FIFA WC 2022: Must Read Top-5 Football Legends - Sakshi
Sakshi News home page

FIFA WC 2022: ఫిఫా వరల్డ్‌కప్‌.. దిగ్గజాలపై కన్ను వేయాల్సిందే

Published Sun, Nov 20 2022 8:28 AM | Last Updated on Mon, Nov 21 2022 3:42 PM

FIFA WC 2022: Must Read Top-5 Football Legends - Sakshi

మొత్తం 20 ప్రపంచకప్‌లు... విజేతలుగా నిలిచిన 8 జట్లు ... ఎందరో సూపర్‌ స్టార్లు తమ ఆటతో అభిమానులను ఉర్రూతలూగించారు. కార్లోస్‌ ఆల్బర్టో, రోజర్‌ మిల్లా, బాబీ చార్ల్‌టన్, థియరీ హెన్రీ, ప్లాటిని, జిదాన్, ఒలివర్‌ కాన్, క్లిన్స్‌మన్, లోథర్‌ మథియాస్, రుడ్‌ గలిట్, జొహన్‌ క్రఫ్‌... ఇలా ఎందరో మైదానంలో బంతితో విన్యాసాలు చేయించారు. కానీ కొందరు మాత్రం వీరందరికంటే కచ్చితంగా పై స్థానంలో ఉంటారు. తమదైన ప్రత్యేకతతో ఆటను శాసించిన వీరు, అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి టాప్‌–5 వరల్డ్‌ కప్‌ స్టార్స్‌ను చూస్తే...
- కరణం నారాయణ

పీలే (బ్రెజిల్‌) 
ఫుట్‌బాల్‌ పేరు చెప్పగానే అందరికంటే ముందుగా గుర్తొచ్చే ఆటగాళ్లలో పీలే పేరు ఉంటుంది. మూడుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌ పీలేనే కావడం విశేషం. 1958, 1962, 1970లలో బ్రెజిల్‌ ప్రపంచకప్‌ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించాడు. స్టార్‌ ఆటగాళ్లు ఉన్న జట్టులో 17 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌లో చెలరేగిన పీలే మరో 12 ఏళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తుకి తనే ఒక దిగ్గజంగా ఎదిగాడు. కెరీర్‌ మొత్తంలో నాలుగు ప్రపంచకప్‌లు ఆడిన పీలే మొత్తం 12 గోల్స్‌ సాధించాడు. 

డీగో మారడోనా (అర్జెంటీనా)
పీలేతో సంయుక్తంగా ‘ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ద సెంచరీ’గా నిలిచిన ఆటగాడు డీగో మారడోనా. దేశాలతో సంబంధం లేకుండా ఫుట్‌బాల్‌ అభిమానులందరి హృదయాలు గెల్చుకున్నాడు. 1986 ప్రపంచకప్‌ను అర్జెంటీనాకు సాధించి పెట్టడంతో అతను సూపర్‌స్టార్‌గా ఎదిగిపోయాడు. 1990లో కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కి చేర్చిన అతను 1994 వరల్డ్‌ కప్‌ సమయంలో డ్రగ్స్‌ వాడినట్లుగా తేలింది. నాలుగు ప్రపంచకప్‌లు ఆడి ఎనిమిది గోల్స్‌ చేసిన మారడోనా ఉజ్వల కెరీర్‌ ముగిసిన తర్వాత అనేక వివాదాలు చుట్టుముట్టినా... ప్లేయర్‌గా అవి అతని గొప్పతనాన్ని తగ్గించలేవు.

 

ఫ్రాంజ్‌ బెకన్‌బాయర్‌ (పశ్చిమ జర్మనీ)
జర్మనీ అందించిన ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడు. మూడు ప్రపంచకప్‌లు ఆడిన అతను తన శైలి, నాయకత్వ పటిమతో ‘ది ఎంపరర్‌’గా పేరు తెచ్చుకున్నాడు. కెప్టెన్‌గా, మేనేజర్‌గా రెండు సార్లు ప్రపంచకప్‌ను అందుకున్న ఇద్దరు ఆటగాళ్లలో బెకన్‌బాయర్‌ ఒకడు. 1974లో సొంతగడ్డపై కెప్టెన్‌ హోదాలో బెకన్‌బాయర్‌ తొలి మ్యాచ్‌ నుంచే జట్టును విజయ పథంలో నడిపించాడు. ఫైనల్లో జర్మనీ 2–1తో నెదర్లాండ్స్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించి చరిత్రలో నిలిచిపోయాడు. అనంతరం 1990లో బెకన్‌బాయర్‌ కోచ్‌గా ఉన్న పశ్చిమ జర్మనీ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 

గెర్డ్‌ ముల్లర్‌ (పశ్చిమ జర్మనీ)
‘ద నేషన్స్‌ బాంబర్‌’ అనే నిక్‌నేమ్‌ ఉన్న గెర్డ్‌ ముల్లర్‌ ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాళ్లలో ఒకడు. రెండు ప్రపంచకప్‌లలో (1970, 1974 ) 13 మ్యాచ్‌లలోనే మొత్తం 14 గోల్స్‌ కొట్టిన ముల్లర్‌ ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 1974లో సొంతగడ్డపై ప్రపంచకప్‌ ఫైనల్లో ముల్లర్‌ చేసిన గోల్‌తో జర్మనీ రెండోసారి విజేతగా నిలిచింది. కెరీర్‌ ఆసాంతం ముల్లర్‌ ‘ఫెయిర్‌ ప్లేయర్‌’గా గుర్తింపు పొందడం విశేషం. 

రొనాల్డో (బ్రెజిల్‌)


ఫుట్‌బాల్‌ను ప్రాణంగా ప్రేమించే బ్రెజిల్‌లో పీలే తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్లేయర్‌ రొనాల్డో లూయీ డి లిమా. మూడుసార్లు ‘ఫిఫా వరల్డ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’, రెండు సార్లు ‘గోల్డెన్‌ బాల్‌’ గెలుచుకోవడం మాత్రమే రొనాల్డో గొప్పతనం కాదు. పీలే రిటైర్మెంట్‌ తర్వాత 24 ఏళ్ల పాటు వరల్డ్‌ కప్‌ విజయానికి నోచుకోకుండా నిరాశగా కనిపించిన బ్రెజిల్‌ అభిమానులకు కొత్త ఊపిరి పోసింది అతనే అనడంలో అతిశయోక్తి లేదు. మొత్తంగా నాలుగు ప్రపంచకప్‌లు ఆడిన రొనాల్డో 15 గోల్స్‌ కొట్టి రెండోస్థానంతో కెరీర్‌ను ముగించాడు. 

చదవండి: FIFA: 1950లో బంగారం లాంటి అవకాశం వదిలేసిన భారత్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement