మళ్లీ విరాట్ సేనదే బ్యాటింగ్!
నాగ్పూర్:భారత్ తో ఇక్కడ జరుగుతున్న రెండో ట్వంటీ 20లోఇంగ్లండ్ మరోసారి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గత మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. మళ్లీ టాస్ ను కోల్పోయి బ్యాటింగ్ కు చేపట్టింది. ఇప్పటికే మూడు ట్వంటీ 20ల సిరీస్ లో వెనుకబడిన టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం. ఇందులో గెలిస్తేనే భారత్ సిరీస్ లో నిలబడతుంది. కానిపక్షంలో సిరీస్ ను కోల్పోవల్సి వస్తుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు తలో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. భారత తుది జట్టులోకి అమిత్ మిశ్రా రాగా, ఇంగ్లండ్ జట్టులో డాసన్ వచ్చి చేరాడు.
గత మ్యాచ్లో అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ విఫలమైన భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లండ్ కు కనీసం పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది. దాంతో రెట్టించిన ఉత్సాహంతో ఇంగ్లండ్ బరిలోకి దిగుతుండగా, సిరీస్ను కాపాడుకోవాలని విరాట్ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంచితే, ఈ స్టేడియంలో భారత్ ఆడిన రెండు అంతర్జాతీయ ట్వంటీ 20ల్లోనూ ఓటమి పాలుకావడం జట్టును కలవరపరుస్తోంది. 2009 డిసెంబర్ నెలలో శ్రీలంకతో తొలిసారి ఇక్కడ జరిగిన తొలి టీ 20లో భారత్ పరాజయం పాలైంది. ఆ తరువాత 2016 మార్చి 15వ తేదీన న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో కూడా భారత్ కు ఓటమి తప్పలేదు. ఈ రెండు సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజేతగా నిలిచింది. ఇక్కడ చివరిసారి వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా మార్చి 27వ తేదీన వెస్టిండీస్-అఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగింది. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకూ ఇక్కడ 10 ట్వంటీ 20లు జరగ్గా, వాటిలో ఏడుసార్లు మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందడం విశేషం. మరి మొదట బ్యాటింగ్ చేసే విరాట్ సేన ఏం చేస్తుందో చూడాలి.
భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, సురేష్ రైనా,యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని,మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, అమిత్ మిశ్రా, బూమ్రా,నెహ్రా, చాహల్
ఇంగ్లండ్ తుది జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జాసన్ రాయ్,బిల్లింగ్స్, జో రూట్,స్టోక్స్, బట్లర్,మొయిన్ అలీ, జోర్డాన్,డాసన్, మిల్స్, రషిద్