రాణించిన విహారి
∙ ఇండియా ‘బ్లూ’ 216/3
∙ దులీప్ ట్రోఫీ మ్యాచ్
కాన్పూర్: ఇండియా ‘రెడ్’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా ‘బ్లూ’ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆంధ్ర ఆటగాడు గాదె హనుమ విహారి (163 బంతుల్లో 86 బ్యాటింగ్; 14 ఫోర్లు) సెంచరీ దిశగా సాగుతుండగా... కెప్టెన్ సురేశ్ రైనా (82 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం విహారితో పాటు దీపక్ హుడా (23 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు రెడ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది.
ఓవర్‌నైట్ స్కోరు 291/9తో ఆట కొనసాగించిన ఆ జట్టు రెండో రోజు 24.3 ఓవర్లలో మరో 92 పరుగులు జత చేసింది. బాబా ఇంద్రజిత్ (280 బంతుల్లో 200; 20 ఫోర్లు, 6 సిక్సర్లు) తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇంద్రజిత్, విజయ్ గోహిల్ చివరి వికెట్‌కు ఏకంగా 178 పరుగులు జోడించారు. బ్లూ బౌలర్లలో రాజ్‌పుత్‌కు 3 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం బ్లూ తొలి ఇన్నింగ్స్‌లో మరో 167 పరుగులు వెనుకబడి ఉంది.