బంతి తగలడం వల్లే ఆ నిర్ణయం
సొంతగడ్డపై రిటైర్మెంట్‌పై రోజర్స్
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ సొంతగడ్డపై ఆఖరి టెస్టు ఆడేశాడు. భారత్‌తో సిడ్నీ టెస్టే స్వదేశంలో తన చివరి మ్యాచ్ అని సిరీస్ మధ్యలో రోజర్స్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ అనూహ్య నిర్ణయానికి ఓ కారణం ఉంది. అదేంటో అతని మాటల్లోనే... ‘బ్రిస్బేన్‌లో భారత్‌తో రెండో టెస్టు తొలి రోజు రోహిత్ శర్మ స్వీప్ షాట్ ఆడాడు. అప్పుడు నేను ఫార్వర్డ్ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాను. బంతి రాగానే తల వెనక్కి తిప్పాను. అది వచ్చి హెల్మెట్ మీదే మెడ భాగంలో తగిలింది.
సరిగ్గా హ్యూస్‌కు బంతి తగిలిన ప్రదేశం కూడా అదే. ఒక్క క్షణం షాక్‌కు గురయ్యాను. అయితే అదృష్టవశాత్తు నాకు ఏం కాలేదు. ఆ రోజు రాత్రి చాలాసేపు ఆలోచించాను. 37 ఏళ్ల నేను ఇంకా ఎంతకాలం క్రికెట్ ఆడగలనో తెలియదు. యాషెస్ ఆడాలనే కల మిగిలున్నందున ఇంగ్లండ్ వెళ్లి ఆ టోర్నీ ఆడాలి. ఈ లోగా స్వదేశంలో టెస్టులూ లేవు. కాబట్టి సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్ అని ప్రకటించాను. దీనికి ముందు చాలా మంది సన్నిహితులతో మాట్లాడాను’. మొత్తానికి రోహిత్ శర్మ స్వీప్ షాట్ ఓ క్రికెటర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునేలా చేసిందన్న మాట.