Ashes 2023: James Anderson Completes 1100 Wickets In First-Class Cricket - Sakshi
Sakshi News home page

Ashes 1st Test: 1100 వికెట్ల మైలురాయిని చేరుకున్న జేమ్స్‌ ఆండర్సన్‌

Published Mon, Jun 19 2023 11:43 AM | Last Updated on Mon, Jun 19 2023 1:13 PM

Ashes 1st Test: James Anderson Completes 1100 Wickets In First Class Cricket - Sakshi

ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో (టెస్ట్‌లతో కలుపుకుని) 1100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్ట్‌ మూడో రోజు ఆటలో జిమ్మీ ఈ ఘనతను సాధించాడు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ వికెట్‌ పడగొట్టడం ద్వారా ఆండర్సన్‌ ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 2002లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆండర్సన్‌.. కేవలం 289 మ్యాచ్‌ల్లోనే 1100 వికెట్లు పడగొట్టాడు.

ఇందులో 54 సార్లు 5 వికెట్ల ఘనత (ఇన్నింగ్స్‌లో), 6 సార్లు 10 వికెట్ల ఘనత (మ్యాచ్‌లో) సాధించాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 7/19గా ఉన్నాయి. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్ల ఘనత ఇంగ్లండ్‌కే చెందిన విల్‌ఫ్రెడ్‌ రోడ్స్‌ పేరిట ఉంది. అతను 1110 మ్యాచ్‌ల్లో ఏకంగా 4204 వికెట్లు పడగొట్టాడు. విల్‌ఫ్రెడ్‌ తర్వాత టిచ్‌ ఫ్రీమన్‌ (592 మ్యాచ్‌ల్లో 3776 వికెట్లు), చార్లీ పార్కర్‌ (635 మ్యాచ్‌ల్లో 3278 వికెట్లు) ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ​    

2003లో టెస్ట్‌ క్రికెట్‌ అరంగేట్రం చేసిన ఆండర్సన్‌.. 180 మ్యాచ్‌ల్లో 686 వికెట్లు పడగొట్టి, ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఆండర్సన్‌ టెస్ట్‌ల్లో 32 సార్లు 5 వికెట్ల ఘనత, 3 సార్లు 10 వికెట్ల ఘనత సాధించాడు. అతని అత్యుత్తమ టెస్ట్‌ గణాంకాలు 7/42గా ఉన్నాయి. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ముత్తయ్య మురళీథరన్‌ (800), షేన్‌ వార్న్‌ (708) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మూడో రోజు కేవలం 32.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. వర్షం అంతరాయం కలిగించే సమయాని​కి ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసి, 35 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసి డిక్లేర్‌ చేయగా.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement