దుబాయ్: ఇంగ్లండ్ యువ క్రికెటర్ విల్ జాక్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ‍్చాడు. దుబాయ్ వేదికగా జరిగిన టీ10 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన జాక్స్ కేవలం 25 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఎనిమిది ఫోర్లు, పదకొండు సిక్సర్లతో చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. టీ10 మ్యాచ్‌లో భాగంగా సర్రే జట్టుకు ఆడుతున్న జాక్స్.. లాంక్‌షైర్ జట్టు బౌలర్లపై బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు.
ఆది నుంచి బౌండరీలే లక్ష్యంగా చెలరేగిన జాక్స్ పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 5వ ఓవర్ ఆరంభానికి ముందు వ్యక్తిగత స్కోరు 62 వద్ద ఉన్న ఈ హిట్టర్.. ఆ ఓవర్ ముగిసే సమయానికి 98 పరుగులతో నిలిచాడు.కేవలం 14 బంతుల్లోనే అర్ధశతకం మైలురాయిని అందుకున్న జాక్స్.. ఆ తర్వాత 25 బంతుల్లో శతకం మార్క్‌ని చేరుకోవడం విశేషం. 30 బంతుల్లో 105 పరుగులు చేసిన అనంతరం జాక్స్ ఔటయ్యాడు. జాన్స్ జోరుతో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నస్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యఛేదనలో తడబడిన లాన్‌షైర్ 9.3 ఓవర్లలోనే 81 పరుగులకి ఆలౌటైంది. ఫలితంగా సర్రే జట్టు 95 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇటీవల తిరువనంతపురం వేదికగా భారత్-ఎ జట్టుతో తలపడిన ఇంగ్లండ్ లయన్స్ జట్టులో జాక్స్ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment