SA vs Eng: ఇంగ్లండ్‌కు ఘోర అవమానం.. బాధతో బట్లర్‌ బైబై | CT 2025 Klassen Dussen 50s South Africa Beat England By 7 Wickets | Sakshi
Sakshi News home page

SA vs Eng: ఇంగ్లండ్‌కు ఘోర అవమానం.. బాధతో బట్లర్‌ బైబై

Mar 1 2025 8:26 PM | Updated on Mar 1 2025 9:00 PM

CT 2025 Klassen Dussen 50s South Africa Beat England By 7 Wickets

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుండానే ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. సౌతాఫ్రికాతో శనివారం నాటి మ్యాచ్‌తో పరాజయాల పరంపరను పరిపూర్ణం చేసుకుని ఇంటిబాట పట్టింది.

ఈ మెగా టోర్నీలో గ్రూప్‌-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌లతో కలిసి ఇంగ్లండ్‌ బరిలోకి దిగింది. తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొన్న బట్లర్‌ బృందం.. ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం అఫ్గనిస్తాన్‌తో తలపడ్డ ఇంగ్లండ్‌.. ఆఖరి వరకు పోరాడి అనూహ్య రీతిలో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్కోరు
ఈ క్రమంలో సెమీస్‌ రేసు నుంచి వైదొలిగిన ఇంగ్లిష్‌ జట్టు.. ఆఖరిగా సౌతాఫ్రికా(England vs South Africa)తో మ్యాచ్‌లోనైనా గెలవాలని భావించింది. కానీ ప్రొటిస్‌ జట్టు బట్లర్‌ బృందానికి ఆ అవకాశం ఇవ్వలేదు. కరాచీ వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. అయితే, సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి 179 పరుగులకే కుప్పకూలింది.

ఓపెనర్లలో ఫిల్‌ సాల్ట్‌(8), వన్‌డౌన్‌ బ్యాటర్‌ జామీ స్మిత్‌(0)లతో సహా హ్యారీ బ్రూక్‌(19), లియామ్‌ లివింగ్‌స్టోన్‌(9) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో జో రూట్‌ 37 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. జోస్‌ బట్లర్‌(Jos Buttler- 21), జో జోఫ్రా ఆర్చర్‌(25) ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో 179 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్‌ కాగా.. చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్కోరుగా నమోదైంది.

ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 29.1 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో రియాన్‌ రికెల్టన్‌(27) ఫర్వాలేదనిపించగా.. తన ప్రొఫెషనల్‌ కెరీర్‌లో తొలిసారిగా ఓపెనర్‌గా వచ్చిన ట్రిస్టన్‌ స్టబ్స్‌ డకౌట్‌ అయ్యాడు. అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ అర్ధ శతకాలతో చెలరేగారు. 

బాధతో బట్లర్‌ బైబై
డసెన్‌ 87 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలవగా.. క్లాసెన్‌ 56 బంతుల్లో 64 రన్స్‌ సాధించాడు. ఈ క్రమంలో మూడు వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా టార్గెట్‌ను ఛేదించింది. సెమీస్‌ చేరడంతో పాటు గ్రూప్‌-బి టాపర్‌గా నిలిచింది. ఇక ఇదే గ్రూపు నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌ చేరగా.. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ తమ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.  

ఇదిలా ఉంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్‌ వరుస పరాభవాల నేపథ్యంలో బట్లర్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించిన బట్లర్‌.. సౌతాఫ్రికా చేతిలో ఓటమి వల్ల చేదు అనుభవంతో తన కెప్టెన్సీ కెరీర్‌ను ముగించాడు.

సౌతాఫ్రికా వర్సెస్‌ ఇంగ్లండ్‌
👉వేదిక: నేషనల్‌ స్టేడియం, కరాచి
👉టాస్‌: ఇంగ్లండ్‌..బ్యాటింగ్‌
👉ఇంగ్లండ్‌ స్కోరు: 179 (38.2)
👉సౌతాఫ్రికా స్కోరు: 181/3 (29.1)
👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మార్కో యాన్సెన్‌(3/39).

చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌​..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement