అప్పుడే టెస్టు కెరీర్కు గుడ్ బై చెప్పాలి!
పెర్త్: ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో సిరీస్ లో భాగంగా న్యూఇయర్ టెస్టు నుంచి ఉద్వాసనకు గురైన దక్షిణాఫ్రికా ఆటగాడు జేపీ డుమినీ అప్పుడే తన టెస్టు కెరీర్కు గుడ్ బై చెబుదామనుకున్నాడట. ఈ విషయాన్ని తనతో చెప్పినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సెలక్టర్ అష్వెల్ ప్రిన్స్ తాజాగా స్పష్టం చేశాడు. 'జనవరిలో డుమినీ టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. అప్పుడు టెస్టులకు దూరంగా కావాలని డుమినీ నిశ్చయించుకున్నాడు. దాన్ని నాతో చెప్పాడు. అదే విషయాన్ని మా సెలక్షన్ కమిటీకి చెప్పా. ఆ సయమంలో డుమినీ ఫామ్ పరంగా కొంతవరకూ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. చాలానిజాయితీగా అతని గురించి నాకు చెప్పాడు. సుమారు 12 ఇన్నింగ్స్ ల్లో డుమినీ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాననే విషయం అతన్ని ఎక్కువగా బాధించింది.
అయితే దక్షిణాఫ్రికాకు డుమినీ చాలా ముఖ్యమైన ఆటగాడు. నిర్ణయాన్ని మార్చుకోమని అతనికి చెప్పా. ఆ మేరకు సెలక్షన్ కమిటీ అతనికి నచ్చజెప్పింది. దాంతో వెనక్కి తగ్గాడు. ఆనాటి డుమినీ ఫీలింగ్కు, ఇప్పుడు ఆస్ట్రేలియాతో భారీ సెంచరీ ఫీలింగ్తో పోల్చుకుంటే అప్పటి డుమినీ నిర్ణయం తప్పని అతనికి తెలుస్తుంది' అని ప్రిన్స్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో డుమినీ 141 పరుగులు చేసి దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం సాధించడానికి దోహద పడ్డాడు.