ఇంగ్లండ్ తడబాటు
తొలి ఇన్నింగ్స్ 85/4
ఆసీస్ 566/8 డిక్లేర్డ్
స్మిత్ డబుల్ సెంచరీ
లార్డ్స్: యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ జట్టు తడబడుతోంది. రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో కుక్ సేన 29 ఓవర్లలో నాలుగు వికెట్లకు 85 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌కు ఇంకా 481 పరుగులు వెనుకబడి ఉంది. తమ ఇన్నింగ్స్ రెండో బంతికే ప్రారంభమైన వికెట్ల పతనం 30 పరుగులకే నాలుగు వికెట్లు పడేదాకా సాగింది. అయితే ఈ దశలో జట్టును స్టోక్స్ (50 బంతుల్లో 38 బ్యాటింగ్; 5 ఫోర్లు; 1 సిక్స్), కెప్టెన్ కుక్ (85 బంతుల్లో 21 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఆదుకున్నారు. జాన్సన్‌కు రెండు వికెట్లు పడ్డాయి.
అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 149 ఓవర్లలో 8 వికెట్లకు 566 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. స్టీవెన్ స్మిత్ (346 బంతుల్లో 215; 25 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. రోజర్స్ (300 బంతుల్లో 173; 28 ఫోర్లు) కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 284 పరుగుల భారీ భాగస్వామ్యం ఏర్పడింది. ఇదే క్రమంలో తను కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు. బ్రాడ్‌కు నాలుగు, రూట్‌కు రెండు వికెట్లు దక్కాయి.