
బౌలర్లు రాణించినా... ‘రూట్’ దొరకలేదు
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 352/9
భువనేశ్వర్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు
భారత టెయిలెండర్లను చూసి ఇంగ్లండ్ కూడా స్ఫూర్తి పొందింది. మిడిలార్డర్ తడబడినా... చివరి వరుస బ్యాట్స్‌మెన్ తలా కొన్ని పరుగులు జత చేయడంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ పుంజుకుంది. ఓ ఎండ్‌లో రూట్ గోడలా నిలబడటంతో... భారత పేసర్లు రాణించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.
నాటింగ్‌హామ్: నిర్జీవమైన పిచ్‌పై భారత బౌలర్లు రాణించినా... ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోయ్ రూట్ (158 బంతుల్లో 78 బ్యాటింగ్; 8 ఫోర్లు) మాత్రం కొరకరాని కొయ్యగా మారాడు. మూడో రోజే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేద్దామనుకున్న టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు. మూడు కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి ఆతిథ్య జట్టు కోలుకునేలా చేశాడు.
ఫలితంగా ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో... శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 ఓవర్లలో 9 వికెట్లకు 352 పరుగులు చేసింది. రూట్‌తో పాటు అండర్సన్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. వీరిద్దరు పదో వికెట్‌కు అజేయంగా 54 పరుగులు జోడించారు. ప్రస్తుతం కుక్‌సేన ఇంకా 105 పరుగులు వెనుకబడి ఉంది. భువనేశ్వర్ 4, ఇషాంత్ 3, షమీ 2 వికెట్లు తీశారు.
అంతకుముందు 43/1 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రాబ్సన్ (142 బంతుల్లో 59; 8 ఫోర్లు), బాలెన్సీ (167 బంతుల్లో 71; 9 ఫోర్లు) లంచ్ వరకు 88 పరుగులు జోడించారు.
ఇషాంత్ జోరు...
ఓ దశలో 134/1 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లండ్‌ను లంచ్ తర్వాత ఇషాంత్.. రాబ్సన్, బాలెన్సీని ఎల్బీగా వెనక్కి పంపాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించారు. తర్వాత బెల్ (25), రూట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఇన్నింగ్స్ 60వ ఓవర్‌లో మళ్లీ ఇషాంతే విడదీశాడు. ఓ చక్కని షార్ట్ బంతితో బెల్‌ను అవుట్ చేసి ఈ సెషన్‌లో మూడో వికెట్ చేజిక్కించుకున్నాడు. అలీ (14), ప్రయర్ (5), స్టోక్స్ (0) వెంటవెంటనే అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడింది. ఈ సెషన్‌లో కుక్‌సేన 74 పరుగులు జోడించి 6 వికెట్లు చేజార్చుకుంది.
టీ తర్వాత బ్రాడ్ సాయంతో రూట్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 8వ వికెట్‌కు 78 పరుగులు జోడించిన తర్వాత బ్రాడ్‌ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. ఆ వెంటనే ప్లంకెట్ (7) కూడా వెనుదిరగడంతో ఇంగ్లండ్ 298 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. చివర్లో అండర్సన్ బ్యాట్ అడ్డేశాడు. రూట్‌కు చక్కని సహకారం అందిస్తూ జాగ్రత్తగా రోజు ముగించాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 457 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (బి) షమీ 5; రాబ్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 59; బాలెన్సీ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 71; బెల్ (సి) ధోని (బి) ఇషాంత్ 25; రూట్ 78 బ్యాటింగ్; అలీ (సి) ధావన్ (బి) షమీ 14; ప్రయర్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 5; స్టోక్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 0; బ్రాడ్ ఎల్బీడబ్ల్యు (బి) భువనేశ్వర్ 47; ప్లంకెట్ (బి) భువనేశ్వర్ 7; అండర్సన్ 23 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: (106 ఓవర్లలో 9 వికెట్లకు) 352.
వికెట్ల పతనం: 1-9; 2-134; 3-154; 4-172; 5-197; 6-202; 7-202; 8-280; 9-298
బౌలింగ్: భువనేశ్వర్ 25-8-61-4; షమీ 24-3-98-2; ఇషాంత్ 27-3-109-3; జడేజా 24-4-56-0; బిన్నీ 6-0-22-0.