►ఓటమితో నాయకత్వం ముగించిన ధోని
►తొలి వార్మప్‌లో భారత్ ‘ఎ’ పరాజయం
►3 వికెట్లతో ఇంగ్లండ్ ఎలెవన్ గెలుపు
►సెంచరీతో ఆకట్టుకున్న రాయుడు
ధోని, ధోని... కెప్టెన్, కెప్టెన్... బ్రాబోర్న్ స్టేడియం మొత్తం ఒకే నామాన్ని జపించింది. ఆటగాడిగా అతని మెరుపులు చూసే అవకాశం మున్ముందు ఉన్నా, కెప్టెన్‌గా ఆఖరి మ్యాచ్ కావడంతో ముంబై మొత్తం అసలు మ్యాచ్ కోసం వెళ్లినట్లుగా మైదానానికి తరలింది. ఉచిత ప్రవేశం అంటూ ఇచ్చిన అవకాశంతో అభిమానం పోటెత్తి స్టాండ్‌లను ముంచేసింది. ఎన్నడూ లేని విధంగా అభిమానం ‘పాదాభివందనం’గా కూడా మారిపోయింది. గ్రౌండ్‌లో ధోని కదిలినా, మెదిలినా ప్రేక్షకులు తమ చప్పట్లు, కేకలతో హోరెత్తించి వార్మప్ మ్యాచ్‌లోనూ వేడిని పెంచారు. ధోని కూడా ఒకే ఓవర్లో 23 పరుగులతో చెలరేగి తన నుంచి ఆశించిన ఆనందాన్ని పంచాడు. అయితే చివరకు మాత్రం అతను పరాజయంతోనే తన నాయకత్వాన్ని ముగించాడు. తొలి ప్రాక్టీస్‌లో విజయంతో పర్యటనలో మోర్గాన్ సేన శుభారంభం చేసింది.
ముంబై: భారత క్రికెట్‌లో అత్యంత విజ యవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథిగా తన ఆఖరి మ్యాచ్‌లో జట్టును గెలిపించలేకపోయాడు. బ్యాటింగ్‌లో తనదైన శైలిలో ధాటిని ప్రదర్శించినా, మ్యాచ్‌లో విజయం మాత్రం దక్కలేదు. వన్డే, టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోని, ఇంగ్లండ్ ఎలెవన్‌తో జరిగిన వార్మప్ వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎలెవన్ 3 వికెట్ల తేడాతో భారత్ ‘ఎ’ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. అంబటి రాయుడు (97 బంతుల్లో 100 రిటైర్డ్ అవుట్; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ధోని (40 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్ (84 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్), యువరాజ్ (48 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా చెలరేగారు. అనంతరం ఇంగ్లండ్ ఎలెవన్ 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 307 పరుగులు చేసింది. స్యామ్ బిల్లింగ్స్ (85 బంతుల్లో 93; 8 ఫోర్లు) సెంచరీ చేజార్చుకున్నాడు. జేసన్ రాయ్ (57 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, బట్లర్ (46), డాసన్ (41), హేల్స్ (40) ఫర్వాలేదనిపించారు. ఇరు జట్ల మధ్య రెండో వార్మప్ మ్యాచ్ గురువారం జరుగుతుంది.
సెంచరీ భాగస్వామ్యం...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే మన్‌దీప్ (8) వికెట్ కోల్పోయింది. అయితే ఈ దశలో ధావన్, రాయుడు కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ముందుగా 73 బంతుల్లో ధావన్, తర్వాత 58 బంతుల్లో రాయుడు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు వీరిద్దరు 111 పరుగులు జోడించిన అనంతరం ధావన్‌ను బాల్ అవుట్ చేశాడు. వచ్చీ రాగానే రషీద్ ఓవర్లో రెండు సిక్సర్లు బాది యువరాజ్ సత్తా ప్రదర్శించాడు. 40 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తి కాగా, 97 బంతుల్లో సెంచరీ అవగానే రాయుడు రిటైర్డ్ అయ్యాడు. 42వ ఓవర్లో క్రీజ్‌లోకి వచ్చిన ధోనికి ప్రేక్షకులు ఘనస్వాగతం పలికారు. యువీ, శామ్సన్ (0) వరుస ఓవర్లలో అవుటైనా ధోని తన జోరును చూపించాడు. వోక్స్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అతను రెండు ఫోర్లు, రెండు భారీ సిక్స్‌లతో మొత్తం 23 పరుగులు చేయడం విశేషం.
శుభారంభం...
ఛేదనలో ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. రాయ్, హేల్స్ చక్కటి షాట్లతో స్కోరుబోర్డును పరుగెత్తించారు. నెహ్రా ఓవర్లో రాయ్ 2 ఫోర్లు, సిక్సర్ కొట్టగా... మోహిత్ ఓవర్లో హేల్స్ 2 ఫోర్లు, సిక్సర్ బాదాడు. తొలి వికెట్‌కు 95 పరుగులు జత చేసిన హేల్స్‌ను అవుట్ చేసి తొలి వికెట్ అందించిన కుల్దీప్, తన తర్వాతి ఓవర్లోనే రాయ్‌ను కూడా పెవిలియన్ పంపించాడు. మోర్గాన్ (3) ఎక్కువ సేపు నిలవలేకపోగా... బట్లర్, బిల్లింగ్స్ నాలుగో వికెట్‌కు 79 పరుగులు జత చేసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. అయితే మళ్లీ కుల్దీప్ ప్రత్యర్థిని దెబ్బ తీస్తూ ఒకే ఓవర్లో బట్లర్, అలీ (0)లను అవుట్ చేశాడు.ఈ దశలో ధాటిగా ఆడుతూ 60 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న బిల్లింగ్స్, ఆ తర్వాత కూడా చెలరేగాడు. అతనికి డాసన్ అండగా నిలిచాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ఒకే స్కోరు వద్ద వీరిద్దరు వెనుదిరిగినా, వోక్స్ (11 నాటౌట్), రషీద్ (6 నాటౌట్) కలిసి తమ జట్టును గెలిపించారు.
స్కోరు వివరాలు
భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: మన్‌దీప్ (బి) విల్లీ 8; ధావన్ (సి) బట్లర్ (బి) బాల్ 63; రాయుడు (రిటైర్డ్ అవుట్) 100; యువరాజ్ (సి) రషీద్ (బి) బాల్ 56; ధోని (నాటౌట్) 68; శామ్సన్ (సి) హేల్స్ (బి) విల్లీ 0; పాండ్యా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 304.
వికెట్ల పతనం: 1–25; 2–136; 3–227; 4–250; 5–257.
బౌలింగ్: వోక్స్ 10–1–71–0; విల్లీ 10–1–55–2; అలీ 10–0–42–0; బాల్ 10–0–61–2, రషీద్ 8–0–49–0; డాసన్ 2–0–24–0.
ఇంగ్లండ్ ఎలెవన్ ఇన్నింగ్స్: రాయ్ (సి) శర్మ (బి) కుల్దీప్ 62; హేల్స్ (సి) శామ్సన్ (బి) కుల్దీప్ 40; బిల్లింగ్ (బి) పాండ్యా 93; మోర్గాన్ (సి) ధావన్ (బి) చహల్ 3; బట్లర్ (సి) శర్మ (బి) కుల్దీప్ 46; అలీ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; డాసన్ (సి) అండ్ (బి) కుల్దీప్ 41; వోక్స్ (నాటౌట్) 11; రషీద్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (48.5 ఓవర్లలో 7 వికెట్లకు) 307.
వికెట్ల పతనం: 1–95; 2–106; 3–112; 4–191; 5–191; 6–290; 7–290.
బౌలింగ్: నెహ్రా 6–0–50–0; పాండ్యా 9.5–1–48–1; శర్మ 9–0–58–0; చహల్ 10–0–56–1; కుల్దీప్ 10–1–60–5; యువరాజ్ 4–0–32–0.
బై బై ‘నాయకా’
Published Wed, Jan 11 2017 1:20 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
Advertisement
Advertisement