పాకిస్తాన్ ఎప్పటిలాగే ఏం చేయగలదో అదే చేసి చూపించింది. సరిగ్గా మూడు రోజుల క్రితం 100 పరుగులు చేయడానికి ఆపసోపాలు పడిన మైదానంలోనే అంతకు మూడు రెట్ల పరుగులు సాధించింది. ప్రపంచ కప్‌లో అమేయ శక్తిగా కనిపిస్తున్న ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించి గత మ్యాచ్‌లో పడిన చోటనే మళ్లీ విజయాన్ని వెతుక్కుంది. తొలి ఓటమి తర్వాత అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆ జట్టు అసమానమైన ఆటతో ఇంగ్లండ్‌ను పడగొట్టింది.
ముందుగా బ్యాటింగ్‌లో 348 పరుగులు చేసినా... పరుగుల వరద పారే ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో అది ఛేదించదగిన లక్ష్యమే కాబట్టి భారీ స్కోరుతో గెలుపు ఖాయమైపోలేదు. ఒక దశలో రూట్, బట్లర్ సొగసైన సెంచరీలు ఇంగ్లండ్‌ను విజయానికి చేరువగా తెచ్చినా... ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఆతిథ్య జట్టును దెబ్బ తీసింది. చివర్లో ఒత్తిడిని అధిగమించి కట్టుదిట్టమైన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి ఆట కట్టించిన పాక్ వరల్డ్ కప్‌లో తాము కూడా ఉన్నామనే విషయాన్ని గుర్తు చేసింది.
నాటింగ్‌హామ్: వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో ఘన విజయంతో బోణీ చేసి ఊపు మీదున్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుకు షాక్ తగిలింది. మొదటి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ అనూహ్యంగా కోలుకోవడంతో మోర్గాన్ సేన ఓటమి రుచి చూసింది. సోమవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాక్ 14 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హఫీజ్ (62 బంతుల్లో 84; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (66 బంతుల్లో 63; 4 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ అహ్మద్ (44 బంతుల్లో 55; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ వోక్స్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసి ఓడింది. జో రూట్ (104 బంతుల్లో 107; 10 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (76 బంతుల్లో 103; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు సాధించినా తమ జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో వహాబ్ రియాజ్‌కు 3 వికెట్లు... షాదాబ్ ఖాన్, ఆమిర్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ వికెట్‌ను హఫీజ్ తీశాడు.
రాణించిన ఓపెనర్లు...
వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్ ఈ మ్యాచ్‌లో తమ బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకుంది. టాప్–5లో ముగ్గురు అర్ధ సెంచరీలు చేయగా, మరో ఇద్దరు కూడా కీలక పరుగులు సాధించారు. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హఖ్ (58 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్), ఫఖర్ జమాన్ (40 బంతుల్లో 36; 6 ఫోర్లు) తమ జట్టుకు కావాల్సిన శుభారంభాన్ని అందించారు. వోక్స్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు ఫోర్లతో ఫఖర్ జోరు మొదలు పెట్టగా, వోక్స్ మరో ఓవర్లో ఫోర్, సిక్స్‌తో ఇమామ్ దానిని కొనసాగించాడు. గత మ్యాచ్‌లో విండీస్ షార్ట్ పిచ్ బంతులతో పాకిస్తాన్‌ను దెబ్బ తీసిన తరహాలోనే ఇంగ్లండ్ పేసర్లు కూడా తీవ్రంగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. 10 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు 69 పరుగులకు చేరింది. చివరకు 82 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం తర్వాత ఫఖర్‌ను ఔట్ చేసి అలీ ఇంగ్లండ్‌కు తొలి వికెట్ అందించాడు.
కొద్ది సేపటికే వోక్స్ అద్భుత క్యాచ్‌తో ఇమామ్ కూడా వెనుదిరిగాడు. ఈ దశలో సీనియర్ ఆటగాడు హఫీజ్... బాబర్, సర్ఫరాజ్‌లతో నమోదు చేసిన రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు పాక్ భారీ స్కోరుకు కారణమయ్యాయి. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హఫీజ్ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను మిడాఫ్‌లో జేసన్ రాయ్ వదిలి పెట్టడం పాక్‌కు కలిసొచ్చింది. రషీద్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో బాబర్ చెలరేగడంతో 14 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 50 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అనంతరం వోక్స్ మరో చక్కటి క్యాచ్‌కు బాబర్ పెవిలియన్ చేరగా, మరోవైపు 39 బంతుల్లోనే హఫీజ్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో ఎండ్‌లో సర్ఫరాజ్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే ముందుగా హఫీజ్‌ను ఔట్ చేసిన వుడ్... ఆ తర్వాత ఆసిఫ్ అలీ (14)ని కూడా వెనక్కి పంపాడు. తర్వాతి ఓవర్లో రెండు వికెట్లు తీసిన వోక్స్... చివరి ఓవర్లో కూడా మరో వికెట్ పడగొట్టాడు.
130 పరుగుల భాగస్వామ్యం...
ఛేజింగ్‌లో ఇంగ్లండ్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. జేసన్ రాయ్ (8)ను ఎల్బీగా ఔట్ చేసి షాదాబ్ ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. రాయ్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. ఆ వెంటనే 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రూట్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో బాబర్ వదిలేసి ఇంగ్లండ్‌కు మేలు చేశాడు! రియాజ్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించిన బెయిర్‌స్టో (31 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) చివరకు అతని బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. కెప్టెన్ మోర్గాన్ (9), బెన్ స్టోక్స్ (13) కూడా విఫలం కావడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. అయితే ఐదో వికెట్‌కు రూట్, బట్లర్ సెంచరీ భాగస్వామ్యం ఆ జట్టును లక్ష్యం దిశగా తీసుకుపోయింది. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ పరుగులు సాధించారు. షాదాబ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో బట్లర్ 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటికి రియాజ్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన రూట్ 97 బంతుల్లో కెరీర్‌లో 15వ సెంచరీ అందుకున్నాడు. ఈ ప్రపంచ కప్‌లో నమోదైన తొలి శతకం ఇదే కావడం విశేషం. అయితే సెంచరీ కాగానే రూట్‌ను షాదాబ్ ఔట్ చేయగా... కొద్ది సేపటికి 75 బంతుల్లోనే శతకం అందుకున్న బట్లర్ కూడా తర్వాతి బంతికే వెనుదిరిగాడు. ఈ దశలో విజయానికి 33 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచిన ఇంగ్లండ్ చివరకు చేతులెత్తేసింది.
స్కోరు వివరాలు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఇమామ్ (సి) వోక్స్ (బి) అలీ 44; ఫఖర్ జమాన్ (స్టంప్డ్) బట్లర్ (బి) అలీ 36; ఆజమ్ (సి) వోక్స్ (బి) అలీ 63; హఫీజ్ (సి) వోక్స్ (బి) వుడ్ 84; సర్ఫరాజ్ (సి అండ్ బి) వోక్స్ 55; ఆసిఫ్ అలీ (సి) బెయిర్‌స్టో (బి) వుడ్ 14; మాలిక్ (సి) మోర్గాన్ (బి) వోక్స్ 8; రియాజ్ (సి) రూట్ (బి) వోక్స్ 4; హసన్ అలీ (నాటౌట్) 10; షాదాబ్ ఖాన్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 348.
వికెట్ల పతనం: 1–82, 2–111, 3–199, 4–279, 5–311, 6–319, 7–325, 8–337. బౌలింగ్: వోక్స్ 8–1–71–3, ఆర్చర్ 10–0–79–0, అలీ 10–0– 50–3, వుడ్ 10–0–53–2, స్టోక్స్ 7–0– 43–0, రషీద్ 5–0–43–0.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (ఎల్బీ) (బి) షాదాబ్ 8; బెయిర్‌స్టో (సి) సర్ఫరాజ్ (బి) రియాజ్ 32; రూట్ (సి) హఫీజ్ (బి) షాదాబ్ 107; మోర్గాన్ (బి) హఫీజ్ 9; స్టోక్స్ (సి) సర్ఫరాజ్ (బి) మాలిక్ 13; బట్లర్ (సి) రియాజ్ (బి) ఆమిర్ 103; అలీ (సి) జమాన్ (బి) రియాజ్ 19; వోక్స్ (సి) సర్ఫరాజ్ (బి) రియాజ్ 21; ఆర్చర్ (సి) రియాజ్ (బి) ఆమిర్ 1; రషీద్ (నాటౌట్) 3; వుడ్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 334.
వికెట్ల పతనం: 1–12, 2–60, 3–86, 4–118, 5–248, 6–288, 7–320, 8–320, 9–322.
బౌలింగ్: షాదాబ్ 10–0–63–2, ఆమిర్ 10–0–67–2, రియాజ్ 10–0–82–3, హసన్ అలీ 10–0–66–0, హఫీజ్ 7–0–43–1, మాలిక్ 3–0–10–1.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment