ఆస్ట్రేలియా 264/5
కార్డిఫ్: యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో రోజు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. క్రిస్ రోజర్స్ (133 బంతుల్లో 95; 11 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. దీంతో గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.
వార్నర్ (17) విఫలం కాగా, క్లార్క్ (38), స్మిత్ (33), వోజెస్ (31) తమ ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం ఆసీస్ మరో 166 పరుగులు వెనుకబడి ఉండగా... వాట్సన్ (29 బ్యాటింగ్), లయోన్ (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్‌కు వార్నర్‌తో 52 పరుగులు జోడించిన రోజర్స్, ఆ తర్వాత స్మిత్‌తో రెండో వికెట్‌కు 77, క్లార్క్‌తో మూడో వికెట్‌కు 51 పరుగులు జత చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీకి 2 వికెట్లు దక్కాయి.
వరుసగా 7 టెస్టు ఇన్నింగ్స్‌లలో కనీసం అర్ధ సెంచరీ సాధించిన ఐదో ఆటగాడిగా ప్రపంచ రికార్డును సమం చేసిన రోజర్స్ ఈ ఘనత సాధించిన తొలి ఓపెనర్. ఈ ఏడింటిలో ఒక్క సెంచరీ కూడా లేకపోవడం విశేషం. అంతకు ముందు 343/7 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 430 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (88 బంతుల్లో 77; 11 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి ఇంగ్లండ్ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్‌కు 5, హాజల్‌వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి.