
ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఒక్క దక్షిణ అమెరికా జట్టు కూడా లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. నిజానికి బ్రెజిల్, ఉరుగ్వే ముందుకు వెళ్లాల్సింది. అయితే బ్రెజిల్ పలు అవకాశాలు చేజార్చుకోగా, మ్యాచ్‌లో కోలుకుంటున్న సమయంలో గోల్‌కీపర్ చేసిన తప్పిదం ఉరుగ్వే ఆట ముగించింది. మాకు పొరుగు దేశాలైన రెండు జట్లను ఓడించిన టీమ్‌లు ఇప్పుడు తొలి సెమీఫైనల్లో తలపడబోతున్నాయి. సొంతగడ్డపై 2016 యూరో ఫైనల్లో ఓడిన చేదు జ్ఞాపకాలను తుడిచేయాలని భావిస్తున్న ఫ్రాన్స్ ఇప్పుడు అన్ని రంగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. దృక్పథంలో కొంత తేడా ఉన్నా, బెల్జియం కూడా అంతే బలంగా ఉంది.
మా జట్టు చేతిలో1986లో సెమీఫైనల్లో, 2014లో క్వార్టర్ ఫైనల్లో ఓడిన బెల్జియం జట్టులో ఈసారి పట్టుదల ఎక్కువగా కనిపిస్తోంది. తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిస్తే మున్ముందు కఠినమైన ‘డ్రా’ ఎదురయ్యే అవకాశం ఉందని తెలిసినా బెల్జియం జాగ్రత్తగా ఆడి రెండో స్థానానికి పరిమితం కావాలని చూడలేదు. పెద్ద జట్లను ఎదుర్కోగల సత్తా తమలో ఉందని భావిస్తున్న ఆ టీమ్ ఎక్కడా తగ్గలేదు. ఫ్రాన్స్ మొదటి నుంచి కూడా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించే తరహా ఆటనే చూపిస్తోంది. ముఖ్యంగా కైలియాన్ ఎంబాపె వేగాన్ని, ఆంటోనీ గ్రీజ్‌మన్ స్ట్రయికింగ్ నైపుణ్యాన్ని ఆ జట్టు నమ్ముకుంది. దీంతో పోలిస్తే బెల్జియం ముందుగా చొరవ చూపించకుండా ఏదైనా జరిగితే అప్పటి పరిస్థితికి అనుగుణంగా ప్రతిస్పందించాలనే తరహా ఆట ఆడుతోంది. జట్టులో రొమెలు లుకాకులాంటి మెరుపు ఆటగాడికి హజార్డ్, డి బ్రూయిన్ తోడుగా ఉన్నారు. అయితే ఫ్రాన్స్ నుంచి ఆ జట్టుకు కొంత భిన్నమైన పరీక్ష ఎదురు కానుంది. కాసిమెరో లేకపోవడంతో మిడ్‌ఫీల్డ్‌లో బ్రెజిల్‌పై బెల్జియంకు మంచి పట్టు చిక్కింది. కానీ పాల్ పోగ్బా, ఎన్‌గొలో కాంటో వారికి ఆ అవకాశం ఇవ్వరు.
కొత్త వ్యూహంతో బ్రెజిల్‌ను బెల్జియం ఓడించడంపై చాలా చర్చ జరుగుతోందని నాకు తెలుసు. టోర్నీ కీలక దశలో ఇలా చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కానీ నా దృష్టిలో వ్యూహాన్ని ఎంత బాగా అమలు చేశారన్నదే ముఖ్యం. వ్యూహాలు, ఆలోచనలు సరే కానీ ఇలాంటి మ్యాచ్‌లు నెగ్గాలంటే ఎంతో సాహసం, పట్టుదల, పోరాటతత్వం ఉండాలి. అటు వనరులకు కొదవ లేని, స్ఫూర్తివంతమైన జట్టు ఫ్రాన్స్ ఉండటంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అటాక్, డిఫెన్స్, మిడ్‌ఫీల్డ్ అన్నింటిలో దాదాపు సమంగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల గోల్‌కీపర్లు కూడా ఎంతో ప్రతిభావంతులు. కాబట్టి ఒకరిని ఎంచుకోవడం చాలా కష్టం. అయితే ఎలాగైనా గెలవాలనే కసి మాత్రమే ఇద్దరిలో ఒకరిని విజేతగా నిలుపుతుంది. నా దృష్టిలో దీనిని ‘మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్’గా చెప్పగలను.
Comments
Please login to add a commentAdd a comment