సఫారీలకు షాక్
♦ సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి
♦ ఫిన్, అలీ మెరుపు బౌలింగ్
డర్బన్: భారత్‌తో టెస్టు సిరీస్ పరాజయాలను మర్చిపోకముందే ప్రపంచ నంబర్‌వన్ దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో సొంతగడ్డపై కూడా ఘోర ఓటమిని మూటగట్టుకుంది. పేసర్ ఫిన్ (4/42), స్పిన్నర్ మొయిన్ అలీ (3/47)లు బౌలింగ్‌లో చెలరేగడంతో బుధవారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 241 పరుగుల తేడాతో ప్రొటీస్‌పై ఘన విజయం సాధించింది.
దీంతో 4 మ్యాచ్‌ల సిరీస్‌లో కుక్‌సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. 416 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. ఎల్గర్ (40), డివిలియర్స్ (37), వాన్‌జెల్ (33) మినహా మిగతా వారు విఫలమయ్యారు.
136/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన సఫారీలు అలీ స్పిన్ మ్యాజిక్‌కు పూర్తిగా చతికిలపడ్డారు. బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమై ఒత్తిడికి లోనయ్యారు. రోజులో మూడో బంతికే డివిలియర్స్‌ను బోల్తా కొట్టించిన అలీ.. తన తర్వాతి ఓవర్‌లో బావుమా (0)ను వెనక్కి పంపాడు. దీంతో సఫారీల స్కోరు 136/6గా మారింది.
ఈ దశలో డుమిని (26 నాటౌట్) కాసేపు ప్రతిఘటించినా రెండో ఎండ్ నుంచి సహకారం కరువైంది. స్టెయిన్ (2), అబాట్ (2), పీట్ (0), మోర్నీ మోర్కెల్ (8)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో ప్రొటీస్‌కు ఓటమి తప్పలేదు. ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా 38 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. బ్రాడ్, వోక్స్, స్టోక్స్ తలా ఓ వికెట్ తీశారు. అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జనవరి 2 నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది.