ప్రతిభకు పట్టాభిషేకం | Excellent national sports awards ceremony | Sakshi
Sakshi News home page

ప్రతిభకు పట్టాభిషేకం

Published Wed, Sep 26 2018 1:46 AM | Last Updated on Wed, Sep 26 2018 9:05 AM

Excellent national sports awards ceremony - Sakshi

న్యూఢిల్లీ: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న’ అవార్డును సగర్వంగా అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం కన్నులపండువగా జరిగిన ఈ వేడుకలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ క్రీడాపురస్కారాలు ప్రదానం చేశారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్‌ రత్న’ అవార్డును కోహ్లితో పాటు ప్రపంచ చాంపియన్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను కూడా అందుకుంది. ఈ అవార్డుల వేడుకకు కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ, మాతృమూర్తి సరోజ్‌ కోహ్లి, సోదరుడు వికాస్‌ హాజరయ్యారు. ‘ఖేల్‌ రత్న’ అందుకున్న మూడో క్రికెటర్‌ కోహ్లి. గతంలో సచిన్‌ టెండూల్కర్‌ (1997–98), ధోని (2007)లు ఈ అవార్డు అందుకున్నారు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న కోహ్లి గత కొన్నేళ్లుగా అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. 2016, 2017లలో కూడా ఖేల్‌రత్న నామినీల్లో ఉన్నప్పటికీ అప్పుడు దక్కని అవార్డు మూడో నామినేషన్‌తో లభించింది. ఐదేళ్ల క్రితం (2013) ‘అర్జున’ అందుకున్న కోహ్లికి గతేడాది ‘పద్మశ్రీ’ పురస్కారం దక్కింది.  

తెలంగాణకు చెందిన భారత మహిళల డబుల్స్‌ నంబర్‌వన్‌ షట్లర్‌ నేలకుర్తి సిక్కి రెడ్డి ‘అర్జున అవార్డు’ను అందుకుంది. ఆమె గత మూడేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో నిలకడగా విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు మేటి టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్లను తయారుచేసిన ఆచంట శ్రీనివాసరావు ద్రోణాచార్య అవార్డు పొందారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాసరావు చెన్నైలో స్థిరపడ్డారు. ‘ఖేల్‌ రత్న’ విజేతకు పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ. 7.5 లక్షలు... ‘అర్జున’ గ్రహీతలకు అర్జునుడి ప్రతిమతోపాటు రూ. 5 లక్షలు ప్రైజ్‌మనీ అందించారు. ఈ రెండు అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక ధ్యాన్‌చంద్, కోచ్‌లకు ద్రోణాచార్య, మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ ట్రోఫీ, రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్, టెన్సింగ్‌ నార్కే జాతీయ అడ్వెంచర్‌ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అందజేశారు.  జాతీయ అడ్వెంచర్‌ పురస్కారాల్లో భాగంగా టెన్సింగ్‌ నార్కే అవార్డును ఈసారి ఆరుగురు అమ్మాయిలకు అందజేశారు. భారత నావిక దళానికి చెందిన బొడ్డపాటి ఐశ్వర్య, పాతర్లపల్లి స్వాతి, పాయల్‌ గుప్తా, వర్తిక జోషి, విజయా దేవి, ప్రతిభ జమ్వాల్‌ ఈ అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఐశ్వర్య, వైజాగ్‌ అమ్మాయి స్వాతి తదితరులు లెఫ్టినెంట్‌ కమాండర్‌ వర్తిక జోషి నేతృత్వంలో ఐఎన్‌ఎస్‌వీ తరిణి నావలో 254 రోజుల్లో  ప్రపంచాన్ని చుట్టి వచ్చారు.   

ఈ ఏడాది ఇద్దరికి ఖేల్‌రత్న దక్కగా, 20 మంది అర్జునకు, ఎనిమిది మంది కోచ్‌లు ద్రోణాచార్య అవార్డులకు ఎంపికయ్యారు. జీవిత సాఫల్య పురస్కారమైన ధ్యాన్‌చంద్‌ అవార్డును నలుగురు మాజీ క్రీడాకారులు సత్యదేవ్‌ ప్రసాద్‌ (ఆర్చరీ), భరత్‌ కుమార్‌ చెత్రీ (హాకీ), బాబీ అలోసియస్‌ (అథ్లెటిక్స్‌), దత్తాత్రేయ చౌగలే (రెజ్లింగ్‌)లకు అందజేశారు. ప్రతీ ఏటా దివంగత హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి రోజైన ఆగస్టు 29న ఈ అవార్డులు అందజేసేవారు. ఈ సారి అదే సమయంలో ఆసియా క్రీడలు జరగడంతో వేడుక తేదీని మార్చాల్సి వచ్చింది. ఎప్పట్లాగే ఇప్పుడు కూడా అవార్డుల అంశం వివాదాస్పదమైంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా ‘ఖేల్‌రత్న’ విషయమై న్యాయపోరాటం చేస్తానన్నాడు. క్రీడలమంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌తో భేటీ అయ్యాక మెత్తబడ్డాడు. ఆర్చరీ కోచ్‌ జీవన్‌జ్యోత్‌ సింగ్‌ తేజను ద్రోణాచార్య జాబితా నుంచి తప్పించడంతో ఆయన కోచ్‌ పదవికి రాజీనామా చేశారు. గతంలో క్రమశిక్షణ రాహిత్యం వల్లే ఆయన్ని తప్పించినట్లు తెలిసింది.  

విజేతల వివరాలు 
అర్జున: సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్‌), నీరజ్‌ చోప్రా, జిన్సన్‌ జాన్సన్, హిమ దాస్‌ (అథ్లెటిక్స్‌), సతీశ్‌ (బాక్సింగ్‌), స్మృతి మంధాన (క్రికెట్‌), శుభాంకర్‌ శర్మ (గోల్ఫ్‌), మన్‌ప్రీత్‌ సింగ్, సవిత పూనియా (హాకీ), రవి రాథోడ్‌ (పోలో), రాహీ సర్నోబత్, అంకుర్‌ మిట్టల్, శ్రేయసి సింగ్‌ (షూటింగ్‌), మనిక బత్రా, సత్యన్‌ (టేబుల్‌ టెన్నిస్‌), రోహన్‌ బోపన్న (టెన్నిస్‌), సుమిత్‌ (రెజ్లింగ్‌), పూజ కడియాన్‌ (వుషు), అంకుర్‌ ధామ (పారా అథ్లెటిక్స్‌), మనోజ్‌ సర్కార్‌ (పారా బ్యాడ్మింటన్‌).  

ద్రోణాచార్య: సి.ఎ.కుట్టప్ప (బాక్సింగ్‌) విజయ్‌ శర్మ (వెయిట్‌లిఫ్టింగ్‌), ఆచంట శ్రీనివాస రావు (టేబుల్‌ టెన్నిస్‌), సుఖ్‌దేవ్‌ సింగ్‌ పన్ను (అథ్లెటిక్స్‌), క్లారెన్స్‌ లోబో (హాకీ), తారక్‌ సిన్హా (క్రికెట్‌), జీవన్‌ కుమార్‌ (జూడో), వి.ఆర్‌.బీడు (అథ్లెటిక్స్‌).   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement