ఫిఫా 2018; సెమీస్‌కు ఇంగ్లండ్‌ | England Reached Semi Finals In FIFA 2018 World Cup | Sakshi
Sakshi News home page

ఫిఫా 2018; సెమీస్‌కు ఇంగ్లండ్‌

Published Sat, Jul 7 2018 9:30 PM | Last Updated on Sat, Jul 7 2018 9:49 PM

England Reached Semi Finals In FIFA 2018 World Cup - Sakshi

సమరా: నాటకీయంగా సాగుతోన్న ఫిఫా 2018 వరల్డ్‌ కప్‌ నాకౌట్‌ దశలో నేడు మరో సంచలనం చోటుచేసుకుంది. ఎప్పుడో 1966లో కప్‌ గెలుచుకుని, ఇటీవల కాలంలో అంతగా ఆకట్టుకోలేకపోయిన బ్రిటిష్‌ జట్టు ఈ సారి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సమారా ఎరీనా వేదికగా శనివారం జరిగిన మూడో క్వార్టర్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌లో స్వీడన్‌పై 0-2 తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత బ్రిటిష్‌ జట్టు సెమీస్‌కు చేరడంతో అభిమానుల అంచనాలు మరింతగా పెరిగాయి.

ప్రారంభం నుంచే ఆధిపత్యం: ఆట మొదలైన 30వ నిమిషంలోనే ఇంగ్లండ్‌ తొలిగోల్‌ సాధించింది. డిఫెండర్‌ హ్యారీ చాకచక్యంగా తలతో బంతిని స్వీడన్‌ గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు. 0-1 ఆధిపత్యంతో సెకండ్‌ హాఫ్‌లోనూ బ్రిటిషర్లు రెచ్చిపోయారు. 59వ నిమిషంలో డేల్‌ అల్లీ చేసిన గోల్‌తో ఇంగ్లండ్‌ ఆధిపత్యం 2-0కు పెరిగింది. ఎక్స్‌ట్రా ఇంజూరీ టైమ్‌లోనూ స్వీడన్‌ గోల్‌ చేయలేకపోవడంతో గెలుపు ఇంగ్లండ్‌ వశమైపోయింది.

గెట్‌ రెడీ: చాన్నాళ్లకు ట్రోఫీకి చాలా దగ్గరగా వెళ్లిన ఇంగ్లండ్‌.. సెమీస్‌లో ఎవరితో తలపడనుందో మరికాసేపట్లో తేలిపోనుంది. నాలుగో క్వార్టర్‌ ఫైనల్స్‌లో భాగంగా ఆతిథ్య రష్యా.. క్రొయేషియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ఆడుతుంది. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో ఉరుగ్వేపై ఫ్రాన్స్‌, బ్రెజిల్‌పై బెల్జియంలు విజయం సాధించి సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌-బెల్జియంల మధ్య తొలి సెమీస్‌ జులై 10న జరుగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement