లీడ్స్: 373/3... 359/4... 341/7... 351/9... ఒక సిరీస్‌లో వరుసగా ఇంగ్లండ్ చేసిన, చరిత్రకెక్కిన స్కోర్లివి! తొలి వన్డే వర్షంతో రద్దయింది కాబట్టి సరిపోయింది. లేదంటే అదికూడా 300 మార్క్‌లో భాగమయ్యేదేమో ఎవరికి తెలుసు. కాబట్టి ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ వెళ్లే బౌలర్లకు హెచ్చరిక. ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేయగలిగే అస్త్రాలుంటేనే మీ పప్పులు ఉడుకుతాయి. లేదంటే మీ బౌలింగ్‌ను వాళ్లే ఉతికి ఆరేస్తారు. చివరిదైన ఐదో వన్డేలోనూ ఇంగ్లండ్ 54 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. సిరీస్‌ను 4–0తో దక్కించుకుంది. ముందుగా ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 351 పరుగులు చేసింది.
రూట్ (84; 9 ఫోర్లు), కెప్టెన్ మోర్గాన్ (76; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచేశారు. విన్స్ (33; 7 ఫోర్లు), బెయిర్‌స్టో (32; 6 ఫోర్లు), బట్లర్ (34; 4 ఫోర్లు, 1 సిక్స్) అందరూ తలా ఒక చేయి వేశారు. ఆఖర్లో కరన్ (29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. షాహిన్ ఆఫ్రిది 4, వసీమ్ 3 వికెట్లు తీశారు. తర్వాత పాకిస్తాన్ 46.5 ఓవర్లలో 297 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (97; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), బాబర్ అజమ్ (80; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. క్రిస్ వోక్స్ (5/54) పాక్ పనిపట్టి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కు 2 వికెట్లు దక్కాయి. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే సిరీస్‌లో వరుసగా నాలుగోసారి 340 పైచిలుకు స్కోరు చేసిన ఏకైక జట్టుగా ఇంగ్లండ్ చరిత్రకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment