పోర్చుగల్ ఫెజ్ ఈసో | Euro Cup 2016: Portugal Victorious With 1-0 Win Against France | Sakshi
Sakshi News home page

పోర్చుగల్ ఫెజ్ ఈసో

Published Tue, Jul 12 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

పోర్చుగల్ ఫెజ్ ఈసో

పోర్చుగల్ ఫెజ్ ఈసో

95 సంవత్సరాలు... పోర్చుగల్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టి. ఈ ఆటంటే ఆ దేశానికి ‘పిచ్చి’. ఫుట్‌బాల్ ముందు ప్రాణాలు కూడా లెక్కలేవనేంత ‘ప్రేమ’. అంతర్జాతీయ యవనికపై అలుపెరగని పోరాటం చేసినా.. ఎంత కష్టపడినా... ఎంతమంది దిగ్గజాలు వచ్చినా ఏ ‘కప్’ కూడా అందలేదనే ఆవేదన. ఏ పెద్ద టోర్నీ జరిగినా దేశం ప్రతిసారీ ఊపిరిబిగబట్టి చూసింది. ఆ నిరీక్షణకు ఇంతకాలానికి తెరపడింది. ఆ ఆవేదన ఇన్ని సంవత్సరాలకు ఆనందభాష్పంగా మారింది. ఇంతకాలానికి ‘యూరో’కా అంటూ ఆ దేశం పొలికేక పెట్టింది. అవును... పోర్చుగల్ ఫెజ్ ఈసో... పోర్చుగల్ సాధించింది. తమ చరిత్రలో తొలిసారి యూరో ఫుట్‌బాల్ కోటలో జెండా పాతింది.
 
అంచనాలు తలకిందులయ్యాయి. అందలం ఎక్కుతుందని భావించిన ఆతిథ్య జట్టు ఫ్రాన్స్ తుది మెట్టుపై చతికిలపడింది. ఎవరూ ఊహించనిరీతిలో పోర్చుగల్ జట్టు తొలిసారి యూరో చాంపియన్‌గా అవతరించింది. సొంతగడ్డపై ఫేవరెట్ ఫ్రాన్స్‌ను బోల్తా కొట్టించిన పోర్చుగల్ ఎట్టకేలకు అంతర్జాతీయ టైటిల్ లోటును తీర్చుకుంది. 12 ఏళ్ల క్రితం అందినట్టే అంది చేజారిన యూరో ట్రోఫీని ఈసారి ఒడిసి పట్టుకుంది. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడినా... మిగతా ఆటగాళ్లు పట్టుదలతో పోరాడి పోర్చుగల్‌ను విజేతగా నిలిపారు. తమ సారథి రొనాల్డోకు చిరస్మరణీయ కానుకను ఇచ్చారు.
 
తొలిసారి యూరో టైటిల్  నెగ్గిన పోర్చుగల్

ఫైనల్లో ఫ్రాన్స్‌పై 1-0తో విజయం
అదనపు సమయంలో గోల్ చేసిన ఎడెర్
గాయంతో మధ్యలో వైదొలిగిన రొనాల్డో
ఆధిపత్యం చలాయించినా ఆతిథ్య జట్టుకు నిరాశే
పారిస్:
అతి కష్టమ్మీద లీగ్ దశను దాటిన పోర్చుగల్ ఆఖరికి యూరో చాంపియన్‌గా అవతరించి సంచలనం సృష్టించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ఫైనల్లో పోర్చుగల్ 1-0తో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టును ఓడించింది.

మ్యాచ్ 109వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఎడెర్ 25 అడుగుల దూరం నుంచి కళ్లు చెదిరేరీతిలో కుడి కాలితో సంధించిన శక్తివంతమైన కిక్ ఫ్రాన్స్ గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ లక్ష్యానికి చేరింది. ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత పోర్చుగల్ ఆటగాళ్లు మిగిలిన 11 నిమిషాల్లో ఫ్రాన్స్ జట్టుకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా నిలువరించి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. అంతకుముందు నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు ఖాతా తెరువడంలో విఫలమయ్యాయి. యూరో టోర్నమెంట్ చరిత్రలో ఓ ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో గోల్ కాకపోవడం ఇదే తొలిసారి.
 
గోడలా పాట్రిసియో, పెపె
రికార్డుస్థాయిలో మూడోసారి యూరో టైటిల్ సాధించాలని ఆశిస్తూ బరిలోకి దిగిన ఫ్రాన్స్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. అయితే ఫైనల్ చేరే క్రమంలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోని ఫ్రాన్స్‌కు అంతిమ సమరంలో మాత్రం చుక్కెదురైంది. పలుమార్లు ఫ్రాన్స్ జట్టుకు గోల్ చేసే అవకాశాలు వచ్చినా... పోర్చుగల్ గోల్‌కీపర్ రుయ్ పాట్రిసియో, డిఫెండర్ పెపె అడ్డుగోడలా నిలబడి ఫ్రాన్స్ ఆశలను నిర్వీర్యం చేశారు. మరోవైపు పోర్చుగల్ స్టార్ ఆటగాడు రొనాల్డోను కట్టడి చేయాలనే లక్ష్యంతో ఫ్రాన్స్ ఆటగాళ్లు కనిపించారు. ఈ క్రమంలో రొనాల్డోను పలుమార్లు మొరటుగా నిలువరించారు. తొమ్మిదో నిమిషంలో పాయెట్ ధాటికి రొనాల్డో మోకాలికి గాయమైంది. 25వ నిమిషంలో నొప్పికి తాళలేక మైదానంలో కూలబడి మిగిలిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. అంతకుముందు తొమ్మిదో నిమిషంలో గ్రిజ్‌మన్ కొట్టిన హెడర్ షాట్‌ను పోర్చుగల్ గోల్‌కీపర్ పాట్రిసియో అద్భుతంగా అడ్డుకున్నాడు.
 
సారథి కోసం సైనికుల్లా...
రొనాల్డో మైదానం వీడటంతో ఇక ఫ్రాన్స్ జట్టుకు ఎదురు ఉండదని భావించినా అలా జరగలేదు. తమ సారథి కోసం పోర్చుగల్ సహచరులు సైనికుల్లా పోరాడారు. 34వ నిమిషంలో సిసోకో కొట్టిన షాట్‌ను పోర్చుగల్ కీపర్ పాట్రిసియో సమర్థంగా నిలువరించాడు. ద్వితీయార్ధంలోనూ ఫ్రాన్స్ తమ ప్రయత్నాలను కొనసాగించింది. కానీ వారికి ఆశించిన ఫలితం దక్కలేదు. 79వ నిమిషంలో రెనాటో శాంచెస్ స్థానంలో ఎడెర్‌ను సబ్‌స్టిట్యూట్‌గా పోర్చుగల్ బరిలోకి దించింది. 80వ నిమిషంలో క్వారెస్మా కొట్టిన షాట్‌ను ఫ్రాన్స్ గోల్‌కీపర్ నిలువరించాడు. 84వ నిమిషంలో సిసోకో షాట్‌ను పాట్రిసియో మళ్లీ అడ్డుకున్నాడు.

ఇంజ్యూరీ సమయంలో ఫ్రాన్స్ ఆటగాడు గిగ్నాక్ కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ బార్‌కు తగిలి బయటకు వెళ్లింది. నిర్ణీత 90 నిమిషాలు పూర్తయ్యాక రెండు జట్లు గోల్ చేయకపోవడంతో 30 నిమిషాల అదనపు సమయాన్ని ఇచ్చారు. 15 నిమిషాల తొలి అర్ధభాగంలోనూ గోల్ నమోదు కాలేదు. అయితే రెండో అర్ధభాగంలో నాలుగు నిమిషాలు ముగిశాక ఎడెర్ సుదూరం నుంచి కొట్టిన షాట్ ఫ్రాన్స్ గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో పోర్చుగల్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఆ తర్వాత ఫ్రాన్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా స్కోరును సమం చేయడంలో విఫలమై ఓటమి భారాన్ని మూటగట్టుకుంది.
 
41 ఫ్రాన్స్ జట్టుపై పోర్చుగల్ 41 ఏళ్ల తర్వాత విజయం సాధించింది.
 
56 సొంతగడ్డపై జరిగిన ప్రధాన టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ ఓడిపోవడం 56 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
 
1 ఓ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఒక జట్టు లీగ్ దశలో మూడో స్థానంలో నిలిచి... టైటిల్ సాధించడం ఇదే తొలిసారి.
 
2 మైకేల్ ప్లాటిని (ఫ్రాన్స్-1984లో) తర్వాత ఒకే యూరో టోర్నీలో అత్యధికంగా ఆరు గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా గ్రిజ్‌మన్ (ఫ్రాన్స్) గుర్తింపు పొందాడు.

 
2 ఈ టోర్నీలో ఫ్రాన్స్ ప్లేయర్ గ్రిజ్‌మన్‌కు లభించిన అవార్డులు. అతనికి గోల్డెన్ బూట్ (టాప్ స్కోరర్-6 గోల్స్), గోల్డెన్ బాల్ (ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ) పురస్కారాలు దక్కాయి.
 
10 యూరో టైటిల్‌ను సాధించిన పదో జట్టు పోర్చుగల్. జర్మనీ, స్పెయిన్ మూడేసిసార్లు, ఫ్రాన్స్ రెండుసార్లు విజేతగా నిలిచాయి.  
 
సమష్టిగా సాధించారు...

యూరో కప్ సాధించిన అనంతరం స్వదేశం చేరిన పోర్చుగల్ జట్టుకు అభిమానులనుంచి భారీ ఎత్తున ఘన స్వాగతం ల భించింది. ఆటగాళ్లతో రాజధాని లిస్బన్‌కు వచ్చిన ప్రత్యేక విమానాన్ని రంగు రంగుల వాటర్ కెనాన్లతో ముంచెత్తారు. అనంతరం ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు జరిగింది. ఆ తర్వాత జట్టు సభ్యులు దేశాధ్యక్షుడు మార్సెల్ రెబెలో డిసౌజాను కలిశారు. ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ కమాండర్స్’ అవార్డుతో జట్టును సత్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
 
లీగ్ దశలో మూడు మ్యాచ్‌లూ డ్రా... అదృష్టం కొద్దీ అత్యుత్తమ మూడో స్థానపు జట్లలో నిలవడంతో నాకౌట్ అవకాశం ... టోర్నీ ఆరంభం సమయంలో ఎవరికీ అంచనాల్లేవు... అయినా పోర్చుగల్ సాధించి చూపించింది. ఫైనల్ సహా ఏడు మ్యాచ్‌లలో ఒక్క సారి మాత్రమే నిర్ణీత సమయంలో మ్యాచ్ గెలవగలిగినా, ఒకే యూరోలో మూడు సార్లు అదనపు సమయం ఆడిన తొలి జట్టుగా నిలిచినా... పోర్చుగల్ సాధించిన విజయం విలువ తక్కువేమీ కాదు.

‘మాకు గెలిచే అర్హత లేదని చాలా మంది చెప్పుకుంటే చెప్పుకోనీ. మేం మాత్రం సగర్వంగా తిరిగి వెళుతున్నాం. మేం పావురాల్లా సాధారణంగా కనిపించినా, పాముల్లా తెలివితేటలు ప్రదర్శించాం’ అని ఆ జట్టు కోచ్ ఫెర్నాండో సాంటోస్ చెప్పడం  ఎలాంటి స్థితినుంచి పోర్చుగల్ చాంపియన్‌గా నిలిచిందో సూచిస్తుంది. పోర్చుగల్ టీమ్ వన్ మ్యాన్ ఆర్మీ ఎంత మాత్రం కాదు... ఇన్నాళ్లూ రొనాల్డో ఒక్కడే అంతా అయి కనిపించిన ఆ జట్టు ఇప్పుడు సమష్టి తత్వంతో యూరో చాంపియన్‌గా నిలిచింది. అతను లేకుండా కూడా ఫైనల్లో సత్తా చాటి టైటిల్ సాధించగలగడమే మరో విశేషం. ఫ్రాన్స్‌ను వారి సొంతగడ్డపై 41 ఏళ్ల తర్వాత చిత్తు చేసి చాంపియన్‌గా నిలవడం అనేది అసాధారణం. ఈ విజయంలో జట్టులో ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. కెప్టెన్ రొనాల్డో నుంచి ఫైనల్ హీరో ఎడెర్ వరకు అంతా తమ పరిధిలో చెలరేగారు. వీరందరినీ నడిపించిన సాంటోస్ వ్యూహ చతురతా ఉంది.
 
కోచ్ మార్గదర్శనంలో...
చాలా మంది భావిస్తున్నట్లు ఇదేమీ అనుకోకుండా దక్కిన గెలుపు కాదు. ఐస్‌లాండ్, ఆస్ట్రియాలతో డ్రా తర్వాత హంగేరీ చేతిలో చిత్తుగా ఓడబోయి లక్కీగా డ్రా చేసుకోగలిగిన జట్టు ఇప్పుడు చాంపియన్‌గా నిలిచింది.  క్లిష్ట సమయంలో కోచ్ సాంటోస్ సమర్థంగా తన బాధ్యత నిర్వర్తించారు. ఆయన కోచ్‌గా వచ్చిన తర్వాత తొలి మ్యాచ్‌లోనే ఆల్బేనియా చేతిలో పోర్చుగల్ ఓడింది. అయితే ఆ తర్వాత 14 మ్యాచ్‌లలో జట్టుకు పరాజయం లేదు. ఫైనల్లో ఎడెర్‌ను అనూహ్యంగా మైదానంలోకి దించిన వ్యూహం అద్భుతంగా పని చేసింది. అన్నింటికి మించి ఇతర పెద్ద జట్లతో పోలిస్తే ఆటగాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా మంచి వాతావరణం ఉండేలా ఆయన చూశారు.
 
ఒకరిని మించి మరొకరు
టోర్నీలో సహజంగానే స్టార్ ప్లేయర్ రొనాల్డో ముద్ర కనిపించింది. అంతా అతని చుట్టే తిరిగినట్లు అనిపించినా ఇతర ఆటగాళ్ల ప్ర దర్శన కూడా జట్టును గెలిపించింది. పెపె అద్భుత డిఫెన్స్ జట్టు కు బలంగా మారింది. పోలండ్‌పై గోల్ చేసిన 18 ఏళ్ల కొత్త కుర్రా డు సాంచెజ్ మ్యాచ్‌ను పెనాల్టీల వైపు మళ్లించాడు. ఫైనల్లో గోల్ కీపర్ పాట్రిసియో రక్షణ గోడను ఛేదించడం ఫ్రాన్స్ వల్ల కాలేదు. ఇక ఒక్క గోల్‌తో ఎడెర్ హీరోగా మారిపోయాడు. ఇంతకు ముందు 28 మ్యాచ్‌లు ఆడినా కేవలం ఫ్రెండ్లీలలో 3 గోల్స్ చేసిన అతను జట్టులో అందరికంటే తక్కువ గుర్తింపు ఉన్న ఆటగాడు. కానీ ఫైనల్ ద్వారా ఇప్పుడు అతని స్థాయి పెరిగిపోవ డం ఖాయం. ఇక పోర్చుగల్ తదుపరి లక్ష్యం 2018 ప్రపంచకప్.
 
రూ. 189 కోట్లు
యూరో టైటిల్ సాధించిన పోర్చుగల్‌కు ప్రైజ్‌మనీ రూపంలో మొత్తం 2 కోట్ల 55 లక్షల యూరోలు (రూ. 189 కోట్లు) లభించాయి. రన్నరప్ ఫ్రాన్స్ జట్టుకు 2 కోట్ల 45 లక్షల యూరోలు (రూ. 181 కోట్లు) దక్కాయి.
- సాక్షి క్రీడావిభాగం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement