ఈ మహిళా క్రికెటర్ చాయ్ వాలా కూతురు..
న్యూఢిల్లీ: మహిళా ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఎక్తా బిష్త్ అబ్బాయిలతో క్రికెట్ ఆడటం మొదలు పెట్టిందని ఆమె తల్లి తండ్రులు పేర్కొన్నారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమది పేదకుటుంబ నేపథ్యమని అయినా ఎక్తా పట్టుదలతో రాణించి జట్టుకు ఎంపికైందని సంతోషం వ్యక్తం చేశారు. ఎక్తా నాన్న కుందన్ సింగ్ బిష్త్ మిలటీరి నుంచి రిటైర్మెంట్ అయిన తరువాత చాయ్ అమ్మెవాడినని తెలిపారు. తన కూతురు కలల కోసం ప్రోత్సహించేవాడినని చెప్పుకొచ్చారు . ఎక్తాకు క్రికెట్ అంటే పిచ్చి అని అదే ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు.
ఓ చాయ్ వాల కూతురుగా దేశానికి ఆడటం గర్వంగా ఉందన్నారు. ఎక్తా 6 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతుందని, అబ్బాయిలతో ఆడటం మొదలు పెట్టిందని జట్టులో ఒక్కతే అమ్మాయి కావడంతో ఎక్తా ఆడే మ్యాచ్ లు చూడటానికి జనాలు ఎగబడేవారని కుందన్ తెలిపారు. ఎక్తా జాతీయ జట్టుకు ఎంపికైన అనంతరం మా ఆర్ధిక పరిస్తితి మెరుగుపడిందన్నారు. భారత్ మహిళలు ప్రపంచకప్ గెలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎక్తా బిష్త్ పాక్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లతో చెలరేగి పాక్ ను కుప్పకూల్చిన విషయం తెలిసిందే.