చెలరేగిన యువరాజ్: ఫైనల్లో ఇండియా-బ్లూ
ఇండోర్: భారత సీనియర్ జట్టులో పునరాగమనానికి యువరాజ్ సింగ్ తన వైపునుంచి ఎలాంటి అవకాశాన్ని వృథా చేయడానికి ఇష్ట పడటం లేదు. ఇటీవలే వెస్టిండీస్ ‘ఎ’పై మూడు వన్డేల్లో చెలరేగిన యువీ, ఇప్పుడు చాలెంజర్ టోర్నీలోనూ సత్తా చాటాడు. వెన్ను నొప్పితో ఈ టోర్నీ తొలి మ్యాచ్‌కు దూరమైన అతను శుక్రవారం ఇండియా ‘రెడ్’తో జరిగిన వన్డేలో చెలరేగాడు.
యువరాజ్ సింగ్ (53 బంతుల్లో 84; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), అభిషేక్ నాయర్ (39 బంతుల్లో 75 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుతో ఇండియా ‘బ్లూ’ 11 పరుగుల తేడాతో రెడ్‌పై విజయం సాధించింది. టోర్నీలో వరుసగా రెండు వన్డేలు నెగ్గిన ‘బ్లూ’ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగే ఢిల్లీ, ఇండియా ‘రెడ్’ జట్ల మ్యాచ్ విజేతతో ‘బ్లూ’ ఫైనల్లో (ఆదివారం) తలపడుతుంది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ‘బ్లూ’ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 345 పరుగుల భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ క్రికెటర్ అక్షత్ రెడ్డి (96 బంతుల్లో 84; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో సారి ఆకట్టుకోగా, మనీశ్ పాండే (86 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా రాణించాడు. అనంతరం విజయం కోసం చివరి వరకు పోరాడిన ‘రెడ్’ 49.5 ఓవర్లలో 334 పరుగులకు ఆలౌటైంది. ముకుంద్ (86 బంతుల్లో 83; 9 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ పటేల్ (84 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, జాదవ్ (40 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. బ్లూ బౌలర్లలో వినయ్‌కుమార్‌కు 4 వికెట్లు దక్కాయి.