వీడ్కోలు వేళ..!
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న క్లార్క్, సంగక్కర
♦ వీళ్లతో పాటు రోజర్స్ కూడా
♦ రేపటి నుంచి ఈ ముగ్గురి ఆఖరి టెస్టులు
కాకతాళీయమే అయినా... ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ క్రికెట్‌కు ఒకేసారి వీడ్కోలు చెబుతున్నారు. దశాబ్దానికి పైగా తమ జట్లకు చిరస్మరణీయ విజయాలు అందించి... అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించిన మైకేల్ క్లార్క్, కుమార సంగక్కర ఇద్దరూ బ్యాట్‌ను పక్కనపెట్టేస్తున్నారు. వీళ్లతో పాటు రోజర్స్ కూడా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. రేపటి నుంచి జరిగే టెస్టుల్లో ఈ దిగ్గజాల ఆటను చివరిసారి చూడొచ్చు.
సాక్షి క్రీడావిభాగం : క్లార్క్ జట్టులో ఉంటే ఆస్ట్రేలియాకు అదో ధైర్యం... అలాగే సంగక్కర ఆడుతున్నాడంటే శ్రీలంక ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరూ ఇద్దరే. సమకాలీన క్రికెట్‌లో సంచలనాలు సృష్టించిన వారే. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో రేపటి నుంచి జరిగే ఆఖరి టెస్టుతో క్లార్క్ పూర్తిగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నాడు. అలాగే ఇదే మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ కూడా అస్త్రసన్యాసం చేయబోతున్నాడు. ఇక ఇటు సొంతగడ్డపై సంగక్కర భారత్‌తో రేపటి నుంచి జరిగే రెండో టెస్టు ద్వారా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ నేపధ్యంతో ఈ ముగ్గురి ఘనతల గురించి క్లుప్తంగా...
కుమార సంగక్కర
బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా త్రిపాత్రాభినయం చేసిన సంగక్కర లంక జట్టులో అత్యంత కీలక ఆటగాడు. దశాబ్దానికి పైగా ఒంటిచేత్తో జట్టును నడిపించిన సంగ...వన్డే ప్రపంచకప్ తర్వాత ఆట నుంచి తప్పుకుందామని భావించినా, లంక జట్టు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మరికొన్నాళ్లు క్రికెట్‌లో కొనసాగాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ‘వివేకపూరితమైన’ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సుదీర్ఘకాలంపాటు నంబర్‌వన్‌గా కొనసాగాడు. మహేళ జయవర్ధనేతో కలిసి ఎన్నో రికార్డు భాగస్వామ్యాలు కూడా నెలకొల్పాడు. ఇటీవల ఫామ్‌తో ఇబ్బందులుపడుతున్న సంగక్కర పాక్‌తో జరిగిన రెండు టెస్టుల్లో మామూలుగా ఆడాడు. భారత్‌తో జరిగిన తొలి టెస్టులోనూ విఫలమైన అతను రెండో టెస్టులో ఓ భారీ ఇన్నింగ్స్‌తోనైనా కెరీర్‌కు గుడ్‌బై చెబుతాడేమో చూద్దాం. తన కెరీర్‌లో ఒక టి20 ప్రపంచకప్ గెలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో రెండు ఫైనల్స్ ఆడినా టైటిల్ లేకపోవడం కెరీర్‌లో లోటు.
మైకేల్ క్లార్క్
ఆడిన తొలి మ్యాచ్‌తోనే భవిష్యత్ సారథిగా పేరు తెచ్చుకున్న క్లార్క్... స్వల్ప కాలంలోనే తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. అయితే తన కెరీర్ ఆసాంతం గాయాలతో ఇబ్బందిపడ్డాడు. అయినా 12 ఏళ్ల పాటు జట్టుకు సేవలందించాడు. రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు యాషెస్ సిరీస్ విజయాల్లో భాగమయ్యాడు. పాంటింగ్ రిటైరైన తర్వాత సారథిగా బాధ్యతలు తీసుకున్నాడు. సొంతగడ్డపై ఈ ఏడాదే జరిగిన వన్డే ప్రపంచకప్‌ను సారథిగా అందుకోవడం తన కెరీర్‌లో అత్యంత మధుర క్షణం. మరికొంత కాలం టెస్టులు ఆడాలనే కోరిక ఉన్నా... యాషెస్‌లో ఎదురైన ఘోర పరాభవాల నేపథ్యంలో ఆట నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎంత గొప్ప క్రికెటర్ అయినా కెరీర్ చివరి దశలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని, నిలకడగా ఆడలేకపోతే తప్పుకుని కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని తన నిర్ణయం ద్వారా క్లార్క్ క్రికెట్ ప్రపంచానికి చెప్పాడు.
క్రిస్ రోజర్స్
చాలా ఆలస్యంగా 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన క్రికెటర్ రోజర్స్. దాదాపు 250 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో నిలకడగా ఆడినా ఆసీస్ క్రికెట్‌లో ఉండే పోటీ దృష్ట్యా తనకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఒక్కసారి అవకాశం దొరికాక మాత్రం వదల్లేదు. అయితే తన ఏడేళ్ల కెరీర్‌లో కేవలం 24 టెస్టులు మాత్రమే ఆడటం లోటు. వరుసగా 7 టెస్టుల్లో అర్ధసెంచరీలు చేసిన ఘనత రోజర్స్‌ది. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో సహచర బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డ చోట కూడా తను రాణించాడు. అయితే ఈ యాషెస్ ఆరంభానికి ముందే తాను చివరి సిరీస్ ఆడబోతున్నానని ప్రకటించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజర్స్ రిటైర్‌మెంట్ ఆస్ట్రేలియా క్రికెట్‌కు పెద్ద లోటు.