క్వార్టర్ ఫైనల్స్ తొలి రోజు రెండు దక్షిణ అమెరికా జట్ల కోసం సవాల్ ఎదురు చూస్తోంది. బ్రెజిల్, ఉరుగ్వేలు బెల్జియం, ఫ్రాన్స్‌లతో తలపడబోతున్నాయి. పోటీ తీవ్రంగానే ఉంటుందనడంలో సందేహం లేదు కానీ మా పొరుగు దేశపు రెండు జట్లు కూడా ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్ల సేవలకు దూరం కానున్నాయి. కోచ్ టిటె మార్గదర్శనంలో కాస్మిరో బ్రెజిల్ డిఫెన్స్‌లో కీలకంగా మారాడు. జట్టు రక్షణశ్రేణిలో ప్రభావం చూపాడు. గత మ్యాచ్‌లో రెండు కార్డులు అందుకోవడంతో బెల్జియంతో మ్యాచ్‌కు దూరం కావడం బ్రెజిల్‌ను ఇబ్బంది పెట్టడం ఖాయం. మరో వైపు ఉరుగ్వే స్టార్ ఎడిన్సన్ కవాని కూడా గాయంనుంచి పూర్తిగా కోలుకోలేదని నాకు తెలిసింది. ఒక వేళ ఇదే జరిగితే ఇద్దరు అటాకింగ్ ఆటగాళ్లలో ఆ జట్టు ఒకరిని కోల్పోయినట్లే.
నాలుగేళ్ల క్రితం పూర్తిగా నెమార్‌పై ఆధారపడినదానితో పోలిస్తే ఈ సారి బ్రెజిల్ జట్టు చాలా పటిష్టంగా ఉంది. జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడమే కాదు... నెమార్, కౌటిన్హోలతో కూడిన వారి అటాక్ మరింత పదునెక్కుతోంది. గత మ్యాచ్‌లో విలియన్ కూడా రాణించాడు. తొలి మ్యాచ్‌లో మినహా గత మూడు మ్యాచ్‌లలో ఒక్క గోల్ కూడా ఇవ్వని డిఫెన్స్‌ను ప్రశంసించవచ్చు. 4–2–3–1తో టిటె పాటిస్తున్న వ్యూహంలో అంతా బాగుంది. అయితే ఒక ప్రధాన ఆటగాడు దూరమైన నేపథ్యంలో ఎలా ఉంటుందో చూడాలి.
0–2తో వెనుకబడి కూడా జపాన్‌పై గెలవడంతో వరుసగా నాలుగు విజయాలు పూర్తి చేసుకున్న బెల్జియంలో ఆత్మవిశ్వాసం నిండుగా కనిపిస్తోంది. ఎడెన్ హజార్డ్, డి బ్రూయిన్‌లాంటి మిడ్‌ఫీల్డర్లు, లుకాకు స్థాయి స్ట్రయికర్‌తో పటిష్టంగా ఉంది. పైగా మానసికంగా దృఢంగా ఉండటం జట్టును తిరుగులేనిదిగా మార్చింది. డిఫెన్స్ అంత గొప్పగా లేకపోయినా బ్రెజిల్‌ను ఒక ఆటాడించగలదు. 3–4–2–1 ఫార్మేషన్‌లో బెల్జియం బ్యాక్‌లైన్ బలహీనంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ విభాగంలో ప్రత్యర్థి తమపై ఒత్తిడి పెంచకుండా ఆ జట్టు చూసుకోవాలి. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను ఇంటికి పంపించిన జట్లు మరో క్వార్టర్ ఫైనల్లో తలపడుతున్నాయి. మెస్సీ జట్టు అర్జెంటీనాను ఫ్రాన్స్, రొనాల్డో జట్టు పోర్చుగల్‌ను ఉరుగ్వే ఓడించడంలో ఎలాంటి ఆశ్చర్యం కనిపించలేదు. కేవలం ఒక్క ఆటగాడిపైనే ఆధారపడిన ఆ టీమ్‌లపై సమష్టి ఆటతో ఈ రెండు జట్లు విజయం సాధించాయి. గతంలో నేను చెప్పినట్లు బలమైన మిడ్‌ఫీల్డ్, అటాకింగ్ కలగలిపి ఫ్రాన్స్‌ను దుర్భేద్యంగా మార్చాయి.
చిన్న అవకాశాలను కూడా అద్భుతంగా వాడుకోగల ఇద్దరు స్ట్రయికర్లు ఉన్న ఉరుగ్వే ప్రత్యర్థికి అంత తొందరగా లొంగే రకం కాదు. కవానీ గాయం ఉరుగ్వేనుబాధించేదే. అతను లేకుండా అటాక్ బలహీనంగా మారిపోతుంది. సురెజ్‌తో అద్భుత సమన్వయం ఉన్న కవాని లేకపోతే కోచ్ ఆస్కార్ తన 4–1–2–1–2 వ్యూహాన్ని మార్చుకోక తప్పదు. వారి డిఫెన్స్‌పై నాకు నమ్మకం ఉంది. కానీ ఇలాంటి మ్యాచ్‌లో ప్రధాన ఆటగాడు లేకపోతే చాలా కష్టమే. ఫ్రాన్స్ బలమంతా మిడ్‌ఫీల్డర్లే. ఆ భాగంలో మెరుగ్గా ఉంటే జట్టు గెలవగలదు. ఎంబాపెలాంటి ఆటగాడు వెలుగులోకి రావడం సంతోషంగా ఉంది. అతనికి మంచి స్వేచ్ఛనివ్వడంతో తన వేగంతో అర్జెంటీనాపై అద్భుతం చేసి చూపించాడు. ప్రత్యర్థి దృష్టంతా అతనిపైనే ఉంటుంది కాబట్టి ఉరుగ్వేతో ఎంబాపెకు అంత సులభమైన అవకాశాలు రాకపోవచ్చు. అన్ని అంశాలను బట్టి చూస్తే ఫ్రాన్స్‌కు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఉరుగ్వే కూడా ఎక్కడ తగ్గకుండా ఆడటం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment