chris rogers
-
వాట్సన్ వీడ్కోలు
లండన్ : యాషెస్ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టుకు మరో స్టార్ ఆటగాడు దూరమయ్యాడు. ఇప్పటికే మైకేల్ క్లార్క్, క్రిస్ రోజర్స్ రిటైర్మెంట్ ప్రకటించగా... తాజాగా సీనియర్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. యాషెస్ తొలి టెస్టులో విఫలమైన 34 ఏళ్ల వాట్సన్‌కు మిగిలిన మ్యాచ్ ల్లో చోటు దక్కలేదు. దీనికి తోడు నిరంతరం వెంటాడుతున్న గాయాల కారణంగా తన పదేళ్ల టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లండ్‌తో శనివా రం జరిగిన రెండో వన్డేలో వాట్సన్ గాయపడడంతో ఈ సిరీస్ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ‘టెస్టులకు గుడ్‌బై చెప్పాల్సిన సమయమిదేనని నాకు తెలుసు. ఈ నిర్ణయం అంత సులువుగా తీసుకోలేదు. గత నెలంతా దీర్ఘంగా ఆలోచించాను. అయితే వన్డే, టి20 ఫార్మాట్లో మాత్రం కొనసాగుతాను. ఇన్నాళ్లుగా జట్టు కోసం నా శాయశక్తులా సేవలందిం చాను’ అని క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్లో పేర్కొన్నాడు. వన్డేల్లో విలువైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నా సుదీర్ఘ ఫార్మాట్లో వాట్సన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 2005లో అరంగేట్రం చేసిన తను 59 టెస్టులు ఆడాడు. ఓ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరిం చాడు. 3,731 పరుగుల్లో నాలుగు సెంచరీలుండగా, బౌలింగ్‌లోనూ రాణించి 75 వికెట్లు తీశాడు. -
వీడ్కోలు వేళ..!
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న క్లార్క్, సంగక్కర ♦ వీళ్లతో పాటు రోజర్స్ కూడా ♦ రేపటి నుంచి ఈ ముగ్గురి ఆఖరి టెస్టులు కాకతాళీయమే అయినా... ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ క్రికెట్‌కు ఒకేసారి వీడ్కోలు చెబుతున్నారు. దశాబ్దానికి పైగా తమ జట్లకు చిరస్మరణీయ విజయాలు అందించి... అంతర్జాతీయ క్రికెట్లో ప్రకంపనలు సృష్టించిన మైకేల్ క్లార్క్, కుమార సంగక్కర ఇద్దరూ బ్యాట్‌ను పక్కనపెట్టేస్తున్నారు. వీళ్లతో పాటు రోజర్స్ కూడా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. రేపటి నుంచి జరిగే టెస్టుల్లో ఈ దిగ్గజాల ఆటను చివరిసారి చూడొచ్చు. సాక్షి క్రీడావిభాగం : క్లార్క్ జట్టులో ఉంటే ఆస్ట్రేలియాకు అదో ధైర్యం... అలాగే సంగక్కర ఆడుతున్నాడంటే శ్రీలంక ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరూ ఇద్దరే. సమకాలీన క్రికెట్లో సంచలనాలు సృష్టించిన వారే. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో రేపటి నుంచి జరిగే ఆఖరి టెస్టుతో క్లార్క్ పూర్తిగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నాడు. అలాగే ఇదే మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ కూడా అస్త్రసన్యాసం చేయబోతున్నాడు. ఇక ఇటు సొంతగడ్డపై సంగక్కర భారత్‌తో రేపటి నుంచి జరిగే రెండో టెస్టు ద్వారా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ నేపధ్యంతో ఈ ముగ్గురి ఘనతల గురించి క్లుప్తంగా... కుమార సంగక్కర బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా త్రిపాత్రాభినయం చేసిన సంగక్కర లంక జట్టులో అత్యంత కీలక ఆటగాడు. దశాబ్దానికి పైగా ఒంటిచేత్తో జట్టును నడిపించిన సంగ...వన్డే ప్రపంచకప్ తర్వాత ఆట నుంచి తప్పుకుందామని భావించినా, లంక జట్టు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మరికొన్నాళ్లు క్రికెట్లో కొనసాగాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత ‘వివేకపూరితమైన’ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సుదీర్ఘకాలంపాటు నంబర్‌వన్‌గా కొనసాగాడు. మహేళ జయవర్ధనేతో కలిసి ఎన్నో రికార్డు భాగస్వామ్యాలు కూడా నెలకొల్పాడు. ఇటీవల ఫామ్‌తో ఇబ్బందులుపడుతున్న సంగక్కర పాక్‌తో జరిగిన రెండు టెస్టుల్లో మామూలుగా ఆడాడు. భారత్‌తో జరిగిన తొలి టెస్టులోనూ విఫలమైన అతను రెండో టెస్టులో ఓ భారీ ఇన్నింగ్స్‌తోనైనా కెరీర్‌కు గుడ్‌బై చెబుతాడేమో చూద్దాం. తన కెరీర్లో ఒక టి20 ప్రపంచకప్ గెలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో రెండు ఫైనల్స్ ఆడినా టైటిల్ లేకపోవడం కెరీర్లో లోటు. మైకేల్ క్లార్క్ ఆడిన తొలి మ్యాచ్‌తోనే భవిష్యత్ సారథిగా పేరు తెచ్చుకున్న క్లార్క్... స్వల్ప కాలంలోనే తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. అయితే తన కెరీర్ ఆసాంతం గాయాలతో ఇబ్బందిపడ్డాడు. అయినా 12 ఏళ్ల పాటు జట్టుకు సేవలందించాడు. రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు యాషెస్ సిరీస్ విజయాల్లో భాగమయ్యాడు. పాంటింగ్ రిటైరైన తర్వాత సారథిగా బాధ్యతలు తీసుకున్నాడు. సొంతగడ్డపై ఈ ఏడాదే జరిగిన వన్డే ప్రపంచకప్‌ను సారథిగా అందుకోవడం తన కెరీర్లో అత్యంత మధుర క్షణం. మరికొంత కాలం టెస్టులు ఆడాలనే కోరిక ఉన్నా... యాషెస్‌లో ఎదురైన ఘోర పరాభవాల నేపథ్యంలో ఆట నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎంత గొప్ప క్రికెటర్ అయినా కెరీర్ చివరి దశలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని, నిలకడగా ఆడలేకపోతే తప్పుకుని కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని తన నిర్ణయం ద్వారా క్లార్క్ క్రికెట్ ప్రపంచానికి చెప్పాడు. క్రిస్ రోజర్స్ చాలా ఆలస్యంగా 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన క్రికెటర్ రోజర్స్. దాదాపు 250 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో నిలకడగా ఆడినా ఆసీస్ క్రికెట్లో ఉండే పోటీ దృష్ట్యా తనకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఒక్కసారి అవకాశం దొరికాక మాత్రం వదల్లేదు. అయితే తన ఏడేళ్ల కెరీర్లో కేవలం 24 టెస్టులు మాత్రమే ఆడటం లోటు. వరుసగా 7 టెస్టుల్లో అర్ధసెంచరీలు చేసిన ఘనత రోజర్స్ది. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో సహచర బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డ చోట కూడా తను రాణించాడు. అయితే ఈ యాషెస్ ఆరంభానికి ముందే తాను చివరి సిరీస్ ఆడబోతున్నానని ప్రకటించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజర్స్ రిటైర్మెంట్ ఆస్ట్రేలియా క్రికెట్‌కు పెద్ద లోటు. -
రోజర్స్ గుడ్ బై!
లండన్: ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు క్రిస్ రోజర్స్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న యాషెస్ సిరీస్ తర్వాత్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు మంగళవారం ప్రకటించాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆస్ట్రేలియా తరుపున టెస్టు క్రికెట్ ఆడుతూ ఆస్వాదిస్తున్నా.. ఇక ఆట నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైందని తెలిపాడు. తాను ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించే సమయంలో ఎన్నోప్రత్యేకమైన ఇన్నింగ్స్ లు ఆడినట్లు పేర్కొన్నాడు. అయితే ఎప్పుడూ వంద శాతం ఆటను ఇవ్వలేమని ఈ సందర్భంగా తెలిపాడు. తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు రోజర్స్ తెలిపాడు. వచ్చే యాషెస్ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్న జనవరిలోనే రోజర్స్ స్పష్టం చేశాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్ పై నిర్ణయాన్ని తాజాగా వెల్లడించాడు. రోజర్స్ తన కెరియర్ లో 24 టెస్టులు ఆడి 62.42 సగటుతో 1,972 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల లార్డ్స్ లో జరిగిన యాషెస్ రెండో టెస్టులో చేసిన 173 పరుగులు అతని అత్యధిక స్కోరు. ఇప్పటికే ఆస్ట్రేలియా యాషెస్ ను 3-1 తేడాతో కోల్పోవడంతో ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతకుముందు ఆసీస్ కెప్టెన్ క్లార్క్ టెస్ట్ ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రోజర్స్ బతికిపోయాడు..
లార్డ్స్: ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ అదృష్టం బాగుంది. ఇంగ్లండ్‌తో యాషెస్ రెండో టెస్టు రెండో రోజు ఆటలోని తొలి బంతికే తన మెడ వెనుక భాగంలో పేసర్ అండర్సన్ వేసిన బంతి గట్టిగా తగిలింది. ఈ బంతిని తప్పించుకునే క్రమంలో తల పక్కకి తిప్పుకున్నా హెల్మెట్ వెనుక కింది భాగంలో తగిలింది. అయితే సరికొత్త రీతిలో తయారైన ఈ హెల్మెట్ పూర్తి రక్షణాత్మకంగా ఉండడంతో దెబ్బ నుంచి తప్పించుకున్నాడు. సరిగ్గా ఇదే తరహాలో బంతి తగిలి ఆసీస్ ఆటగాడు ఫిల్ హ్యూస్ మైదానంలో ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. -
రోజర్స్, స్మిత్ సెంచరీలు
ఆస్ట్రేలియా 337/1 యాషెస్ రెండో టెస్టు లార్డ్స్: యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు అద్భుత ఆరంభం లభించింది. మ్యాచ్ తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో వికెట్ నష్టానికి 337 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ రోజర్స్ (282 బంతుల్లో 158 బ్యాటింగ్; 25 ఫోర్లు), స్టీవెన్ స్మిత్ (217 బంతుల్లో 129 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు. రెండో వికెట్‌కు వీరిద్దరు అభేద్యంగా 259 పరుగులు జోడించారు. లార్డ్స్‌లో ఆ జట్టుకు రెండో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. రోజర్స్ కెరీర్లో ఇది ఐదో సెంచరీ కాగా, స్మిత్‌కు పదోది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా... తొలి వికెట్‌కు 15 ఓవర్లలోనే 78 పరుగులు జత చేసిన అనంతరం మొయిన్ అలీ బౌలింగ్‌లో వార్నర్ (42 బంతుల్లో 38; 7 ఫోర్లు) వెనుదిరిగాడు. ఆ తర్వాత రోజర్స్, స్మిత్ జోడి ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆసీస్ వికెట్ కీపర్ పీటర్ నెవిల్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. -
ఆస్ట్రేలియా 264/5
కార్డిఫ్: యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో రోజు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. క్రిస్ రోజర్స్ (133 బంతుల్లో 95; 11 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. దీంతో గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. వార్నర్ (17) విఫలం కాగా, క్లార్క్ (38), స్మిత్ (33), వోజెస్ (31) తమ ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం ఆసీస్ మరో 166 పరుగులు వెనుకబడి ఉండగా... వాట్సన్ (29 బ్యాటింగ్), లయోన్ (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్‌కు వార్నర్‌తో 52 పరుగులు జోడించిన రోజర్స్, ఆ తర్వాత స్మిత్‌తో రెండో వికెట్‌కు 77, క్లార్క్‌తో మూడో వికెట్‌కు 51 పరుగులు జత చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీకి 2 వికెట్లు దక్కాయి. వరుసగా 7 టెస్టు ఇన్నింగ్స్‌లలో కనీసం అర్ధ సెంచరీ సాధించిన ఐదో ఆటగాడిగా ప్రపంచ రికార్డును సమం చేసిన రోజర్స్ ఈ ఘనత సాధించిన తొలి ఓపెనర్. ఈ ఏడింటిలో ఒక్క సెంచరీ కూడా లేకపోవడం విశేషం. అంతకు ముందు 343/7 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 430 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (88 బంతుల్లో 77; 11 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి ఇంగ్లండ్ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్‌కు 5, హాజల్‌వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. -
బంతి తగలడం వల్లే ఆ నిర్ణయం
సొంతగడ్డపై రిటైర్మెంట్పై రోజర్స్ సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ సొంతగడ్డపై ఆఖరి టెస్టు ఆడేశాడు. భారత్‌తో సిడ్నీ టెస్టే స్వదేశంలో తన చివరి మ్యాచ్ అని సిరీస్ మధ్యలో రోజర్స్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ అనూహ్య నిర్ణయానికి ఓ కారణం ఉంది. అదేంటో అతని మాటల్లోనే... ‘బ్రిస్బేన్‌లో భారత్‌తో రెండో టెస్టు తొలి రోజు రోహిత్ శర్మ స్వీప్ షాట్ ఆడాడు. అప్పుడు నేను ఫార్వర్డ్ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాను. బంతి రాగానే తల వెనక్కి తిప్పాను. అది వచ్చి హెల్మెట్ మీదే మెడ భాగంలో తగిలింది. సరిగ్గా హ్యూస్కు బంతి తగిలిన ప్రదేశం కూడా అదే. ఒక్క క్షణం షాక్‌కు గురయ్యాను. అయితే అదృష్టవశాత్తు నాకు ఏం కాలేదు. ఆ రోజు రాత్రి చాలాసేపు ఆలోచించాను. 37 ఏళ్ల నేను ఇంకా ఎంతకాలం క్రికెట్ ఆడగలనో తెలియదు. యాషెస్ ఆడాలనే కల మిగిలున్నందున ఇంగ్లండ్ వెళ్లి ఆ టోర్నీ ఆడాలి. ఈ లోగా స్వదేశంలో టెస్టులూ లేవు. కాబట్టి సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్ అని ప్రకటించాను. దీనికి ముందు చాలా మంది సన్నిహితులతో మాట్లాడాను’. మొత్తానికి రోహిత్ శర్మ స్వీప్ షాట్ ఓ క్రికెటర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునేలా చేసిందన్న మాట. -
సొంత గడ్డపై ఇదే చివరి టెస్టు: రోజర్స్
సిడ్నీ: వచ్చే యాషెస్ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ స్వదేశంలో చివరి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. 6 నుంచి భారత్‌తో జరిగే సిడ్నీ టెస్టు స్వదేశీ గడ్డపై ఆఖరిదని ప్రకటించాడు. ‘భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని యాషెస్ సిరీస్ అనంతరం ఆటను ముగిద్దామనుకుంటున్నాను. అయితే ఇక్కడ చివరి టెస్టును ఘనంగా ముగించాలనుకుంటున్నాను’ అని 19 టెస్టులు ఆడి 1,384 పరుగులు చేసిన 37 ఏళ్ల రోజర్స్ అన్నాడు. ధోని గైర్హాజరీతో ఆసీస్‌కు లాభం: వార్నర్ టెస్టులకు వీడ్కోలు పలికిన ఎం.ఎస్.ధోని గైర్హాజరీ... నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాకు కలిసొస్తుందని డాషింగ్ ఓపెనర్ వార్నర్ అన్నాడు. మ్యాచ్ గురించి మహి చాలా రకాలుగా ఆలోచిస్తాడని, అతను ఆటపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అని ప్రశంసించాడు. ధోని స్థానంలో పగ్గాలు చేపట్టిన కోహ్లి జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలన్న ఆతృత ఎక్కువైందని వార్నర్ అన్నాడు. -
‘యాషెస్’లో ఆసీస్ హవా
మెల్బోర్న్: ఇంగ్లండ్‌లో జరిగిన ఘోర పరాభవానికి ఆస్ట్రేలియా దీటుగా ప్రతీకారం తీర్చుకుంటోంది. వరుసగా నాలుగో టెస్టులోనూ ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో నిలిచింది. క్రిస్ రోజర్స్ (155 బంతుల్లో 116; 13 ఫోర్లు), వాట్సన్ (90 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు) చెలరేగి ఆడటంతో నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 231 పరుగుల లక్ష్యాన్ని క్లార్క్ సేన 51.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 30/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ జట్టులో ఓపెనర్ వార్నర్ (47 బంతుల్లో 25; 2 ఫోర్లు) విఫలమయ్యాడు. అయితే వాట్సన్ సమయోచితంగా స్పందిస్తూ మరో ఓపెనర్ రోజర్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 136 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోజర్స్ కెరీర్లో రెండో సెంచరీని పూర్తి చేశాడు. చివర్లో వాట్సన్, క్లార్క్ (6 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. స్టోక్స్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన ఆసీస్ కెప్టెన్ టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ రెండు కీలక క్యాచ్‌లు జారవిడిచి మూల్యం చెల్లించుకున్నాడు. స్టోక్స్, పనేసర్ చెరో వికెట్ తీశారు. జాన్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది. సంక్షిప్త స్కోర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 255, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 204, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 179, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 231/2 (రోజర్స్ 116, వాట్సన్ 83 నాటౌట్).