
పరిణితి చెందకపోవడం వల్లే..:జాదవ్
న్యూఢిల్లీ: ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి నిలిచి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న భారత క్రికెటర్ కేదర్ జాదవ్.పుణెలో జరిగిన తొలి వన్డేలో 76 బంతుల్లో 120 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ విసిరిన 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విరాట్ తో కలిసి జాదవ్ అమూలమ్యైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇదే తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని అంటున్నాడు జాదవ్.
'ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ తరువాత నా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఇదే ఫామ్ను కొనసాగిస్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకుంటానని ముందే అనుకున్నా.ఆపై మిగతా రెండు వన్డేల్లో కూడా రాణించడంతో అవార్డు దక్కింది. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ నా కెరీర్లో కీలక మలుపు. అంతకుముందు న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ నాలో విశ్వాసాన్ని పెంచితే, ఇది నా కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచింది' అని జాదవ్ తన పునరాగమనంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో 77.33 సగటుతో జాదవ్ 232 పరుగుల్ని సాధించాడు. ఆ క్రమంలోనే 144.09 స్ట్రైక్ రేట్ను జాదవ్ నమోదు చేశాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లో భారీ పరుగులు సాధించలేకపోయినప్పటికీ, తనలోని ఆత్మవిశ్వాసం బలపడటానికి కారణమైందన్నాడు.
తనకు ఆలస్యంగా అవకాశాలు రావడం వల్ల జాదవ్ తనదైన శైలిలో స్పందించాడు. గతంలో తాను తగినంత పరిణితి చెందకపోవడం వల్లే అవకాశాలు రాలేదన్నాడు. ఈ కారణం చేతనే తనకు జాతీయ జట్టులో అవకాశాలు ఆలస్యంగా వచ్చాయన్నాడు.తనకు అవకాశాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ సంతోషంగా ఉన్నట్లు జాదవ్ తెలిపాడు. ప్రస్తుత అవకాశాల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాననే ఆశాభవం జాదవ్ వ్యక్తం చేశాడు.