middle order
-
కేఎల్ రాహుల్ హిట్టయ్యాడు కానీ సమస్య అక్కడే..
టీమిండియా వైస్‌కెప్టెన్ కేఎల్ రాహుల్ మిడిలార్డర్లో మరోసారి సత్తా చాటాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో ఓపెనింగ్ స్లాట్‌లో కాకుండా నాలుగో స్థానంలో వచ్చిన రాహుల్ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్‌తో సమన్వయ లోపంతో అనవసర రనౌట్ తప్పించి బ్యాట్స్‌మన్‌గా మాత్రం రాహుల్ సక్సెస్ అయినట్లే. ముఖ్యంగా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన తర్వాత సూర్యకుమార్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. చదవండి: Surya Kumar Yadav: వన్డే క్రికెట్ చరిత్రలో ఆ రికార్డు సాధించిన ఒకే ఒక్కడు 48 బంతుల్లో 49 పరుగులు చేసిన రాహుల్ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. దీంతో ఇకపై పరిమిత క్రికెట్లో రాహుల్ మిడిలార్డర్లో ఆడే అవకాశాలు ఎక్కువయ్యాయి. శ్రేయాస్ అయ్యర్‌కు మిడిలార్డర్లో అవకాశాలు ఇచ్చినప్పటికి సౌతాఫ్రికా సిరీస్‌లో వరుసగా విఫలమయ్యాడు. వెంకటేశ్ అయ్యర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక ఇవాళ మ్యాచ్‌లో అర్థ సెంచరీతో రాణించిన సూర్యకుమార్ ఐదో స్థానానికి.. కేఎల్ రాహుల్ నాలుగో స్థానానికి ఫిక్స్ అయినట్లే. ►మొత్తం 40 వన్డేలు ఆడిన రాహుల్ ఓపెనర్‌గా 21 మ్యాచ్‌ల్లో 884 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు.. 6 అర్థసెంచరీలు ఉన్నాయి. ►ఇక ఐదో స్థానంలో 10 మ్యాచ్‌లాడి 453పరుగులు చేసిన రాహుల్‌కు ఒక సెంచరీతో పాటు నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి. ►నాలుగో స్థానంలో విండీస్‌తో మ్యాచ్ కలుపుకొని ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో 160 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండడం విశేషం. ►ఇక మూడో స్థానంలో మూడు మ్యాచ్‌ల్లో 47 పరుగులు, ఆరో స్థానంలో ఒక మ్యాచ్ ఆడి 11 పరుగులు చేశాడు. చదవండి: Rishabh Pant: కాపీ కొట్టడానికి సిగ్గుండాలి.. పంత్‌పై ట్రోల్స్ వర్షం ఒక రకంగా రాహుల్ ఓపెనర్ నుంచి మిడిలార్డర్‌కు మారడం వల్ల ఓపెనింగ్ స్లాట్‌లో కొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పటికైతే శిఖర్ ధావన్ రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేసేందుకు సమస్య లేదు. ఒకవేళ ఈ ఇద్దరిలో ఎవరు గాయపడితే.. మయాంక్ అగర్వాల్, ఇషాన్ కిషన్ల మధ్య పోటీ నెలకొంటుంది. దీనికి తోడూ రుతురాజ్ కూడా పోటీలో ఉన్నాడు. అయితే విండీస్‌తో రెండో వన్డేకు ఇషాన్ అందుబాటులో ఉన్నప్పటికి రోహిత్ జట్టులోకి తీసుకోలేదు. రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసినప్పటికి ఆ ప్లాన్ బెడిసికొట్టింది. పంత్ 34 బంతులాడి 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంత్ ఓపెనర్‌గా విఫలం కావడంతో తర్వాతి మ్యాచ్‌లో తన స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉండొచ్చు. అయితే పంత్‌ను ఓపెనర్‌గా ఒకే మ్యాచ్‌కు పరిమితం చేయకుండా మరికొన్ని మ్యాచ్‌ల్లో ఆడేందుకు అవకాశముండొచ్చు. ప్రస్తుతానికి ధావన్ మూడో వన్డేకు అందుబాటులోకి వస్తే.. ఇషాన్ కిషన్ మరోసారి డ్రెస్సింగ్‌రూమ్‌కు పరిమితం కావాల్సిందే. చదవండి: KL Rahul: సూర్య తప్పు లేదు.. ఎందుకు ఆగావో తెలీదు; అనవసర రనౌట్ -
టీమిండియాకు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కావాలి.. నాకు ఛాన్స్ ఇవ్వండి
లండన్: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన మనసులో మాటని బయటపెట్టాడు. రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో కనీసం ఒక్కసారైనా భారత్ తరఫున ఆడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తనకి మరో ఛాన్స్ ఇవ్వాలని భారత సెలెక్టర్లని అభ్యర్థించాడు. టీమిండియాకు టీ20ల్లో సరైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లేడని, జట్టు నిండా టాపార్డర్ బ్యాట్స్‌మెనే ఉన్నారని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా మినహా మిడిల్ ఆర్డర్లో సరైన బ్యాట్స్‌మన్ లేడని, అందుకే తనకు ఛాన్స్ ఇవ్వాలని సెలక్టర్లను కోరాడు. తనకింకా ఆటపై మక్కువ తగ్గలేదని, 2019 వన్డే ప్రపంచకప్‌లో విఫలమవ్వడం వల్లే తనని టీ20 జట్టు నుంచి తప్పించారని తెలిపాడు. కాగా, ఇటీవలే ముగిసిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ద్వారా వ్యాఖ్యాతగా కొత్త అవతారమెత్తిన డీకే.. భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కి కూడా కామెంట్రీ చెప్పనున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను ఫిట్‌గా ఉన్నంతకాలం క్రికెట్ ఆడాలనుకుంటున్నానని, రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో భారత్ తరఫున ఒక్కసారైనా ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నానని, ఒక్క ఛాన్స్ ఇస్తే తానేంటో నిరూపించుకుంటానని తెలిపాడు. కాగా, 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన డీకే.. అప్పటి నుంచి టీమిండియాకి దూరంగా ఉన్నాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా మారడంతో.. ఇక కార్తీక్ పనైపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో డీకే తన మనసులో మాట బయటపెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కాగా, డీకే ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకుండానే వ్యాఖ్యాతగా మారి జెంటిల్మెన్ గేమ్‌లో కొత్త ఒరవడి సృష్టించాలని డీకే భావిస్తున్నాడు. -
ఖాళీ ఉన్నా... ఆడే అవకాశం ఇవ్వలేదు
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు మిడిల్ ఆర్డర్లో ఖాళీ ఉన్నా... తనకు అవకాశం ఇవ్వలేదంటూ భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అతడు తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వివరించాడు. ‘2011–2012లో మేము ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాం. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత మిడిల్ ఆర్డర్ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయింది. అంతేకాకుండా మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్‌మన్‌కు ఒక ఖాళీ కూడా ఉంది. టీమ్ మేనేజ్మెంట్ నాకు అవకాశం ఇవ్వాలని భావించి ఉంటే తప్పకుండా ఇచ్చేది. కానీ వారు అలా భావించలేదు’ అని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా సెంచరీతో జట్టును గెలిపించే ప్రదర్శన చేశాక ఎవరికైనా సరే జట్టులో తన స్థానం సుస్థిరం అనే అనిపిస్తుందని... అయితే తనకు మాత్రం ఆ విధంగా జరగలేదని... తర్వాత తనను ఏకంగా 14 మ్యాచ్‌లపాటు బెంచ్‌కే పరిమితం చేయడం షాక్‌కు గురిచేసిందని వాపోయాడు. ఆసీస్ పర్యటన కంటే ముందు వెస్టిండీస్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడింది. అందులో భాగంగా జరిగిన ఐదో వన్డేలో మనోజ్ తివారి శతకం (104) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 34 పరుగుల తేడాతో గెలుపొందింది.(ఆరోజు సచిన్ నక్కతోకను తొక్కాడు : నెహ్రా) మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని మాత్రం మనోజ్ ప్రశంసలతో ముంచెత్తాడు. 2011 ప్రపంచ కప్‌ను భారత చేజిక్కించుకోవడంలో గంగూలీ పాత్ర కూడా ఉందన్నాడు. గంగూలీ నాయకుడిగా ఉన్నప్పుడే ప్రపంచ కప్‌ను గెలిచేలా యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, హర్భజన్ సింగ్‌లతో కూడిన జట్టును తయారు చేశాడన్నాడు. వారిని 2011 ప్రపంచ కప్‌లో అప్పటి సారథి ధోని సమర్థంగా ఉపయోగించుకున్నాడని పేర్కొన్నాడు. భారత్ తరఫున 12 వన్డేలు ఆడిన మనోజ్ తివారి 287 పరుగులు చేశాడు. -
నాలుగో స్థానానికి అయ్యరే సరైనోడు
న్యూఢిల్లీ: భారత మిడిలార్డర్లో సమస్యగా మారిన నాలుగో స్థానానికి శ్రేయస్ అయ్యర్ సరిగ్గా సరిపోతాడని భారత దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. రిషభ్ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడించడం కంటే అయ్యర్‌ని ఆడిస్తేనే జట్టుకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఆయన విశ్లేషించారు. జట్టు మేనేజ్మెంట్ నాలుగో స్థానాన్ని శాశ్వతంగా ఆయ్యర్కు కేటాయించాలని గావస్కర్ సూచించారు. ‘ నా దృష్టిలో పంత్ ధోనిలా ఫినిషర్... అతనికి ఐదు లేదా ఆరో స్థానాన్ని కేటాయిస్తే మంచిది. కానీ అయ్యర్ అలా కాదు ఇన్నింగ్స్‌ను నిర్మించగలడు. అందుకోసం అయ్యర్‌కు... భారత్‌ను చాలా కాలం నుంచి వేధిస్తోన్న నాలుగో స్థానాన్ని కేటాయిస్తే మంచిది’ అని గావస్కర్ అభిప్రాయపడ్డారు. -
‘నాలుగు’ నాకు కొత్త కాదు!
సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం వల్ల తనపై ఎలాంటి ఒత్తిడీ లేదని భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు అన్నాడు. నాలుగో స్థానంలో ఆడటం తనకు అలవాటేనని అతను చెప్పాడు. ‘చాలా కాలంగా నేను నాలుగో స్థానంలో ఆడుతున్నాను. టీమ్ మేనేజ్మెంట్ ఆ స్థానంలో ఆడమని చెప్పడంలో కొత్తేమీ లేదు. నేను నాలుగో స్థానానికి సరైన వాడినంటూ కెప్టెన్ కోహ్లి చేసిన వ్యాఖ్య వల్ల ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదు. అదేమీ అదనపు బాధ్యత కాదు. నిజాయితీగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ సిరీస్‌పైనే దృష్టి పెట్టాను. అంతకుమించి ఇంకేమీ ఆలోచించడం లేదు’ అని రాయుడు స్పష్టం చేశాడు. ఆసియా కప్‌లో రాణించిన రాయుడు, అంతకుముందు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైనా...యో యో టెస్టులో విఫలం కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే నిర్దేశిత ఫిట్నెస్ ప్రమాణాలకు తానేమీ వ్యతిరేకం కాదని అతను వెల్లడించాడు. ‘నేను యో యో టెస్టులో ఉత్తీర్ణత సాధించడం సంతోషమే. అయితే ఈ టెస్టుకు, నా ఫిట్నెస్ సన్నద్ధతకు ఎలాంటి సంబంధం లేదు. ఒకసారి గాయపడిన తర్వాత ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాను. సిరీస్‌ల మధ్యలో దొరికే కొద్దిపాటి విరామంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు వెళ్లి ఫిట్నెస్ను మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తుంటాను. నిజానికి ఐపీఎల్‌కు ముందే దీనిపై శ్రమించాను. ఫిట్నెస్పరంగా చూస్తే పునరాగమనం చేసేందుకు నాకు ఐపీఎల్ మంచి అవకాశం ఇచ్చింది’ అని రాయుడు పేర్కొన్నాడు. మరోవైపు మున్ముందు ఎలాంటి సవాల్‌కైనా మిడిలార్డర్ సిద్ధంగా ఉండాలని రాయుడు అన్నాడు. ‘భారత టాప్–3 అద్భుతంగా రాణిస్తుండటం గొప్ప విషయం. తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ కూడా ఎప్పుడు ఏ సవాల్ ఎదురైనా బాగా బ్యాటింగ్ చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. నాకు తెలిసి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జట్టులో పరిస్థితి ఏమిటో అందరికీ బాగా తెలుసు. సిరీస్‌లో ఒక్కటే మ్యాచ్ ముగిసింది. తర్వాతి మ్యాచ్‌లలో విండీస్ గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నా’ అని రాయుడు అభిప్రాయపడ్డాడు. -
సమాధానం లభించలేదు
ఓపెనర్‌గా, మూడో స్థానంలో అంబటి రాయుడు రెండు అర్ధ సెంచరీలు చేశాడు. కానీ ఆ రెండు స్థానాల్లో మున్ముందు అతనికి అవకాశమే లేదు. మూడు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన దినేశ్ కార్తీక్ ఐదు ఇన్నింగ్స్‌లలో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేదు. సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నా, కేదార్ జాదవ్ బ్యాటింగ్ సత్తా బయట పడనే లేదు. అతిథి పాత్రలో రాహుల్ ఒకే మ్యాచ్‌కు పరిమితం కాగా, మనీశ్ పాండే వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా వృథా చేసుకున్నాడు. ఆసియా కప్‌లో అజేయ ప్రదర్శనతో చాంపియన్‌గా నిలవడంతో సమష్టి పాత్ర కనిపిస్తున్నా... టోర్నీకి ముందు తీవ్రంగా చర్చ జరిగిన మిడిలార్డర్ సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. ముఖ్యంగా నాలుగు, ఆరు స్థానాల్లో ఎవరు ఆడతారనే దానిపై స్పష్టత రాలేదు. సాక్షి క్రీడా విభాగం:‘జట్టులో కొందరు ఆటగాళ్లు నాలుగు, ఆరు స్థానాల్లో తమ చోటును ఖాయం చేసుకున్నారని చెప్పడం చాలా తొందరపాటు అవుతుంది. రాబోయే మరికొన్ని టోర్నమెంట్లలో వారి ప్రదర్శన తర్వాతే ఆయా ఆటగాళ్లు ఏమాత్రం పనికొస్తారని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయిస్తుంది’ అని ఆసియా కప్ ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య తాజా పరిస్థితిని సూచిస్తోంది. టోర్నీ ఆరంభానికి ముందు నాలుగు, ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయని, దాని కోసం పోటీ పడుతున్న బ్యాట్స్‌మెన్‌పై అనూహ్యంగా వేటు వేయకుండా వీలైనన్ని అవకాశాలు కల్పిస్తానని చెప్పిన తాత్కాలిక కెప్టెన్ తన మాట నిలబెట్టుకున్నాడు. అయితే తుది ఫలితం మాత్రం అతను అనుకున్న విధంగా రాలేదని అర్థమవుతోంది. కీలక మ్యాచ్‌లలో భారత టాప్–3 (కోహ్లి వచ్చాక) విఫలమైతే పరిస్థితి ఏమిటనే దానికి మాత్రం పరిష్కారం ఆసియా కప్‌లోనూ లభించలేదు. బంగ్లాదేశ్‌తో ఫైనల్లో 223 పరుగులను అందుకునేందుకు మన జట్టు తడబడ్డ తీరు ప్రపంచకప్ దిశగా సన్నద్ధమవుతున్న సమయంలో హెచ్చరికలాంటిదే. గెలిపించేదెవరు? రోహిత్, ధావన్, కోహ్లి సమష్టిగా విఫలమైతే భారత జట్టు పరిస్థితి ఏమిటనేదానికి అతి పెద్ద ఉదాహరణ గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. ఆ మ్యాచ్‌లో ఈ ముగ్గురు 0, 21, 5 పరుగులు చేశారు. జట్టు చిత్తుగా ఓడి పాక్‌కు ట్రోఫీ అప్పగించింది. అది అరుదైన సందర్భమే కావచ్చు కానీ నాటి నుంచి కూడా మన మిడిలార్డర్ తడబాటు జట్టుకు సమస్యగానే మారింది. నాలుగు నుంచి ఏడు స్థానాల వరకు ఫలానా ఆటగాడు బలంగా నిలబడిన గెలిపించగలడు అని ఎవరినీ నమ్మలేని స్థితి. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన న్యూజిలాండ్ సిరీస్ నుంచి గణాంకాలు చూస్తే మన మిడిలార్డర్ (ఆటగాళ్లు మారినా) పరుగుల స్కోరింగ్ రేటు 4.82 మాత్రమే. ప్రపంచ కప్ ఆడబోతున్న మొత్తం పది జట్లలో మనకంటే అధ్వాన్నంగా (4.66) అఫ్గానిస్తాన్ మాత్రమే ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది! ఆసియా కప్ వరకు చూస్తే మన అంబటి రాయుడు అందరికంటే కాస్త మెరుగ్గా కనిపించాడు. హాంకాంగ్, అఫ్గానిస్తాన్‌లపై అతను అర్ధ సెంచరీలు చేశాడు. ఫైనల్లో మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దినేశ్ కార్తీక్ వరుసగా చేసిన స్కోర్లు 33, 31 నాటౌట్, 1 నాటౌట్, 44, 37 అతనిపై నమ్మకం పెంచలేకపోతున్నాయి. నిదాహస్ ట్రోఫీ ఫైనల్లో సిక్సర్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌కు మళ్లీ ఊపిరి పోసిన కార్తీక్ ఆ తర్వాత ఒక్క కీలక ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ఇంగ్లండ్‌లో వైఫల్యంతో టెస్టుల్లో తన స్థానాన్ని పంత్‌కు చేజార్చుకున్న అతని వన్డే కెరీర్ కూడా ఇప్పుడు ఇబ్బందికరంగానే కనిపిస్తోంది. ఏదోలా ఫైనల్‌ను జాదవ్ ముగించగలిగినా, అతని ఫిట్నెస్ కొత్త సమస్యను ముందుకు తెచ్చింది. ఐపీఎల్లో గాయపడిన తర్వాత సుదీర్ఘ సమయం ఎన్సీఏలో గడిపి ఫిట్‌గా తిరిగొచ్చిన అతను మళ్లీ కండరాల నొప్పితో ఇబ్బంది పడటం ఫిజియో పనితీరుపై కూడా సందేహాలు రేకెత్తిస్తోంది. ఫైనల్ ముగిసిన తర్వాత తాను ప్రధానంగా బ్యాట్స్‌మన్‌ను అని స్వయంగా చెప్పుకున్న జాదవ్ ప్రస్తుతం ప్రత్యేక శైలి బౌలర్‌గానే జట్టులో ఉన్నట్లు కనిపిస్తోంది తప్ప బ్యాట్స్‌మన్‌లా కాదు. ధోని పరిస్థితి ఏమిటి? ఆసియా కప్‌కు ముందే ఐదో స్థానం గురించి రోహిత్ స్పష్టత ఇచ్చేశాడు. అది ధోని కోసమేనని అర్థమైపోయింది. కానీ ఈ టోర్నీలో ధోని ఆట చూస్తే అతని వీరాభిమానులు కూడా ‘సమయం వచ్చేసింది’ అని భావిస్తున్నట్లుగా అనిపించింది. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 77 పరుగులే చేశాడు. ప్రతీ పరుగు కోసం ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో ఫైనల్లో మరోసారి కనిపించింది. కేవలం 62.09 స్ట్రైక్ రేట్ ఉండటం, 124 బంతులు ఆడితే మొత్తంగా 6 ఫోర్లు తప్ప ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం ధోని స్థాయి మాత్రం కాదు. కచ్చితంగా ప్రపంచ కప్ వరకు ఉంటాడని అందరూ భావిస్తున్న తరుణంలో 327 వన్డేల అనుభవజ్ఞుడు మిడిలార్డర్లో ఇలా ఆడితే కష్టమే. ఇక అన్ని ఫార్మాట్లకు తగిన విధంగా అద్భుతమైన ఆట ఉన్నా కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్లో మాత్రం ఆడించలేమని ఈ టోర్నీ ద్వారా మేనేజ్మెంట్ తేల్చేసినట్లుంది. అందుకే ఒక్కసారి కూడా మిడిల్లో ఆడించే ప్రయత్నం చేయలేదు. ఇతర ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా అతను 60 పరుగులు చేసినా అవి అతనికి ఎలాగూ టాప్–3లో అవకాశం కల్పించలేవు. మనీశ్ పాండే వ్యథ మరో రకం. దేశవాళీ అద్భుత ప్రదర్శనతో జట్టులోకి రావడం, ఆపై సుదీర్ఘ కాలం బెంచ్‌పై