
డుప్లెసిస్ ‘తీపి’ సెంచరీ!
దక్షిణాఫ్రికా 259/9 డిక్లేర్డ్ ఆస్ట్రేలియాతో చివరి టెస్టు
అడిలైడ్: వారం రోజులుగా వెంటాడుతున్న వివా దం... బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో జరిమా నా... తాను తప్పు చేయలేదని మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సి రావడం... ఇలాంటి స్థితిలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మూడో టెస్టులో బరిలోకి దిగాడు. బ్యాటింగ్‌కు వస్తుంటే మైదానం అన్ని వైపులనుంచి ఎగతాళి చేస్తున్న ప్రేక్షకులు... ఇవేవీ డు ప్లెసిస్ స్థైర్యాన్ని, ఏకాగ్రతను దెబ్బ తీయలేకపోయారుు. సహచరులంతా విఫలమైన చోట ఒక్కడే నిలబడి ముందుండి నడిపించాడు. చివరకు అద్భుత శతకం సాధించి అంతకు ముందు వెక్కిరించిన ప్రేక్షకులే నిలబడి చప్పట్లతో అభినందించేలా చేశాడు.
ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన మూడో టెస్టు (డే అండ్ నైట్)లో దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 259 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. డు ప్లెసిస్ (164 బంతుల్లో 118 నాటౌట్; 17 ఫోర్లు) కెరీర్‌లో ఆరో సెంచరీ సాధించగా, స్టీఫెన్ కుక్ (40) పర్వాలేదనిపించాడు. 44/3 స్కోరు వద్ద క్రీజ్‌లోకి వచ్చిన ప్లెసిస్ కీలక భాగస్వామ్యాలతో జట్టు ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టగా, స్టార్క్, బర్డ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 12 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది.
‘ఇది నా అత్యుత్తమ ఇన్నింగ్స్ . ఈ రోజు ఆట పట్ల గర్వంగా ఉన్నాను. ఇలాంటి సమయంలో కెప్టెన్‌గా ముందుండి నడిపించడం గొప్పగా అనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ ఇంతగా ఒక ఘటన నాలో స్ఫూర్తిని పెంచలేదు. ప్రేక్షకులు నన్ను ఆటపట్టిస్తారని ముందే ఊహిం చాను’ - డు ప్లెసిస్