
ఇంగ్లండ్ గుండె పగిలింది
ఫుట్‌బాల్ అంటే వారికి ప్రాణం... ఆట కోసం నిద్రాహారాలు మానేస్తారు... ప్రపంచంలో ఏ మూల తమ జట్టు ఆడుతున్నా వేలాదిగా వెళ్లి జట్టును ప్రోత్సహిస్తారు. ఆ దేశంలో పుట్టిన ఆటగాడు ఎవరైనా బాగా ఆడాడంటే దేవుడిలా ఆరాధిస్తారు. ఇంగ్లండ్‌లో ఫుట్‌బాల్‌కు ఉన్న ఆదరణ, మమకారం ఇది. అందుకే ఆ దేశంలో జరిగే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ. అయితే 1966 ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన తర్వాత ఇంగ్లండ్ జాతీయ జట్టు మాత్రం ఏ టైటిల్ గెలవలేదు. ఈసారి యూరోలో ఎలాగైనా తమ జట్టు గెలుస్తుందని భారీ అంచనాలతో ఉన్న ఇంగ్లండ్ గుండె పగిలింది. యూరో ప్రిక్వార్టర్స్‌లో ఐస్‌లాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోయింది.
నైస్: ఐస్‌లాండ్ జనాభా కేవలం 3 లక్షల 38 వేలు. జట్టులో స్టార్ ఆటగాళ్లెవరూ లేరు. జట్టులో ఎవరికీ పెద్దగా అనుభవం కూడా లేదు.అయినా స్ఫూర్తిదాయక ఆటతీరుతో చెలరేగిన ఐస్‌లాండ్... ఈ యూరోలోనే పెను సంచలనం నమోదు చేసింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఐస్‌లాండ్ 2-1తో ఇంగ్లండ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఐస్‌లాండ్ తరఫున సిక్వెర్డ్‌సన్ (6వ ని.), సిగ్తోర్సన్ (18వ ని.) గోల్స్ చేయగా, కెప్టెన్ రూనీ (4వ ని.) ఇంగ్లండ్‌కు ఏకైక గోల్ అందించాడు. 1966 తర్వాత మరో మేజర్ టైటిల్‌పై కన్నేసిన ఇంగ్లండ్ ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. ఆరు మార్పులతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మైదానంలో చురుకుగా కదల్లేకపోయింది.
ఆరంభంలో స్టెర్లింగ్ ఇచ్చిన పాస్‌ను స్టూరిడ్జ్ గోల్‌గా మలిచే ప్రయత్నంలో ఐస్‌లాండ్ గోల్ కీపర్ ఫౌలయ్యాడు. దీంతో నాలుగో నిమిషంలో లభించిన పెనాల్టీని రూనీ బాటమ్ నుంచి లక్ష్యాన్ని చేర్చాడు. దీంతో కెరీర్‌లో 53వ గోల్‌తో డేవిడ్ బెక్‌హామ్ సరసన నిలిచాడు. అయితే ఇంగ్లండ్ ఆనందం రెండు నిమిషాల్లోనే ఆవిరైంది. ఐస్‌లాండ్ రైట్ విండ్ మిస్సైల్ కారీ ఆర్నసన్ హెడ్‌తో అందించిన పాస్‌ను సిక్వెర్డ్‌సన్ చాకచక్యంగా నెట్‌లోకి పంపి స్కోరును సమం చేశాడు.
మరో 12 నిమిషాల తర్వాత సిక్వెర్డ్‌సన్, బోద్వర్‌సన్‌లు సమయోచితంగా కదులుతూ ఇచ్చిన పాస్‌ను సిగ్తోర్సన్ ఇంగ్లండ్ గోల్ కీపర్ హార్ట్‌ను ఏమారుస్తూ గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. తర్వాత ఇంగ్లండ్ సూపర్ అటాకింగ్‌తో రెచ్చిపోయినా ఐస్‌లాండ్ రక్షణశ్రేణి సమర్థంగా తిప్పికొట్టింది. రెండో అర్ధభాగంలో కాస్త వ్యూహాత్మకంగా ఆడిన ఇంగ్లండ్ ఒకటి, రెండు అవకాశాలను సృష్టించుకున్నా ఐస్‌లాండ్ డిఫెండర్లు అడ్డుకోవడంతో ఓటమి తప్పలేదు.
హడ్సన్ రాజీనామా!
ఓటమికి బాధ్యత వహిస్తూ ఇంగ్లండ్ కోచ్ రాయ్ హడ్సన్ మేనేజర్ పదవికి రాజీనామా చేశారు. వాస్తవంగా ఈ టోర్నీ తర్వాత ఆయన కాంట్రాక్ట్ ముగియనుంది. అయితే తను మరోసారి ఒప్పందాన్ని పునరుద్ధరించుకునే అవకాశాల్లేవని హడ్సన్ స్పష్టం చేశారు. ‘మరో రెండేళ్లు పదవిలో ఉండాలని అనుకున్నా. కానీ ఇది పూర్తిగా ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. యూరో తర్వాత నా కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించేవాళ్లు. కానీ ఇప్పుడు వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నా’ అని హడ్సన్ పేర్కొన్నారు.