హమ్మయ్య.. ఔట్‌ చేశాం! | Elgar Falls After A Marathon 160 Agaisnt Team India | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. ఔట్‌ చేశాం!

Published Fri, Oct 4 2019 4:03 PM | Last Updated on Fri, Oct 4 2019 4:32 PM

Elgar Falls After A Marathon 160 Agaisnt Team India - Sakshi

విశాఖ: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టును ఎక్కువ విసిగించిన క్రికెటర్‌ డీన్‌ ఎల్గర్‌. గురువారం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ప్రారంభించే క‍్రమంలో ఓపెనర్‌గా దిగిన ఎల్గర్‌.. శుక్రవారం సాయంత్రం ఆరో వికెట్‌గా ఔటయ్యాడు.  ఒకవైపు దక్షిణాఫ్రికా టాపార్డర్‌లో కీలకమైన వికెట్లను భారత బౌలర్లు సాధించినప్పటికీ ఎల్గర్‌ మాత్రం పట్టువదలకుండా ఇన్నింగ్స్‌ ఆడాడు.  287 బంతులను ఎదుర్కొని భారత్‌కు పరీక్ష పెట్టాడు. దాదాపు 50 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన ఎల్గర్‌ 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 160 పరుగులు చేశాడు. కాగా, మూడో రోజు ఆట ఇంకా గంటలో ముగుస్తుందనగా ఎల్గర్‌ ఎట్టకేలకు ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో చతేశ్వర పుజారా అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో ఎల్గర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దాంతో హమ్మయ్య.. ఔట్‌ చేశాం అనుకోవడం భారత్‌ వంతైంది.



39/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే బావుమా  వికెట్‌ను చేజార్చుకుంది. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో బావుమా ఎల్బీగా ఔట్‌ కావడంతో దక్షిణాఫ్రికా నాల్గో వికెట్‌ను కోల్పోయింది. దాంతో 63 పరుగులకు సఫారీలు నాల్గో వికెట్‌ను నష్టపోయారు. ఈ తరుణంలో ఎల్గర్‌-డుప్లెసిస్‌ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 115 పరుగులు జోడించిన తర్వాత డుప్లెసిస్‌ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో లెగ్‌ గల్లీలో ఫీల్డింగ్‌ చేస్తున్న పుజారాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. కాగా, జట్టు స్కోరు 178 పరుగుల వద్ద డుప్లెసిస్‌ ఐదో వికెట్‌గా ఔటైన తర్వాత ఎల్గర్‌కు డీకాక్‌ జత కలిశాడు. డీకాక్‌ సైతం ఎల్గర్‌కు చక్కటి సహకారం​ అందించడంతో దక్షిణాఫ్రికా తేరుకుంది. ఈ జోడి 164 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత ఎల్గర్‌ ఔటయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement