ఆంధ్ర జట్టుకు తప్పని ‘డ్రా’
ఉత్తరాఖండ్‌తో రంజీ మ్యాచ్
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో తొలి విజయం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న ఆంధ్ర జట్టుకు నాలుగో మ్యాచ్‌లోనూ అది దక్కలేదు. ఊరించే లక్ష్య ఛేదనలో మిడిలార్డర్ రాణించినా... కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బ కొట్టింది. మొత్తానికి పరాజయాల హ్యాట్రిక్ అనంతరం తాజా సీజన్‌లో ఆంధ్ర జట్టు ఓటమినుంచి తప్పించుకుంటూ తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా విజయనగరం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది.
321 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 8/1తో శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు... చివరకు 93 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (90 బంతుల్లో 92; 12 ఫోర్లు, ఒక సిక్సర్) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేయగా... హనుమ విహారి (189 బంతుల్లో 66; 6 ఫోర్లు, ఒక సిక్సర్), కరణ్ షిండే (171 బంతుల్లో 65; 8 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. ఓపెనర్లు అభిషేక్ రెడ్డి (6), మారంరెడ్డి హేమంత్ రెడ్డి (2) త్వరగానే ఔటవడంతో ఆంధ్ర జట్టుకు మరో ఓటమి తప్పదనిపించినా... కెపె్టన్ షేక్ రషీద్ (31; 4 ఫోర్లు) కాసేపు పోరాడాడు.
అతడు వెనుదిరిగిన తర్వాత కరణ్ షిండే , హనుమవిహారి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. విహారి అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్‌తో ఆలరించగా.. శ్రీకర్ భరత్ ఎడాపెడా బౌండ్రీలతో మైదానాన్ని హోరెత్తించాడు. అతడున్నంతసేపు ఆంధ్ర జట్టు విజయం సాధించడం ఖాయమే అనిపించింది. అయితే మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా... అతడు పెవిలియన్ చేరడంతో ఆంధ్ర జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఉత్తరాఖండ్ బౌలర్లలో దీపక్ ధాపోలా 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఉత్తరాఖండ్ ఓపెనర్ ప్రియాన్షు ఖండూరికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
స్కోరు వివరాలు
ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ 338; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 146; ఉత్తరాఖండ్ రెండో ఇన్నింగ్స్ 128/9 డిక్లేర్డ్; ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: అభిషేక్ రెడ్డి (బి) దీపక్ ధాపోలా 6; హేమంత్ రెడ్డి (ఎల్బీ) (బి) దీపక్ ధాపోలా 2; షేక్ రషీద్ (ఎల్బీ) (బి) దీపక్ ధాపోలా 31; కరణ్ షిండే (సి) అవనీశ్ సుధ (బి) దీపక్ ధాపోలా 65; హనుమ విహారి (బి) దీపక్ ధాపోలా 66; శ్రీకర్ భరత్ (సి) ఆదిత్య తారె (బి) దేవేంద్ర సింగ్ బోరా 92; శశికాంత్ (నాటౌట్) 7; విజయ్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 16, మొత్తం (93 ఓవర్లలో 6 వికెట్లకు) 286. వికెట్ల పతనం: 1–8, 2–13, 3–56, 4–140, 5–276, 6–282, బౌలింగ్: దీపక్ ధాపోలా 21–3–75–5, మయాంక్ మిశ్రా 16–5–34–0; స్వప్నిల్ సింగ్ 19–3–52–0, అభయ్ నేగీ 17–4–57–0, దేవేంద్ర సింగ్ బోరా 14–2–46–1, అవనీశ్ సుధ 5–1–6–0, రవికుమార్ సమర్థ్ 1–0–1–0.
Comments
Please login to add a commentAdd a comment