విరాట్ కోహ్లి, అజింక్యా రహానే (ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అద్భుతంగా రాణించిన అజింక్యా రహానేపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటి వరకు ఓపెనర్‌గానే రాణించిన రహానే తాజా మ్యాచ్‌తో నాలుగో స్థానంలో కూడా రాణించగలనని నిరూపించుకున్నాడు. కోహ్లి సెంచరీకి తోడు రహానే(79) తోడవ్వడంతో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా రహానేను ఈ స్థానానికే పరిమితం చేయమని కెప్టెన్ విరాట్ కోహ్లిని విజ్ఞప్తి చేస్తున్నారు.
2019-ప్రపంచకప్ దృష్టిలో ఉంచుకొని ఈ సిరీస్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను పరీక్షించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది. జట్టులో నలుగురు ఓపెనర్లు ధావన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, అజింక్యా రహానేలుండటంతో తుది జట్టు ఎంపిక కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలకు తల నొప్పిగా మారింది. మిడిలార్డర్ బలంగా ఉండాలంటే నాలుగోస్థానం కీలకం. ఈ నేపథ్యంలో ఇప్పటికే గత సిరీస్‌ల్లో కొంతమంది ప్లేయర్లను పరీక్షించి చేతులు కాల్చుకుంది. గురువారం జరిగిన తొలి వన్డేతో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. చివరి టెస్టులో రాణించిన రహానే మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడటం, కెప్టెన్ కోహ్లితో 189 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పడంతో ఈస్థానానికి రహానే కరెక్ట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులు వ్యక్త పరుస్తున్నారు. ‘రహానేకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.. నాలుగో స్థానానికి అతనే కరెక్ట్.’ అని ఒకరంటే.. మిడిలార్డర్ బలంగా ఉండాలంటే నాలుగోస్థానంలో రహానేనే కొనసాగించాలని మరొకరు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment