్లీ, ఇండియా ‘రెడ్’ జట్ల మ్యాచ్ విజేతతో ‘బ్లూ’ ఫైనల్లో (ఆదివారం) తలపడుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ‘బ్లూ’ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 345 పరుగుల భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ క్రికెటర్ అక్షత్ రెడ్డి (96 బంతుల్లో 84; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో సారి ఆకట్టుకోగా, మనీశ్ పాండే (86 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా రాణించాడు. అనంతరం విజయం కోసం చివరి వరకు పోరాడిన ‘రెడ్’ 49.5 ఓవర్లలో 334 పరుగులకు ఆలౌటైంది. ముకుంద్ (86 బంతుల్లో 83; 9 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ పటేల్ (84 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, జాదవ్ (40 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. బ్లూ బౌలర్లలో వినయ్‌కుమార్‌కు 4 వికెట్లు దక్కాయి.