
సెయింట్ పీటర్స్‌బర్గ్: ప్రపంచకప్‌లో బెల్జియంకు ఊరటనిచ్చే విజయం. ఫైనల్ చేరలేదన్న బాధ నుంచి తేరుకున్న రెడ్ డెవిల్స్... కప్‌లో తమ ప్రయాణాన్ని అత్యుత్తమ స్థానంతో ముగించింది. తమ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఈ మెగా టోర్నీలో తొలిసారిగా మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని అందుకుంది. మూడోస్థానం కోసం శనివారం ఇక్కడ జరిగిన పోరులో బెల్జియం 2–0తో ఇంగ్లండ్‌పై గెలుపొంది టోర్నీని చిరస్మరణీయం చేసుకుంది. ఇప్పటివరకు ఈ మహాసమరంలో నాలుగో స్థానం (1986)లో నిలవడమే బెల్జియం ఘనత. థామస్ మ్యూనెర్ (4వ ని.లో), ఎడెన్ హజార్డ్ (82వ ని.లో) ఒక్కో గోల్ చేసి తమ జట్టుకు మరపురాని విజయాన్ని అందించారు. గెలిచి తీరాలన్న కసితో బరిలోకి దిగిన బెల్జియం మ్యాచ్ ప్రారంభంలోనే అదరగొట్టింది.
4వ నిమిషంలో గోల్ చేసి ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచింది. ‘డి’ ఏరియా నుంచి చాడ్లీ ఇచ్చిన క్రాస్ పాస్‌ను అందుకున్న మ్యూనెర్ అదే ఊపులో బంతిని నెట్‌లోకి పంపి బెల్జియంను ఆనందంలో ముంచెత్తాడు. తర్వాత తేరుకున్న ఇంగ్లండ్ బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ తొలి అర్ధభాగం ప్రత్యర్థిని నిలువరించింది. రెండో అర్ధభాగంలో ఇంగ్లండ్ ఆటగాడు ఎరిక్ డెయిర్ (69వ నిమిషం) గోల్ ప్రయత్నాన్ని అల్డెర్‌విరాల్డ్ అద్భుత రీతిలో అడ్డుకున్నాడు. తర్వాత 82వ నిమిషంలో డి బ్రుయెన్ నుంచి బంతిని అందుకున్న బెల్జియం కెప్టెన్ హజార్డ్ ఇంగ్లండ్ గోల్ కీపర్ పిక్‌ఫోర్డ్‌ను బోల్తా కొట్టిస్తూ మరో గోల్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు నాలుగో స్థానంతో ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment