స్నేహమే ఆదివిష్ణు మహా వాక్యం | Writer Vihari Guest Column On Aadivishnu | Sakshi
Sakshi News home page

స్నేహమే ఆదివిష్ణు మహా వాక్యం

Published Wed, Jan 8 2020 1:01 AM | Last Updated on Wed, Jan 8 2020 1:01 AM

Writer Vihari Guest Column On Aadivishnu - Sakshi

ఆదివిష్ణు విఘ్వేశ్వర్రావు 1940లో సరిగ్గా వినాయకచవితి నాడు బందర్లో పుట్టాడు. బందరంటే, బందరు మనుషులంటే, బందరు వీధులంటే అతనికి ప్రాణం. ఇంటిపేరునే తన పేరు చేసుకుని 1959 నుంచీ కథలు రాయటం మొదలెట్టాడు. 1960ల్లో ఆదివిష్ణు అంటే నడుస్తున్న ‘కథా’నాయకుడు. అతనితోపాటు నలుగురైదుగురు మిత్రులూ, అతని చుట్టూ ఇద్దరు, ముగ్గురు ఔత్సాహిక రచయితలూ కదులుతూ ఉండేవారు. అతను ఫైనల్‌ ఇయర్‌ చదువులో ఉండగా ‘అగ్గిబరాటా’ అని వొక ‘బాయ్‌ మీట్స్‌ గళ్‌’ కథని రాశాడు. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో సెంటర్‌ స్ప్రెడ్‌గా, బాపుగారి అందమైన ‘పేద్ద’ బొమ్మతో వచ్చింది. ఆ కథ ఒక ట్రెండ్‌ సెట్టర్‌. అతనొక హీరో. అక్కణ్ణుంచీ అతను కలంవీరుడైపోయాడు.  ఆర్టీసీ ఉద్యోగంలో విజయవాడలో చేరినా బందరూ, బందరు బ్యాచ్‌ చైతన్యం అలాగే నిలి చింది. పెద్దిభొట్ల సుబ్బరామయ్య, విహారి శాలివాహన, నందం రామారావు, హవిస్, దొండపాటి దేవదాసు, చందు సోంబాబు.. ఇలా ఎంతోమందికి అతను స్ఫూర్తిప్రదాత. పత్రికల్లో దీపావళి కథల పోటీ అంటే బందరు రచయితల్లో ఒకరో ఇద్దరో బహుమతి పొందుతూ ఉండేవారు ఆ కాలంలో. 

ఆదివిష్ణు నవల ‘మనిషీ–మిథ్య’కి ఆంధ్ర పత్రికలోనే ప్రథమ బహుమతి వచ్చింది. కథల విషయం చెప్పనే అక్కర్లేదు. ఆ తర్వాత అతను రాసిన ‘ఎందుకు’ నవల పత్రిక పాఠకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. మంచి తాత్విక స్ఫురణ కలిగిన నవల. ‘సగటు మనిషి’ ప్రభలో వచ్చింది. ఆ నవలలో అతనొక కొత్త టెక్నిక్‌ని వాడేడు. కథా నాయకుడు తన మనసులో అనుకొనే మాటల్ని బ్రాకెట్‌లో రాసేడు. అతని కథల్లో ముత్యాలూ–పగడాలూ అనదగిన ఎన్నో కథలు ‘భారతి’లో వచ్చాయి. ‘శ్రేయోభిలాషులు’, ‘శ్రీమతి రాధమ్మ’, ‘బ్రతకనివ్వండి’ వంటివి. ‘మంచుతెర’ నాటిక భారతిలో వచ్చింది. అది అతని కొత్త అవతారానికి నాంది. ఆ రచనని ఎందరో ఆడారు, కొనియాడారు, బహుమతులు పొందారు. ఆదివిష్ణు నాటిక అంటే హాస్యానికి పెద్దపీట. ఆ తర్వాత ఎందరో నటులూ, దర్శకులూ అతన్ని గురు స్థానంలో కూచోపెట్టేశారు. ఆదివిష్ణు తన సినిమారంగ ప్రస్థానాన్ని ‘కన్నెవయసు’తో ఆరంభించాడు. అయితే జంధ్యాల ‘అహనా పెళ్లంట’తో పెద్ద ‘బ్రేక్‌’ వచ్చింది. ‘చూపులు కలసిన శుభవేళ’, ‘హైహై నాయకా’ వంటివి మంచి విజయాల్ని సాధించాయి. సుమారు 40 చిత్రాలకు అతను పేరు కనపడీ, కనపడక రచనా సహకారాన్ని అందించాడు. 

ఆదివిష్ణు స్నేహశీలి. బాగా కలుపుగోలు మనిషి. కథ రాద్దామని ఉంది అంటే, ఎవరినైనా సరే ‘రాసేయండి గురువుగారూ’ అనేది అతని ‘స్టాండర్డ్‌ డైలాగ్‌’. బందరు పార్కులో సాయంవేళ ఎన్నెన్నో సంభాషణలూ, చర్చలూ, కొండొకచో వాదాలు. మేమంతా ముమ్మరంగా కథా వ్యవసాయం చేస్తున్న రోజులు. 1964లో ‘భారతి’లో కథల్ని గురించి మాట్లాడుకుంటుంటే, ఒక రచయిత కథని ఒక నెల వేస్తే, అదే రచయిత కథని వెంటనే తర్వాతి నెలలో వెయ్యరు అన్నాడతను. ‘కథ బాగుంటే వేస్తార్లే గురూ’ అన్నాన్నేను. ‘సరే చూడు... చాలెంజ్‌’ అన్నాడు. ఆ రాత్రి నలభై పేజీల చిన్న నవల రాసి భారతి వారికి అందవలసిన తేదీలోగా పంపితే, మే సంచికలో ‘సాగర సంగీతం’ అచ్చయింది. అతనికి ఎంత సంతోషమో, ఎంత ఆశ్చర్యమో! ‘రాయగలవు అందుకే మరి నేను రెచ్చగొట్టింది..’ అని భోళాగా నవ్వేశాడు. ఆ తర్వాత చాలాసార్లు ఈ విషయాన్ని ఉదహరిస్తూ ‘విహారితో మాత్రం పోటీపడకూడదు గురూ’ అని నవ్వుతూ చెప్పేవాడు. 

ఉద్యోగంలో బదిలీలతో నేను ఊరెళుతూ, తిరుగుతూ చాలాకాలం అతన్ని కలుసుకోలేదు. రిటైరయిన తర్వాత హైదరాబాదులో కలిశాను. అప్పటికే అతను మనిషి ‘జమికాడు’. నడక సరిగా లేదు. వేదగిరి రాంబాబు పట్టుపట్టి 2013లో ‘ఆదివిష్ణు కథానికలు’ సంపుటిని ప్రచురించి అతనికి సమర్పించాడు. రాంబాబుకీ ఆదివిష్ణు గురుస్థానీయుడే. దాని ఆవిష్కరణ ఎంతో శోభాయమానంగా జరిగింది. పత్రికల్లో కథలకీ, నవలలకీ లెక్కలేనన్ని బహు మతులొచ్చాయి ఆదివిష్ణుకి. నాటికల్లో, నాటకాల్లో సరేసరి. సినిమాల్లో కూడా అతను ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా బహుమతిని పొందాడు. సినిమా రంగంలో జంధ్యాల అతనికి ఆరాధనీయుడు. కథా సాహిత్యపరంగా సింగరాజు రామచంద్రమూర్తి అతని గురువు. కుటుంబపరంగా మొదటినుంచీ అతనికి తనవారిపట్ల ప్రేమ, వాత్సల్యం. అతని తండ్రి, అన్నయ్య, పెదనాన్న (నాగభూషణం)లతో మాకు మంచి పరిచయమే ఉండేది. 

ఆదివిష్ణు కథనశైలి ఎంతో విశిష్టమైనది. అతను ఒకటి, రెండు పదాల్లో గుండె లోతుల్లోకి భావాన్ని చేరవేసేవాడు. అతి చిన్నదైన అతని వాక్య నిర్మాణం తెలుగు కథకుల్లో ఏ ఒకరిద్దరిలోనో చూస్తాం. ఆదివిష్ణు కథలు సంకలనాల్లో చోటు చేసుకోకపోవటం తెలుగుకథ చేసుకున్న దురదృష్టాల్లో మరీ పెద్ద దురదృష్టం. కథ ద్వారా పాఠకుడికి మంచి అనుభూతిని అందించటం ఎలాగో అతని కథలు చెబుతాయి. రచయితగా చైతన్య శిఖరం ఆదివిష్ణు. అతని మరణం కథక లోకానికి తీరనిలోటు!

విహారి
వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత
మొబైల్‌ : 98480 25600

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement