పోరాడి ఓడిన విరాట్ సేన
కోల్కతా: ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది. ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన చివరి వన్డేలో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 316 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. అయితే చివరి ఓవర్ వరకూ జాదవ్(90; 75 బంతుల్లో 12ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా మ్యాచ్ ను మాత్రం గెలిపించలేకపోయాడు.
భారీ లక్ష్యాన్ని ఛేజింగ్ చేసే క్రమంలో భారత్ ఆదిలోనే ఓపెనర్లు అజింక్యా రహానే(1), కేఎల్ రాహుల్(11) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో విరాట్ కోహ్లి-యువరాజ్ సింగ్ల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఈ జోడి 65 పరుగుల జోడించి భారత్ ను గాడిలో పెట్టారు. అయితే కోహ్లి(55;63 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించి మూడో వికెట్ గా అవుట్ కాగా, ఆ తరువాత కాసేపటికి యువరాజ్(45;57 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయి నాల్గో వికెట్గా పెవిలియన్ చేరాడు.అప్పటికి భారత్ స్కోరు 133 పరుగులు. ఆపై ధోని-కేదర్ జాదవ్లో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు.
కాగా, ధోని(25)ఐదో వికెట్ గా అవుట్ కావడంతో భారత్ జట్టు కాస్త తడబడినట్లు కనిపించింది. ఆ సమయంలో జాదవ్ తో జత కలిసిన హార్దిక్ పాండ్యా బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే జాదవ్ 46 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, కాసేపటికి 38 బంతుల్లో పాండ్యా అర్థ శతకం సాధించాడు. ఈ జోడి 104 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత పాండ్యా ఆరో వికెట్ గా పెవిలియన్ బాట పట్టాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన పాండ్యా బౌల్డ్ అయ్యాడు. ఇక చివరి నాలుగు ఓవర్లలో భారత విజయానికి 43 పరుగులు కావాల్సిన తరుణంలో జడేజా దూకుడును కొనసాగించాడు. వోక్స్ వేసిన ఇన్నింగ్స్ 47.0 ఓవర్లలో వరుసగా రెండు ఫోర్లు కొట్టి భారత్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు. కాగా ఆ తరువాత బంతిని సిక్స్ గా మలిచే యత్నంలో భారీ షాట్కు యత్నించి జడేజా(10) పెవిలియన్ చేరాడు. ఇక ఆపై స్వల్ప వ్యవధిలోనే అశ్విన్(1) కూడా అవుట్ కావడంతో జాదవ్ పై భారం పడింది. అయితే చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన తరుణంలో తొలి రెండు బంతుల్ని సిక్స్, ఫోర్ గా మలచిన జాదవ్.. మూడు, నాలుగు బంతుల్ని వృథా చేశాడు. ఈ క్రమంలో 50 ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ కు యత్నించిన జాదవ్ అవుట్ కావడంతో భారత్ కు ఓటమి తప్పలేదు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్(65;56 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), బిల్లింగ్స్(35;58 బంతుల్లో 5 ఫోర్లు)కు తోడు మోర్గాన్(43;44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బెయిర్ స్టో(56;64 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), బెన్ స్టోక్స్(57 నాటౌట్;39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించడంతో ఆ జట్టు మరోసారి మూడొందల మార్కును చేరింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్-బిల్లింగ్స్ లు చక్కటి పునాది వేశారు. ఈ జోడి 98 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి శుభారంభం అందించారు.
ఆ తరువాత మోర్గాన్, బెయిర్ స్టోలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను నిలబెట్టగా, చివర్లో బెన్ స్టోక్స్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఇంగ్లండ్ స్కోరును పరుగులు పెట్టించాడు. అతనికి జతగా వోక్స్(34;19 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలోఎనిమిది వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు సాధించగా, జడేజాకు రెండు, బూమ్రాకు ఒక వికెట్ దక్కింది.