మారడోనా... జినెదిన్ జిదాన్.. రొనాల్డో... మిరొస్లావ్ క్లోజ్! ...తమ తమ దేశాలకు ఫుట్‌బాల్ ప్రపంచకప్ అందించిన స్టార్లు. మనందరికీ వెంటనే గుర్తుకొచ్చే పేర్లు కూడా. జార్జి బెస్ట్... ర్యాన్ జిగ్స్... ఇయాన్ రష్... జారి లిట్మనెన్! ...మరి వీరెవరో తెలుసా? కనీసం ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా? ఆ అవకాశమే లేదు! కానీ, వీరూ ఫుట్‌బాలర్లే! పై వరుసలో చెప్పుకున్నంత గొప్పవారు కాకున్నా తేలిగ్గా తీసిపారేసే వారైతే కాదు. అయితే, వీరి గురించి ఎక్కడా, ఎప్పుడూ చెప్పుకోరేం? కనీసం లీగ్‌ల్లో అయినా ప్రస్తావన రాదేం? ఎందుకంటే... వీరి దేశాలు ప్రపంచకప్‌కు ఎన్నడూ అర్హత సాధించలేదు కాబట్టి. అయినా, మహా సంగ్రామానికి అర్హత పొదండం అంత ఆషామాషీ కాదు కదా? అందుకనే ఈ స్టార్లు సూపర్ స్టార్లు కాలేకపోయారు. మరోవైపు కొన్ని చిన్న దేశాలు మాత్రం ఈ విశ్వ క్రీడా సంబరంలో తమదైన ముద్ర వేస్తున్నాయి. ఆట గొప్పదా? దేశం గొప్పదా? అంటే... ఆటతో దేశం గొప్పతనాన్ని చాటడం గొప్ప అంటున్నాయి. ఇంతకీ ఆ దేశాలేమంటే...!
సాక్షి క్రీడా విభాగం: ‘అదంతా అలా సాగిపోయింది. అయినా ఎలాంటి బాధ, విచారం లేదు. ఆటలోని పోటీతో పాటు ఆటగాళ్లందరిపైనా నాకు గౌరవం ఉంది. ప్రపంచకప్‌నకు అర్హత సాధించడం అంత సులువు కాదు’ ఈ మాటలన్నది లైబీరియన్ మాజీ ఫుట్‌బాలర్, ప్రస్తుత ఆ దేశ అధ్యక్షుడు జార్జ్ వీ. ఫిఫా ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్, బ్యాలెన్ డి ఓర్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెల్చుకున్న ఆటగాడీయన. కానీ లైబీరియా ప్రపంచ కప్‌లో ఎన్నడూ ఆడకపోవడంతో పేరు బయటకు రాలేదు. కెరీర్ ముగిశాక రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆటగాడిగా ఈయన గురించి వెదికితే ఏకంగా అధ్యక్షుడిగా కనిపించారు. ప్రస్తుతం ఫుట్‌బాల్ ద్వారా తమ చిన్న దేశానికి సాధ్యమైనంత పేరు తెచ్చానన్న సంతృప్తిలో ఉన్నారీయన. మేటి ఆటగాళ్లయిన బెస్ట్ (ఉత్తర ఐర్లాండ్), జిగ్స్, రష్ (వేల్స్), లిట్మనెన్ (ఫిన్‌లాండ్) సైతం జార్జ్ వీ కోవలోకే వస్తారు. వీరి దేశాలు చిన్నవి అయినందునే ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయం ఉంది. కానీ, కొంత అదృష్టం లేకపోవడం కూడా ఓ కారణమనే చెప్పాలి.
ఆసియా ఆటకు అంతా కలిసొస్తేనే...
కొన్ని చిన్న దేశాలు అర్హత సాధించలేకపోయినంత మాత్రాన పెద్ద దేశాలే ఫుట్‌బాల్‌ను శాసిస్తున్నాయని చెప్పడానికీ వీల్లేదు. ఆ మాటకొస్తే ఆసియాలో కోట్ల కొద్దీ జనాభా ఉన్న చైనా (2002), భారత్ (1950), ఇండోనేసియా (1938) ఒక్కొక్కసారి మాత్రమే అర్హత సాధించాయి. వివిధ కారణాలతో భారత్ ఈ అవకాశాన్నీ వదులుకుంది. చైనా 16 ఏళ్లుగా క్వాలిఫై కావడం లేదు. ఇక ఆసియా–యూరప్‌ల మధ్య ఉండే టర్కీది చిత్రమైన కథ. ఆ జట్టు 1948 తర్వాత 2002 కప్‌నకు అర్హత సాధించి, ఏకంగా మూడో స్థానంలో నిలిచి ఆశ్చర్యపర్చింది. ఈసారి మాత్రం బెర్త్ సంపాదించలేకపోయింది.
ఆఫ్రికా... ఎదుగుతున్నా ఎదురుచూపే!
దక్షిణ అమెరికా, యూరప్ తర్వాత ఫుట్‌బాల్‌కు ప్రాణం పోస్తున్నది ఆఫ్రికా ఖండమే. 1998, 2002లో అర్హత సాధించిన దక్షిణాఫ్రికా 2010లో ఆతిథ్యం కూడా ఇచ్చింది. తర్వాత మాత్రం ఊసులో లేదు. సెనెగల్ కొన్నిసార్లు సంచలనాలు సృష్టించింది. ఈసారి దాంతోపాటు ఈజిప్ట్, మొరాకో, నైజీరియా, ట్యునీషియా పోటీ పడుతున్నాయి. ఇదే ఖండంలోని మాలి, సూడాన్‌లలోనూ సాకర్‌కు క్రేజ్ ఉంది. అయినా అరంగేట్రం కలగానే ఉంటోంది. కాంగోకు 1974 ప్రపంచకప్పే మొదటిది, చివరిది.
ఉరుగ్వే దూకుడు... పరాగ్వే పరుగులు...
బ్రెజిల్, అర్జెంటీనా వంటి దిగ్గజ దేశాల ఖండం దక్షిణ అమెరికా. వీటి సమీపంలో కేవలం 34 లక్షల జనాభా ఉన్న దేశం ఉరుగ్వే, 70 లక్షల జనాభా ఉన్న దేశం పరాగ్వే. ఉరుగ్వే రెండుసార్లు ప్రపంచ చాంపియన్. 20 ప్రపంచకప్‌లకుగాను 11 సార్లు క్వాలిఫై అయింది. ‘దేశం చిన్నదా? పెద్దదా? ఎంత జనాభా ఉన్నారు? అన్నది ప్రతిభకు అడ్డంకి కాదు. మా దేశంలో ఆట పట్ల విపరీతమైన క్రేజ్ ఉంది’ అంటున్నాడు డిఫెండర్ విక్టోరినో. ‘గొప్ప చరిత్ర, అభిమానుల మద్దతున్న దేశం తరఫున ఆడుతుంటే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అది ఫుట్‌బాల్ పట్ల ఉన్న నిజమైన ఆసక్తి’ అని అతడి సహచరుడు గిగో పెరెజ్ చెబుతున్నాడు. ఇక పరాగ్వే 2011 కోపా అమెరికా టైటిల్ విజేత. ఏడుసార్లు కప్‌నకు అర్హత సాధించింది. ఈసారి విఫలమైనా ఆ దేశ స్థాయికిది గొప్పే.
యూరప్ జట్టయిన డెన్మార్క్ 1986లో అరంగేట్రం చేసి... అప్పటి నుంచి మంచి ప్రతిభనే కనబరుస్తోంది. ‘50 లక్షల జనాభా ఉన్న మా దేశం చాలా చిన్నది. ప్రపంచకప్ గెలవాలంటే ఏడు పెద్ద జట్లను ఓడించాలి. కోటి జనాభా ఉన్న దేశాలకంటే మేం ప్రతిభావంతులైన ఆటగాళ్లను అందిం చాం’ అనేది డెన్మార్క్ ఫార్వర్డ్ నిక్లస్ బెన్ట్నర్ అభిప్రాయం. కేవలం 3 లక్షల 50 వేల జనాభా ఉన్న ఐస్‌లాండ్... 40 లక్షల జనాభా ఉన్న పనామా తొలిసారి ప్రపంచకప్‌నకు అర్హత సాధించి సంచలనాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నాయి. ప్రపంచ కప్‌నకు అర్హత పొందిన అతి తక్కువ జనాభా ఉన్న దేశంగా ఐస్‌లాండ్ కొత్త రికార్డు కూడా నెలకొల్పింది. ‘ఫుట్‌బాల్ చిన్న దేశాలను పెద్దదిగా చేస్తుంది’... ఇది కామెరూన్ లెజెండ్ రోజర్ మిల్లా మాట. అవును పై ఉదాహరణలతో నిజమేననిపిస్తోంది కదా!
Comments
Please login to add a commentAdd a comment