చివరి వన్డేలో టీమిండియా ఓటమి
లీడ్స్: వరుసుగా మూడో వన్డేల్లో గెలిచి ఇంగ్లండ్ పై సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా తన చివరి వన్డేను ఓటమితో ముగించింది. ఐదో వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 295 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే చుక్కెదురైంది. గత మ్యాచ్ హీరో ఆజ్యింకా రహానే(0) కే పెవిలియన్ కు చేరి భారత అభిమానులను నిరాశపరిచినా, మరో ఓపెనర్ శిఖర్ థావన్ (31) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు అంబటి రాయుడు (53), కెప్టెన్ ధోనీ (29) పరుగులు చేసి వెంట వెంటనే అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. కాగా, చివర్లో రవీంద్రా జడేజా (83) పరుగులతో ఆకట్టుకున్నా.. లక్ష్యం భారీగా ఉండటంతో టీమిండియా 253 పరుగులకే పరిమితమై ఓటమి చెందింది.
ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ కు మూడు వికెట్లు లభించగా, అలీ, అండర్ సన్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్లకు 294 పరుగులు చేసింది. రూట్ (113) సెంచరీ చేసి ఇంగ్లండ్ను ఆదుకున్నాడు. బట్లర్ (49), కుక్ (46) రాణించారు. మొదట్లో ఇంగ్లండ్ నింపాదిగా ఆడినా, చివర్లో వేగంగా పరుగులు రాబట్టింది. ఈ వన్డే సిరీస్ను ధోనీసేన 3-0తో గెల్చుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, తర్వాతి మూడు వన్డేల్లో భారత్ ఘనవిజయాలు నమోదు చేసింది.