ఉండటం, ఏదో పుష్కరానికి ఒకసారి మ్యాచ్ దక్కితే పరిస్థితులను అర్థం చేసుకునేలోపే లేదంటే ఒత్తిడిలో ఔట్ కావడం రొటీన్‌గా మారింది. నిజానికి పై అందరికంటే అసలైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా పాండేకే ఎక్కువ గుర్తింపు ఉంది. తన కెరీర్ 18 ఇన్నింగ్స్‌లలో అతను 4, 5, 6 స్థానాల్లోనే ఆడాడు. కానీ అతనికి వరుసగా అవకాశాలు మాత్రం దక్కడం లేదు. కొత్తగా ప్రయత్నిస్తారా... నిజాయితీగా చెప్పాలంటే ఆసియా కప్‌ను మన బౌలర్లు గెలిపించారు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు దాదాపు ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థికి భారీ స్కోరుకు అవకాశం లేకుండా చేశారు. అందు వల్లే బ్యాట్స్‌మెన్ పని కొంత సులువుగా మారింది. ప్రతీ సారి టాప్–3నే మ్యాచ్‌లు గెలిపించడం సాధ్యం కాదు కాబట్టి వీలైనంత తొందరగా మిడిలార్డర్ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాల్సిందే. ఇప్పటి వరకు ప్రస్తావించిన పేర్లే కాకుండా మరోసారి అజింక్య రహానే కూడా పోటీలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. దూకుడు తక్కువ కాబట్టి వన్డేలకు పనికి రాడంటూ ప్రస్తుతానికి అతడిని సెలక్టర్లు పక్కన పెట్టేశారు. కానీ ఇంగ్లండ్ పిచ్‌లపై మిడిలార్డర్లో ఇన్నింగ్స్‌ను నడిపించాలంటే సాంకేతికంగా బలమైన బ్యాట్స్‌మన్ అవసరం. అది రహానేలో ఉంది. నిజంగా సెలక్టర్లు ఆ దిశగా ఆలోచిస్తే వచ్చే సిరీస్‌నుంచే అతడిని ఎంపిక చేసి వరుసగా ఆడించాలి. వీరందరినీ కాదని దేశవాళీలో మెరుగ్గా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్‌లాంటి వారిని కూడా ప్రయత్నిస్తారా అనేది రాబోయే వెస్టిండీస్ సిరీస్‌లో కొంత వరకు తేలుతుంది. దినేశ్ కార్తీక్ స్థానంలో రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా ఆడగల సత్తా రిషభ్ పంత్‌లో కూడా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచినా మిడిలార్డర్ సమస్య మాత్రం అలాగే ఉండిపోయిందనేది వాస్తవం. నేనూ ధోనిలాంటివాడినే: రోహిత్ శర్మ దుబాయ్: తొలిసారి వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన టోర్నీలోనే రోహిత్ శర్మ భారత జట్టుకు టైటిల్ అందించాడు. ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన అనంతరం అతను మాట్లాడుతూ మైదానంలో ప్రశాంతంగా వ్యవహరించే విషయంలో తాను ధోనినే అనుకరిస్తున్నట్లు చెప్పాడు. ‘కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురి కాకుండా కొంత సమయం తీసుకోవడం ఇన్నేళ్లుగా నేను ధోనిలో చూశాను. నాలో కూడా అవే లక్షణాలు ఉన్నాయి. నేను కూడా ముందుగా ఆలోచించి ఆ తర్వాతే స్పందిస్తాను. వన్డేల్లో అలాంటి అవకాశం కూడా ఉంటుంది. అతని నాయకత్వంలో చాలా కాలం ఆడాను.నాకు ఎప్పుడు సలహాలు, సహకారం కావాలన్నా అందించేందుకు అతను ఎప్పుడూ ముందుంటాడు’ అని రోహిత్ వెల్లడించాడు. మరోవైపు భవిష్యత్తులో ఎప్పుడూ మళ్లీ కెప్టెన్సీ అవకాశం దక్కినా ఆ బాధ్యతను నిర్వర్తించేందుకు తాను సిద్ధమని రోహిత్ స్పష్టం చేశాడు. ‘కచ్చితంగా. ఇప్పుడే మేం విజయం సాధించాం. ఇకపై కూడా ఎప్పుడు కెప్టెన్సీ అవకాశం లభించినా నేను రెడీ’ అని అతను వెల్లడించాడు.కొన్నాళ్ల క్రితమే రోహిత్ నాయకత్వంలో భారత్ టి20 టోర్నీ నిదాహస్ ట్రోఫీ కూడా గెలుచుకుంది. -
కోహ్లి.. నెం.4 దొరికేశాడు.!
సాక్షి, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అద్భుతంగా రాణించిన అజింక్యా రహానేపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటి వరకు ఓపెనర్‌గానే రాణించిన రహానే తాజా మ్యాచ్‌తో నాలుగో స్థానంలో కూడా రాణించగలనని నిరూపించుకున్నాడు. కోహ్లి సెంచరీకి తోడు రహానే(79) తోడవ్వడంతో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా రహానేను ఈ స్థానానికే పరిమితం చేయమని కెప్టెన్ విరాట్ కోహ్లిని విజ్ఞప్తి చేస్తున్నారు. 2019-ప్రపంచకప్ దృష్టిలో ఉంచుకొని ఈ సిరీస్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను పరీక్షించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. జట్టులో నలుగురు ఓపెనర్లు ధావన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, అజింక్యా రహానేలుండటంతో తుది జట్టు ఎంపిక కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలకు తల నొప్పిగా మారింది. మిడిలార్డర్ బలంగా ఉండాలంటే నాలుగోస్థానం కీలకం. ఈ నేపథ్యంలో ఇప్పటికే గత సిరీస్‌ల్లో కొంతమంది ప్లేయర్లను పరీక్షించి చేతులు కాల్చుకుంది. గురువారం జరిగిన తొలి వన్డేతో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. చివరి టెస్టులో రాణించిన రహానే మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడటం, కెప్టెన్ కోహ్లితో 189 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పడంతో ఈస్థానానికి రహానే కరెక్ట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులు వ్యక్త పరుస్తున్నారు. ‘రహానేకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.. నాలుగో స్థానానికి అతనే కరెక్ట్.’ అని ఒకరంటే.. మిడిలార్డర్ బలంగా ఉండాలంటే నాలుగోస్థానంలో రహానేనే కొనసాగించాలని మరొకరు ట్వీట్ చేశారు. -
సెహ్వాగ్, గంభీర్.. అదే తీరు
షిమోగ: ఓపెనర్‌గా విఫలమయ్యాక బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుని మిడిలార్డర్లో దిగినా డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ (13 బంతుల్లో 7; 1 ఫోర్)కు పరిస్థితులు అనుకూలించడం లేదు. తనకు తోడుగా పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్న ఓపెనర్ గౌతం గంభీర్ (44 బంతుల్లో 11; 1 ఫోర్) కూడా మెరుగు పడడం లేదు. వెస్టిండీస్ ‘ఎ’తో ఇక్కడ జరుగుతున్న రెండో అనధికార టెస్టులోనూ ఈ ఇద్దరూ విఫలమయ్యారు. మ్యాచ్‌లో రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 191 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న ఓపెనర్ జగదీశ్ (172 బంతుల్లో 79 బ్యాటింగ్; 8 ఫోర్లు), అభిషేక్ నాయర్ (38 బంతుల్లో 56 బ్యాటింగ్; 7 ఫోర్లు; 1 సిక్స్) నిలకడగా ఆడుతున్నారు. అభిషేక్ నాయర్ టి20 తరహా ఆటతీరుతో రెచ్చిపోయాడు. 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్ పుజారా (90 బంతుల్లో 25; 1 ఫోర్) ఆకట్టుకోలేకపోయాడు. పెరుమాల్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు 283/6 ఓవర్‌నైట్ స్కోరుతో తమ రెండో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ ‘ఎ’ జట్టు... భార్గవ్ భట్ (7/113) ధాటికి తమ తొలి ఇన్నింగ్స్‌ను 406 పరుగుల వద్ద ముగించింది.