రోజర్స్ గుడ్ బై!
లండన్: ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు క్రిస్ రోజర్స్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న యాషెస్ సిరీస్ తర్వాత్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు మంగళవారం ప్రకటించాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆస్ట్రేలియా తరుపున టెస్టు క్రికెట్ ఆడుతూ ఆస్వాదిస్తున్నా.. ఇక ఆట నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైందని తెలిపాడు. తాను ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించే సమయంలో ఎన్నోప్రత్యేకమైన ఇన్నింగ్స్ లు ఆడినట్లు పేర్కొన్నాడు. అయితే ఎప్పుడూ వంద శాతం ఆటను ఇవ్వలేమని ఈ సందర్భంగా తెలిపాడు. తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు రోజర్స్ తెలిపాడు. వచ్చే యాషెస్ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్న జనవరిలోనే రోజర్స్ స్పష్టం చేశాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్ పై నిర్ణయాన్ని తాజాగా వెల్లడించాడు.
రోజర్స్ తన కెరియర్ లో 24 టెస్టులు ఆడి 62.42 సగటుతో 1,972 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల లార్డ్స్ లో జరిగిన యాషెస్ రెండో టెస్టులో చేసిన 173 పరుగులు అతని అత్యధిక స్కోరు. ఇప్పటికే ఆస్ట్రేలియా యాషెస్ ను 3-1 తేడాతో కోల్పోవడంతో ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతకుముందు ఆసీస్ కెప్టెన్ క్లార్క్ టెస్ట్ ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.