పోర్చుగల్ గట్టెక్కింది
యూరో సెమీస్‌లో రొనాల్డో సేన
క్వార్టర్స్‌లో పోలాండ్ ఓటమి
పెనాల్టీ షూటౌట్‌తో తేలిన ఫలితం
యూరో నాకౌట్ మ్యాచ్‌లో
అతి పిన్న
వయసులో గోల్ చేసిన ఆటగాడిగా సాంచెజ్ (18 ఏళ్ల 317 రోజులు) నిలిచాడు.
పోర్చుగల్‌కు మరోసారి అదృష్టం కలిసొచ్చింది. ఈసారి యూరోలో ఒక్కసారి కూడా నిర్ణీత సమయంలో మ్యాచ్ గెలవకపోయినా, నాకౌట్‌కు చేరిన ఆ జట్టు ఇప్పుడు కూడా అదే తరహాలో ముందంజ వేసింది. పెనాల్టీ షూటౌట్‌లో పోలాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌లో అడుగు పెట్టింది. మ్యాచ్ ఆద్యంతం రొనాల్డోను వెనక్కి నెడుతూ కుర్రాడు సాంచెజ్ తన అద్భుత ఆటతీరుతో ఆకట్టుకోగా... పోలాండ్ స్టార్ లెవెండోస్కీ గోల్ చేసినా నిరాశే మిగిలింది.
మార్సెల్లీ : గత ఐదు యూరోలలో నాలుగోసారి పోర్చుగల్ జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో పోర్చుగల్ 5-3 తేడాతో పోలాండ్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో షూటౌట్‌ను నిర్వహించారు. ఇందులో పోర్చుగల్ ఐదు సార్లూ సఫలం కాగా, పోలాండ్ ఆటగాడు బ్లాజికోస్కీ నాలుగో షాట్‌ను పోర్చుగల్ గోల్ కీపర్ పెట్రీసియో అడ్డుకున్నాడు. అంతకు ముందు నిర్ణీత సమయంలో పోలాండ్ తరఫువ లెవెండోస్కీ (2వ నిమిషం), పోర్చుగల్ తరఫున రెనాటో సాంచెజ్ (33వ నిమిషం) గోల్స్ సాధించారు.
మెరుపు ఆరంభం
పోలాండ్‌కు లెవెండోస్కీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. మ్యాచ్ 100వ సెకన్‌లోనే అతను గోల్ నమోదు చేశాడు. మిడ్‌ఫీల్డ్‌నుంచి ఇచ్చిన పాస్‌ను సోరెస్ సరిగా అందుకోలేకపోవడంతో బంతి గ్రాసికీ వైపు చేరింది. అతను కొట్టిన లో క్రాస్ షాట్‌ను లెవెండోస్కీ గోల్‌గా మలిచాడు. యూరో చరిత్రలో ఇది రెండో వేగవంతమైన గోల్ కావడం విశేషం. గత అక్టోబర్ తర్వాత ఈ స్టార్ ఆటగాడు తొలిసారి అంతర్జాతీయ గోల్ సాధించాడు. ఈ సమయంలో రొనాల్డో చురుగ్గా ఆడి రెండు సార్లు పోస్ట్‌పై దాడి చేశాడు. అయితే గోల్ సాధ్యం కాలేదు. 17వ నిమిషంలో లెవెండోస్కీ కొట్టిన మరో చక్కటి షాట్‌ను కీపర్ పెట్రీసియో అడ్డుకున్నాడు. 28వ నిమిషంలో రొనాల్డోను పాజ్దాన్ దురుసుగా అడ్డుకోవడంతో పోర్చుగల్ పెనాల్టీకి డిమాండ్ చేసింది. అయితే రిఫరీ దానిని తోసిపుచ్చాడు.
సూపర్ సాంచెజ్
టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన సాంచెజ్ మైదానంలో చెలరేగాడు. కుడి వైపునుంచి నాని ఇచ్చిన పాస్‌ను అందుకున్న అతను పోలాండ్ రక్షణ శ్రేణిని ఛేదించి దూసుకుపోయాడు. మెరుపు వేగంతో కొట్టిన షాట్‌ను క్రైచోవిక్, కీపర్ ఫాబియాన్‌స్కీ ఆపేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. పది నిమిషాల తర్వాత రొనాల్డో కొట్టిన షాట్ బయటి నెట్‌కు తగులుతూ వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా మరో రెండు సార్లు సునాయాస అవకాశాలు వచ్చినా రొనాల్డో సఫలం కాలేకపోయాడు. అదనపు సమయం 10వ నిమిషంలో పోలాండ్ ఆటగాడు మిలిక్ కూడా అవకాశం చేజార్చాడు. అదనపు సమయంలోనూ గోల్స్ రాకపోవడంతో... ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌ను ఆశ్రయించారు. ఇందులో పోలాండ్ ఆటగాడు బ్లాజికోస్కీ విఫలమయ్యాడు.
షూటౌట్ సాగిందిలా...
పోర్చుగల్ స్కోరు పోలాండ్
రొనాల్డో 1-1 లెవెండోస్కీ
సాంచెజ్ 2-2 మిలిక్
మౌటిన్హో 3-3 కామిల్ గ్లిక్
నాని 4-3 బ్లాజికోస్కీ
రికార్డో 5-3 -
ఫలితం తేలిపోవడంతో పోలాండ్
ఐదో షాట్‌ను తీసుకోలేదు