
ముంబై: ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీకి మరికొంత కాలం పొడిగింపు లభించింది. బీసీసీఐ తదుపరి వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగే వరకు కమిటీ కొనసాగుతుంది. బోర్డు నిబంధనల ప్రకారం ఏజీఎం సమయంలోనే కమిటీలో మార్పు జరుగుతుంది. అయితే ప్రస్తుతం పరిపాలకుల కమిటీ (సీఓఏ) పర్యవేక్షణలో బోర్డు వ్యవహారాలు కొనసాగుతుండటంతో తర్వాతి ఏజీఎం ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై స్పష్టత లేదు. కాబట్టి అప్పటి వరకు సెలక్షన్ కమిటీని మార్చే అవకాశం లేదు. ఈ కమిటీలో ప్రసాద్‌తో పాటు దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్ సభ్యులుగా ఉన్నారు.
డిసెంబర్ 1న బీసీసీఐ ఎస్‌జీఎం
బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) డిసెంబర్ 1న జరగనుంది. రాబోయే ఐదేళ్ల (2019–2023) కాలంలో భారత జట్టు పర్యటనలకు సంబంధించిన అంశాలతో పాటు మరో మూడు అంశాలు ప్రధానంగా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. కేరళకు చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ వివాదం పరిష్కారంతో పాటు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌కు మళ్లీ గుర్తింపు ఇవ్వడం, టెస్ట్ చాంపియన్‌షిప్, వన్డే లీగ్స్ నిర్వహణపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment