
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రయాణం ముగిసింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం లహోర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఇంగ్లండ్.. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఐసీసీ ఈవెంట్‌లలో అఫ్గాన్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోవడం ఇది వరుసగా రెండో సారి కావడం గమనార్హం. వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లీష్ జట్టును మట్టికర్పించిన అఫ్గాన్స్.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఖంగుతిన్పించారు.
ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు సీనియర్ బ్యాటర్ జో రూట్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 326 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ సెంచరీతో మెరిశాడు. ఓ దశలో ఇంగ్లండ్‌ను ఈజీగా గెలిపించేలా కన్పించిన రూట్.. ఆఖరి ఓవర్లలో తన వికెట్‌ను అఫ్గాన్‌కు సమర్పించుకున్నాడు.
దీంతో మ్యాచ్ అఫ్గాన్ సొంతమైంది. రూట్ 111 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 120 పరుగులు చేశాడు. రూట్‌కు ఇది 17వ వన్డే సెంచరీ. అయితే వన్డేల్లో అతడికి ఇది దాదాపు ఆరేళ్ల తర్వాత వచ్చిన శతకం కావడం గమనార్హం. ఈ క్రమంలో రూట్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
చరిత్ర సృష్టించిన రూట్..
ఐసీసీ ఈవెంట్‌లలో 300 ప్లస్ పరుగుల చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. ఐసీసీ టోర్నమెంట్లలో మూడు వందలకు పైగా పరుగుల లక్ష్య చేధనలో రూట్ ఇప్పటివరకు మూడు సెంచరీలు సాధించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై, 2019 వన్డే ప్రపంచ కప్‌లోనాటింగ్‌హామ్‌లో పాకిస్థాన్‌పై శతకాలు నమోదు చేశాడు.
ఈ రెండు సందర్బాలు ఇంగ్లండ్ టార్గెట్ మూడు వందలకు పైగానే ఉంది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం షకీబ్ అల్ హసన్ పేరిట ఉండేది. వీరిద్దరూ చెరో రెండు సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్‌తో ఈ దిగ్గజ క్రికెటర్ల రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.
అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రిస్ గేల్, షేన్ వాట్సన్ రికార్డును రూట్ సమం చేశాడు. ఈ ముగ్గురు లెజండరీ క్రికెటర్లు తలా రెండు శతకాలు నమోదు చేశారు. ఇక ఇంగ్లండ్ తమ ఆఖరి మ్యాచ్‌లో మార్చి1న కరాచీ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడుతోంది.
చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!