ఇంగ్లండ్‌దే సిరీస్
ఇంగ్లండ్‌దే సిరీస్
Published Tue, Aug 13 2013 3:49 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
చెస్టర్ లీ స్ట్రీట్: ఆస్ట్రేలియా జట్టు మరోసారి యాషెస్‌లో తమ పేలవ ప్రదర్శన కొనసాగించింది. 299 పరుగుల లక్ష్యం... రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ కంగారెత్తి తగిన మూల్యం చెల్లించుకుంది. 68.3 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (113 బంతుల్లో 71; 10 ఫోర్లు; 1 సిక్స్), రోజర్స్ (100 బంతుల్లో 49; 8 ఫోర్లు) అందించిన శుభారంభాన్ని మిడి లార్డర్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో రెచ్చిపోవడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. దీంతో నాలుగో టెస్టును ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో గెలిచి 3-0తో సిరీస్ సాధించింది. ఇరు జట్ల మధ్య మరో టెస్టు మిగిలి ఉంది. వార్నర్, రోజర్స్ సమర్థవంతంగా ఆడడంతో తొలి వికెట్‌కు 109 పరుగులు జత చేరాయి.
అప్పటి వరకు పటిష్ట స్థితిలో కనిపించిన ఆసీస్ ఆ తర్వాత పూర్తిగా తడబడింది. 74 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన వార్నర్‌ను టీ విరామం తర్వాత బ్రెస్నన్ దెబ్బతీశాడు. ఇక్కడి నుంచి ఆసీస్ పతనం ప్రారంభమైంది. బ్రాడ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడడంతో ఆసీస్ చివరి ఏడు వికెట్లను 50 పరుగుల తేడాతో కోల్పోయింది. చివర్లో సిడిల్ (48 బంతుల్లో 23; 2 ఫోర్లు) పోరాడినా సహకారం కరువైంది. తొలి ఇన్నింగ్స్‌లోనూ బ్రాడ్ ఐదు వికెట్లు తీయడం విశేషం. బ్రెస్నన్, స్వాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు 234/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 330 పరుగుల వద్ద ముగించింది. బెల్ (210 బంతుల్లో 113; 11 ఫోర్లు) త్వరగానే అవుటయినప్పటికీ బ్రెస్నన్ (90 బంతుల్లో 45; 6 ఫోర్లు) ఆసీస్ బౌలర్లను ప్రతిఘటించాడు.
Advertisement