
ప్రపంచకప్‌లో ఎంతటి మేటి జట్టుకైనా తొలి మ్యాచ్ పరీక్షగా నిలుస్తుంది. మైదానం, వాతావరణం, ప్రేక్షకుల మద్దతు తదితర అంశాలు కూడా కొత్తవిగా ఉంటాయి. 1990 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాపై కామెరూన్ సాధించిన విజయం ఇప్పటికీ మదిలో మెదులుతూ ఉంటుంది. ఆ తర్వాతి ప్రపంచకప్‌లలో మాత్రం గొప్ప జట్లు తొలి మ్యాచ్‌ను ఏమాత్రం తేలికగా తీసుకోలేదు. ప్రస్తుత వరల్డ్ కప్ విషయానికొస్తే దక్షిణ అమెరికా జట్లకు రష్యాలో తొలి మ్యాచ్‌లే కఠిన పరీక్ష పెట్టనున్నాయి. అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో యూరోప్ జట్లయిన ఐస్‌లాండ్‌తో ఆడనుంది. లియోనెల్ మెస్సీ జట్టులో ఉన్నప్పటికీ యూరోప్ జట్లను ఓడించడం సులువేమీ కాదు. మరోవైపు స్విట్జర్లాండ్‌తో బ్రెజిల్... డెన్మార్క్‌తో పెరూ తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నాయి. జపాన్ రూపంలో కొలంబియాకే కాస్త సులువైన ప్రత్యర్థి లభించింది. క్వాలిఫయర్స్‌లో అర్జెంటీనా ఆటతీరు నన్ను ఆకట్టుకోలేదు. మెస్సీ మ్యాజిక్‌తో ఆ జట్టు ముందంజ వేసిందనే చెప్పాలి. డిఫెన్స్, మిడ్‌ఫీల్డ్‌లో అర్జెంటీనా బలహీనంగా ఉంది. 2014లో ఈ అంశాల్లో అర్జెంటీనా బలంగా కనిపించింది. నాకౌట్ దశలో యూరోప్ జట్లతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా కేవలం ఒక గోల్ మాత్రమే సమర్పించుకుంది.
ప్రపంచకప్‌నకు ముందు అర్జెంటీనా తమ సన్నాహాల్లో ఎక్కువ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడలేదు. ఐస్‌లాండ్‌తోపాటు క్రొయేషియా, నైజీరియా కూడా మంచి జట్లే కావడంతో గ్రూప్ ‘డి’లో అర్జెంటీనా జాగ్రత్తగా ఉండాల్సిందే. తొలి ప్రపంచకప్ ఆడుతోందని ఐస్‌లాండ్‌ను తక్కువ అంచనా వేస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. రెండేళ్ల క్రితం ఆ జట్టు యూరో చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన విషయం మర్చిపోకూడదు. తన గొప్పతనం నిరూపించుకునేందుకు మెస్సీ ప్రపంచకప్ సాధించాల్సిన అవసరం లేదు. అయితే అతను మాత్రం ఈసారి ఎలాగైనా కప్ పట్టాల్సిందేనని పట్టుదలగా ఉన్నాడు. సెకన్లలో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల సత్తా మెస్సీలో ఉందని తెలుసు. ప్రపంచకప్ అందుకుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందనేది మాటల్లో వర్ణించలేను. మెస్సీ స్వయంగా ఈ అనుభవం తెలుసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. 2014 ప్రపంచకప్‌లో మెస్సీకి సహచరుల నుంచి అంతగా మద్దతు లభించలేదు. మెస్సీ ఉన్నంతసేపు అర్జెంటీనా ఏదైనా చేయగలదు. అయితే అతనికి సహచరుల నుంచి ఏమేరకు సహకారం అందుతుందనేది కూడా కీలకం.
Comments
Please login to add a commentAdd a comment