
వ్యక్తిగతంగా వందల కొద్ది గోల్స్ చేసుండొచ్చు!లీగ్‌ల్లో ఫ్రాంచైజీలకు టైటిల్స్ కొట్టి పెట్టి ఉండొచ్చు!ఆటతో కోటానుకోట్ల మందిని మైమరపించి ఉండొచ్చు!తమ తరానికి సూపర్ స్టార్లుగా వెలుగొంది ఉండొచ్చు!...అయినా ఏం లాభం?...చంద్రుడిలో మచ్చలా ఆ ఒక్క లోటే పెద్దగా కనిపిస్తుంటే!...దేశం గర్వంగా చెప్పుకొనేంతటి ఆ ఘనత సాధించకుంటే!...వ్యక్తిగతంగానూ తీరని కోరికగా మిగిలి వెంటాడుతుంటే! ...కలకాలం నిలిచే ఆ కలికితురాయి కీర్తి కిరీటంలో లేకుంటే!
సాక్షి క్రీడా విభాగం: ఎప్పుడో ఒకప్పుడు ఫుట్‌బాల్ వార్తలను చదివే వారినో, అప్పుడో ఇప్పుడో మ్యాచ్‌లను చూసే వారినో... మీకు తెలిసిన ఆటగాళ్ల పేర్లు చెప్పండని కదిలిస్తే ఠక్కుమని వచ్చే సమాధానం లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. మధ్యలో వేన్ రూనీ, నెయ్‌మార్ వంటివారు తళుక్కుమన్నా దశాబ్ద కాలంగా మెస్సీ, రొనాల్డోల ప్రభ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానులు వీరి మధ్య రెండుగా చీలిపోయారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే ఆధునిక ఫుట్‌బాల్ రూపురేఖలు మార్చిన, అత్యంత ప్రతిష్ఠాత్మక బ్యాలన్ డి ఓర్ పురస్కారాన్ని చెరో ఐదుసార్లు గెల్చుకున్న ఇద్దరూ గొప్ప వారే. తమ జట్లకు పెద్ద దిక్కు... సమకాలీనులు... ఫార్వర్డ్ ఆటగాళ్లు... ఇలా సామీప్యతలకు తోడు ఉమ్మడిగా ఓ లోటు కూడా నీడలా వస్తోంది. ...అదే ఫిఫా ప్రపంచకప్. ‘ఆ ఒక్కటీ తప్ప’ అన్నట్లు కెరీర్ ఆసాంతం ఊరిస్తోన్న కప్‌ను అందుకునేందుకు బహుశా వీరికిదే చివరి అవకాశం. రాబోయే సమరంలో ఎవరైతే కప్ గెలిపిస్తారో... ఇద్దరి మధ్య సాగుతున్న పదేళ్ల పరోక్ష పోటీలోనూ వారే విజేతగా మిగులుతారు. ఈ నేపథ్యంలో ఎవరి పరిస్థితి ఏంటి? అవకాశాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే...!
మెస్సీ... మళ్లీ మిస్ చేయవుగా!
ఒకటి కాదు రెండు కాదు అర్జెంటీనా ప్రపంచకప్ సాధించి 32 ఏళ్లయిపోయింది. ఎప్పుడో 1986లో మెస్సీ పుట్టకముందు.... మారడోనా ‘గోల్డెన్ హ్యాండ్’తో అందించిన కప్పే ఇప్పటికీ వారికి మురిపెంగా మిగిలుంది. ఈలోగా పొరుగు దేశమైన బ్రెజిల్ రెండుసార్లు కప్ ఎగరేసుకుపోయింది. జర్మనీ సైతం రెండుసార్లు జగజ్జేతగా నిలిచింది. కానీ ఎన్నో ఆశలతో అడుగిడడం, ఉసూరుమంటూ వెనుదిరగడం మూడు దశాబ్దాలుగా అర్జెంటీనాకు అలవాటైపోయింది. అయితే, ఇన్నేళ్లలో తమకు ట్రోఫీ ఖాయంగా అందించే మొనగాడు వచ్చాడని ఆ దేశం భావించింది మాత్రం మెస్సీ వచ్చాకే. 2014 కప్ సందర్భంగా అయితే ఈ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ ఇలా దిగ్గజాలు ఒక్కొక్కటిగా వెనుదిరగడంతో ‘వైట్ అండ్ స్కై బ్లూస్’ అభిమానులు కప్ తమకేననుకున్నారు. ఇందుకుతగ్గట్టే ‘షో మ్యాన్’ మెస్సీ తమ జట్టును ఫైనల్‌కు తీసుకొచ్చాడు. హోరాహోరీ తుది సమరంలో జర్మనీ ఆటగాడు మారియో గోట్జె చేసిన ఏకైక గోల్... అర్జెంటీనా కప్ నిరీక్షణను మరింత పెంచింది. అప్పటికీ ఓసారి బంతిని గోల్‌పోస్ట్‌కు అతి సమీపంగా కొట్టిన మెïస్సీకి పెనాల్టీ కిక్ రూపంలో చరిత్రలో నిలిచిపోయే అవకాశం వచ్చింది.
కానీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పదికి తొమ్మిదిసార్లు పెనాల్టీ కిక్‌లను గోల్‌గా మలిచే మెస్సీ... ఆ ఒక్కదానిని అత్యంత కీలక సమయంలో ‘మిస్’ అవడం చిత్రమనే చెప్పాలి. ప్రస్తుతానికి వస్తే ఎప్పటిలానే జట్టు కెప్టెన్‌గా మెస్సీ దేశ ఆశలన్నిటినీ మోస్తున్నాడు. ఇప్పటికే ఓసారి రిటైర్మెంట్ ప్రకటించి, అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిడితో విరమించుకున్న మెస్సీ... వచ్చే నెలతో 31 ఏళ్లు పూర్తిచేసుకోనున్నాడు. వచ్చేసారి 35 ఏళ్ల ప్రాయంలో తను మహాద్భుతం చేస్తాడని మాత్రం ఊహించలేం. అంటే అతడికి ఇదే దాదాపు చివరి కప్. అందుకని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బుధవారం హైతీతో సన్నాహక మ్యాచ్‌లో 50 నిమిషాల వ్యవధిలో హ్యాట్రిక్ కొట్టిన మెస్సీ... తర్వాత తన మాటల్లోనూ చాలా కసిని చూపాడు. అయితే, గ్రూప్ డిలో ఉన్న ఆ జట్టుకు క్రొయేషియా, నైజీరియాలతో ముప్పు పొంచి ఉంది. మేటి ఆటగాడైనా, గత కప్‌లో విఫలమైన హిగుయెన్‌తో పాటు అగ్యురో వంటి వారు మెస్సీ మ్యాజిక్‌కు తోడైతే మాత్రం అర్జెంటీనాకు ఎదురుండదు.
‘లీగ్’ రారాజు రాణిస్తాడా...?
లీగ్‌ల రారాజు... క్రిస్టియానో రొనాల్డో గురించి ఒక్క ముక్కలో చెప్పే మాట ఇది. లా లీగా, కోపాస్ డెల్ రే, యూఈఎఫ్‌ఏ చాంపియన్స్ లీగ్ ఇలా ప్రపంచంలో ఏ లీగ్ చూసినా రొనాల్డో ప్రభంజనం కనిపిస్తుంది. తాజాగా అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న రియల్ మాడ్రిడ్ చాంపియన్స్ లీగ్‌లో విజేతగా నిలిచింది. కానీ, ప్రపంచకప్‌నకు వచ్చేసరికి అతడి ప్రభ మసకబారుతుంది. పోర్చుగల్ జట్టు అంత బలంగా లేకపోవడం కూడా రొనాల్డోపై ప్రభావం చూపుతోంది. 2014లో అతడి ఫామ్ అత్యుత్తమంగా ఉన్నప్పుడే పోర్చుగల్ 18వ స్థానంలో నిలిచిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈసారి కూడా క్రిస్టియానో పైనే జట్టు మొత్తం ఆశలు పెట్టుకుంది. ప్రాటిసియో, పెపె, గ్యురెరోలు ఓ చేయి వేస్తేనే పోర్చుగల్ ముందుకెళ్తుంది. గ్రూప్ బిలో ఉన్న స్పెయిన్, మొరాకో గండాలను దాటాల్సి ఉంటుంది. కప్ సాధిస్తామని రొనాల్డోకూ నమ్మకం లేనట్లుంది. బ్రెజిల్, స్పెయిన్, జర్మనీ, అర్జెంటీనాలే ఫేవరెట్‌లంటూ తనే ప్రకటించాడు కూడా. ప్రపంచంలో అత్యంత ధనిక ఆటగాడిగా పేరున్న 33 ఏళ్ల రొనాల్డో... ప్రపంచంలో తానే మేటి ఫుట్‌బాలర్‌నంటూ ప్రకటించుకున్నాడు. తాజాగా కప్ లేకున్నా తన కీర్తి ఏమాత్రం తగ్గదంటూ వ్యాఖ్యానించాడు. దీన్నిబట్టి అతడు వాస్తవంలో ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. తానెంత చెప్పినా ప్రపంచకప్ లేని లోటు లోటే కదా!
Comments
Please login to add a commentAdd a comment