భారత్ జట్టు
సఫారీ సిరీస్ తుది అంకానికి వచ్చింది. న్యూలాండ్స్‌లో దక్షిణాఫ్రికాను ఓడిస్తే భారత్ ఈ పర్యటనను విజయంతో ముగించినట్లవుతుంది. అద్భుత బ్యాటింగ్‌తో ప్రొటీస్ రెండో టి20ని గెలుపొందింది. ఇది వారిలో ఉత్సాహం నింపి ఉంటుంది. ఇది విజయం మాత్రమే కాదు... వన్డే సిరీస్‌లో తమను వేధించిన యజువేంద్ర చహల్‌ను వారు ఎదుర్కొన్న తీరు తర్వాతి మ్యాచ్‌లో ఎలా ఆడనున్నారనేదానికీ సంకేతం. చహల్‌కు ఇలాంటి అనుభవం రెండోసారి. దీంతో న్యూలాండ్స్‌లో అతడి బదులు అక్షర్ పటేల్‌ను ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భారత్ తమ టాపార్డర్‌లోని ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను 50 పరుగుల్లోపే కోల్పోవడం ఎప్పుడో కాని జరగదు. కోహ్లి అద్భుత బంతికి అవుటయ్యాడు. మనీశ్ పాండే అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
తన మ్యాచ్ ఫినిషింగ్ సామర్థ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలకు ధోని ఈ ఇన్నింగ్స్‌తో తెరదించాడు. వీరిద్దరి దాదాపు శతక భాగస్వామ్యంతో జట్టుకు మంచి స్కోరు వచ్చింది. అయినప్పటికీ దానిని కాపాడుకోలేక పోయిందంటే ఘనతంతా ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌దే. ప్రొటీస్ ఇన్నింగ్స్ ఆసాంతం జల్లులు పడుతున్నా మ్యాచ్‌ను కొనసాగించాలన్న అంపైర్ల నిర్ణయాన్ని ప్రశంసించాల్సిందే. భారీగా హాజరైన ప్రేక్షకులు ఈ కారణంగా సంతృప్తిగా ఇళ్లకు వెళ్లి ఉంటారు. టి20లు ఉన్నది వినోదానికే. అందుకని చిన్నపాటి వర్షానికి మ్యాచ్‌లు ఆగిపోకూడదు. మొత్తానికి గెలిచినందుకు ప్రొటీస్ జట్టుకు అభినందనలు. ఆట నిలిచిపోకుండా చూసి అభిమానుల డబ్బుకు సరైన విలువ చేకూర్చిన భారత జట్టుకు, అంపైర్లకు కూడా...!
Comments
Please login to add a commentAdd a comment