నాటింగ్‌హామ్ (ఇంగ్లండ్): కొద్దిరోజుల్లో ఇక్కడే ప్రపంచకప్ జరగనుంది. అసలే ఆతిథ్య ఇంగ్లండ్ టాప్ ర్యాంక్‌లో ఉంది. ఇప్పుడు పాక్‌పై ధనాధన్ ఛేజింగ్‌లతో వణికిస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే మళ్లీ భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించేసింది. పాపం పాకిస్తాన్! మరోసారి 340 పరుగులు చేసినా గెలువలేకపోయింది. మొత్తానికి ఐదు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లండ్ అ‘ద్వితీయ’ ఛేజింగ్‌తో కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా పాకిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 340 పరుగులు చేసింది. బాబర్ అజమ్ (112 బంతుల్లో 115; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. టామ్ కరన్ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ జాసన్ రాయ్ (89 బంతుల్లో 114; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీరోచిత సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ మోర్గాన్ స్థానంలో బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు అచ్చొచ్చిన పిచ్‌పై ఫఖర్ జమాన్ (57; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హఫీజ్ (59; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), షోయబ్ మాలిక్ (41; 4 ఫోర్లు) ధాటిగా ఆడారు. దీంతో పాక్ 300 పైచిలుకు స్కోరు అవలీలగా దాటేసింది. తర్వాత భారీ లక్ష్యఛేదనను జాసన్ రాయ్, విన్స్ (39 బంతుల్లో 43; 6 ఫోర్లు) చకచకా ప్రారంభించారు. ఒకదశలో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 201 పరుగులతో విజయం దిశగా దూసుకుపోయింది. అయితే జేసన్ రాయ్ ఔటయ్యాక... రూట్ (41 బంతుల్లో 36; 3 ఫోర్లు), బట్లర్ (0), మొయిన్ అలీ (0), డెన్లీ (17) కూడా వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ 258 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే స్టోక్స్ (71 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), టామ్ కరన్ (31; 5 ఫోర్లు) ఏడో వికెట్‌కు 61 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. కరన్ ఔటయ్యాక... రషీద్ (12 నాటౌట్)తో కలిసి స్టోక్స్ ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ వన్డేల్లో 340 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యధికంగా నాలుగుసార్లు ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది. భారత్ మూడుసార్లు ఈ ఘనత సాధించింది.
రాత్రంతా ఆస్పత్రిలో... మధ్యాహ్నం మైదానంలో...
ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్ డాషింగ్ ఓపెనర్. తన సహజశైలి ఆటతో ఇప్పటిదాకా ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. జట్టును విపత్కర పరిస్థితుల నుంచి కాపాడాడు. తాజాగా మళ్లీ దంచికొట్టుడుతో జట్టును గట్టెక్కించాడు. సిరీస్ విజయాన్నిచ్చాడు. కానీ... అంతకంటే ముందు అతని కుటుంబంలోనే విపత్కర పరిస్థితి ఎదురైంది. తన గారాలపట్టి, రెండు నెలల చిన్నారి ఎవర్లీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు అత్యవసరంగా తన కుమార్తెను ఆస్పత్రికి తరలించి ఉదయం 8.30 గంటలదాకా అక్కడే ఉన్నాడు. తన చిట్టితల్లి ఆరోగ్యం కుదుటపడగానే మ్యాచ్ కోసం బయల్దేరాడు... రెండు గంటలు నిద్రించి... మళ్లీ ఠంచనుగా వార్మప్‌తోనే మైదానంలోకి దిగాడు. జట్టును గెలిపించేదాకా చెలరేగాడు. ముందు కుటుంబధర్మాన్ని, తర్వాత వృత్తిధర్మాన్ని నెరవేర్చిన అతని నిబద్ధతకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment