
పొట్టి ఫార్మాట్‌లోనూ....
ఆస్ట్రేలియా పర్యటనలో యాషెస్‌తో పాటు వన్డే సిరీస్‌నూ కోల్పోయిన ఇంగ్లండ్... పొట్టి ఫార్మాట్‌లోనూ తడబడింది.
హోబర్ట్: ఆస్ట్రేలియా పర్యటనలో యాషెస్‌తో పాటు వన్డే సిరీస్‌నూ కోల్పోయిన ఇంగ్లండ్... పొట్టి ఫార్మాట్‌లోనూ తడబడింది. బుధవారం జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారులు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీస్కోరు సాధించారు. ఓపెనర్లు వైట్ (43 బంతుల్లో 75; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫించ్ (31 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడి తొలి వికెట్‌కు కేవలం 64 బంతుల్లోనే 106 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. క్రిస్ లిన్ (19 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) చివర్లో వేగంగా పరుగులు చేశాడు.
ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 200 పరుగులు చేసి పోరాడినా ఓటమిని తప్పించుకోలేకపోయింది. ఆసీస్ బౌలర్ కౌల్టర్ నీల్ (4/30) ధాటికి ఇంగ్లండ్ ఒక దశలో 100 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే రవి బొపారా (27 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) టెయిలెండర్ల సహకారంతో చివరి వరకూ పోరాడాడు. రూట్ (32) మినహా ఇంగ్లండ్ ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 శుక్రవారం జరుగుతుంది.