ఆనంద్, హరికృష్ణలపైనే దృష్టి
నేటి నుంచి ప్రపంచకప్ చెస్ టోర్నీ
తిబిలిసి (జార్జియా): వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు అర్హత పొందడమే లక్ష్యంగా ఆదివారం మొదలయ్యే పురుషుల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ బరిలోకి దిగనున్నారు. 128 మంది మేటి క్రీడాకారులు పాల్గొంటున్న ఈ నాకౌట్ టోర్నమెంట్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి అర్హత సాధిస్తారు. తొలి రౌండ్‌లో తియాన్ లి యో (మలేసియా)తో విశ్వనాథన్ ఆనంద్; యూరీ గొంజాలెజ్ విడాల్ (క్యూబా)తో హరికృష్ణ తలపడతారు. ప్రతి రౌండ్‌లో రెండు గేమ్‌లు జరుగుతాయి. ఎక్కువ పాయింట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ స్కోరు సమమైతే టైబ్రేక్ గేమ్‌ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
ఆనంద్, హరికృష్ణలతోపాటు భారత్ నుంచి విదిత్ సంతోష్ గుజరాతి, ఆదిబన్, దీప్ సేన్‌గుప్తా, సేతురామన్, కార్తికేయన్ మురళీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. క్యాండిడేట్స్ టోర్నీ ద్వారా ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో వచ్చే ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో తలపడే ప్రత్యర్థిని నిర్ణయిస్తారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రుస్లాన్ పొనోమరియోవ్ (ఉక్రెయిన్)తో సేతురామన్; వలేజో పోన్స్ (స్పెయిన్)తో కార్తికేయన్ మురళి; ఎన్గుయెన్ త్రుయోంగ్ సన్ (వియత్నాం)తో ఆదిబన్; వాంగ్ హావో (చైనా)తో దీప్ సేన్ గుప్తా; డెల్గాడో (పరాగ్వే)తో విదిత్ తలపడతారు. ఎనిమిది సార్లు ప్రపంచకప్ జరగ్గా... భారత్ తరఫున విశ్వనాథన్ ఆనంద్ రెండుసార్లు (2000లో, 2002లో) విజేతగా నిలిచాడు. 15 ఏళ్ల తర్వాత ఆనంద్ మరోసారి ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతుండటం విశేషం.