రోజర్స్, స్మిత్ సెంచరీలు
ఆస్ట్రేలియా 337/1 యాషెస్ రెండో టెస్టు
లార్డ్స్: యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు అద్భుత ఆరంభం లభించింది. మ్యాచ్ తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో వికెట్ నష్టానికి 337 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ రోజర్స్ (282 బంతుల్లో 158 బ్యాటింగ్; 25 ఫోర్లు), స్టీవెన్ స్మిత్ (217 బంతుల్లో 129 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు. రెండో వికెట్‌కు వీరిద్దరు అభేద్యంగా 259 పరుగులు జోడించారు.
లార్డ్స్‌లో ఆ జట్టుకు రెండో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. రోజర్స్ కెరీర్‌లో ఇది ఐదో సెంచరీ కాగా, స్మిత్‌కు పదోది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా... తొలి వికెట్‌కు 15 ఓవర్లలోనే 78 పరుగులు జత చేసిన అనంతరం మొయిన్ అలీ బౌలింగ్‌లో వార్నర్ (42 బంతుల్లో 38; 7 ఫోర్లు) వెనుదిరిగాడు. ఆ తర్వాత రోజర్స్, స్మిత్ జోడి ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆసీస్ వికెట్ కీపర్ పీటర్ నెవిల్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.