భారత్ జోరైన ఆటతో ఏక పక్షంగా ప్రారంభమై... వెస్టిండీస్ పోరాటంతో అటుఇటు మలుపులు తిరిగిన వన్డే సిరీస్ తుది అంకానికి చేరింది. రెండు జట్ల మధ్య నాలుగో మ్యాచ్ మాత్రమే సాదాసీదాగా సాగింది. ముంబైలో సరైన కూర్పుతో బరిలో దిగి ప్రత్యర్థిని చుట్టేసింది టీమిండియా. ఇప్పుడిక ఆఖరి వన్డే! మరి... కోహ్లి సేన అదే జోరుతో విండీస్‌ను ఓడిస్తుందా? లేక... అంత తేలిగ్గా తలొగ్గని హోల్డర్ బృందం సిరీస్‌ను సమం చేస్తుందా?
తిరువనంతపురం: సొంతగడ్డపై మరో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు కోహ్లి సేన అడుగు దూరంలో ఉంది. స్వదేశంలో దాదాపు మూడేళ్లుగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఎదురైన ప్రతి ప్రత్యర్థిని మట్టి కరిపించి సిరీస్ మీద సిరీస్ గెలుస్తోంది టీమిండియా. ఈ క్రమంలో తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో గురువారం జరుగనున్న ఐదో వన్డేలో వెస్టిండీస్‌ను ఓడిస్తే ఈ ఖాతాలో ఇంకోటి చేరుతుంది. పూర్తి స్థాయి సత్తా మేరకు ఆడితే ఇదేమంత కష్టమూ కాబోదు. అయితే, తొలుత చేతులెత్తేస్తుందనిపించిన పర్యాటక జట్టు... తర్వాత ప్రతిఘటించింది. ఓ మ్యాచ్ గెలిచి తమను తక్కువ అంచనా వేయొద్దని చాటింది. ఈ నేపథ్యంలో సిరీస్‌ను సమం చేసే అవకాశాన్ని అంత సులువుగా వదులుకుంటుందని భావించలేం.
ఇదే కూర్పుతో కొట్టేయాలి
బ్యాటింగ్‌ను పటిష్ట పర్చుకుని, బౌలింగ్‌లో వైవిధ్యంతో ముంబై వన్డేలో దిగిన టీమిండియా ఘన విజయం సాధించింది. వాస్తవానికి ఇదే సరైన కూర్పు. దీంతో చివరి మ్యాచ్‌లో కోహ్లి సేన మార్పుల్లేకుండానే ఆడొచ్చు. ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం, మాజీ కెప్టెన్ ధోని తనదైన ఇన్నింగ్స్ ఆడలేకపోవడం తప్ప బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యల్లేవనే చెప్పాలి. రెండు శతకాలతో రోహిత్‌శర్మ, మూడు సెంచరీలతో కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుత ఫామ్‌లో ఉండగా, అర్ధ శతకం, శతకంతో నాలుగో స్థానానికి నిఖార్సైన బ్యాట్స్‌మన్‌నని అంబటి తిరుపతి రాయుడు చాటుకున్నాడు. కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఆర్డర్ లోతును పెంచారు. ప్రారంభంలో పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలను ఎదుర్కొనడం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు తలకుమించిన భారం అవుతోంది. యువ పేసర్ ఖలీల్ అహ్మద్ ఆకట్టుకుంటుండగా, స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ యాదవ్ మధ్య ఓవర్లలో విండీస్‌ను కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చహల్‌కు చోటు దక్కకపోవచ్చు. భువీ పరుగులు ఇస్తుండటమే కొంత ఆందోళన కలిగిస్తోంది. అతడిలాంటి బౌలర్ మ్యాచ్ ఏ దశలోనైనా ఉపయోగకరమే. ముంబైలోలా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విరుచుకుపడితే సిరీస్ 3–1తో టీమిండియా వశం కావడం ఖాయం.
విండీస్ రెండు మార్పులతో...
బౌలర్లు నిరాశపర్చినా, అత్యంత సీనియర్ శామ్యూల్స్ పేలవ ఫామ్‌లో ఉన్నా, సిరీస్ చేజారకుండా విండీస్ ఐదో మ్యాచ్ ఆడుతోందంటే ఇద్దరు బ్యాట్స్‌మెనే కారణం. వారు షై హోప్, హెట్‌మైర్. వీరికి ఓపెనర్ కీరన్ పావెల్, కెప్టెన్ హోల్డర్ సహకారం అందించడంతో ఆ జట్టు టీమిండియా ముందు నిలవగలిగింది. నాలుగో వన్డేలో హోల్డర్ మినహా మిగతా ముగ్గురూ విఫలమవడంతో భారీ తేడాతో ఓడింది. దీంతో కీలకమైన చివరి మ్యాచ్‌కు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఒక్కో మార్పుతో దిగనుంది. ఇప్పటివరకు కనీస స్కోర్లు చేయని ఓపెనర్ హేమ్‌రాజ్ స్థానంలో సునీల్ ఆంబ్రిస్‌ను, ఏమాత్రం ప్రభావం చూపని ఫాబియాన్ అలెన్ బదులుగా దేవేంద్ర బిషూలను తుది జట్టులోకి తీసుకోనుంది. పేసర్లు కీమర్ రోచ్, కీమో పాల్ పేరుకే అన్నట్లుండటం, స్పిన్నర్లు నర్స్, బిషూ అంతగా ప్రతిభావంతులు కాకపోవడంతో... ముందుగా బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోరు చేస్తేనే విండీస్‌కు టీమిండియాపై నెగ్గే అవకాశాలు కాస్తయినా ఉంటాయి. హెట్‌మైర్, హోప్‌తో పాటు శామ్యూల్స్, రావ్‌మాన్ పావెల్ రాణిస్తేనే ఇది జరిగేందుకు వీలుంటుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్, ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ధోని, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, ఖలీల్, బుమ్రా
వెస్టిండీస్: హేమ్‌రాజ్/ఆంబ్రిస్, కీరన్ పావెల్, హోప్, శామ్యూల్స్, రావ్‌మాన్ పావెల్, హోల్డర్, నర్స్, కీమో పాల్, రోచ్, అలెన్/బిషూ.
►ధోని మరో పరుగు చేస్తే వన్డేలో భారత్ తరఫున 10 వేల పరుగులు పూర్తవుతాయి. అతను ఇప్పటికే వన్డేల్లో 10173 పరుగులు సాధించినా... ఇందులో 174 పరుగులు ఆసియా ఎలెవన్ జట్టు తరఫున చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment